Share News

భారీగా గంజాయి పట్టివేత.. విలువ రూ.1.06 కోట్లు

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:59 AM

అనకాపల్లి జిల్లా లంకెలపాలెం వద్ద మంగళవారం పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఎస్పీ తుహిన్‌సిన్హా విలేకరులకు తెలిపారు.

భారీగా గంజాయి పట్టివేత.. విలువ రూ.1.06 కోట్లు

  • అంతర్జాతీయ స్మగ్లర్‌ అజ్మల్‌ఖాన్‌ అరెస్టు ..కారు, బైక్‌, నగదు స్వాధీనం

తుమ్మపాల (అనకాపల్లి), జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా లంకెలపాలెం వద్ద మంగళవారం పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఎస్పీ తుహిన్‌సిన్హా విలేకరులకు తెలిపారు. లంకెలపాలెం జంక్షన్‌లో మంగళవారం పరవాడ పోలీసులు సుమారు 213 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ చెప్పారు. దీని విలువ సుమారు రూ.కోటి ఆరు లక్షల 68 వేలు ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లర్‌ షేక్‌ అజ్మల్‌ఖాన్‌తోపాటు మరో నలుగురిని అరెస్టు చేశామన్నారు. ఒక కారు, హీరో హోండా మోటార్‌ సైకిల్‌, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.95,240 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పక్కా సమాచారం మేరకు పరవాడ పోలీసులు లంకెలపాలెం జంక్షన్‌ వద్ద తనిఖీలు చేపట్టగా అంతర్జాతీయ నేర చరిత్ర కలిగిన తమిళనాడుకు చెందిన షేక్‌ అజ్మల్‌ఖాన్‌ తన బృందంతో గంజాయి తరలిస్తూ పట్టుబడ్డాడన్నారు. ఒడిశా రాష్ట్రంలోని జనభ ప్రాంతానికి చెందిన శ్యామ్‌, షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌ నుంచి గంజాయిని అజ్మల్‌ఖాన్‌ సేకరించాడని, గంజాయి రవాణా ఏర్పాట్లను తోలం దుర్గాప్రసాద్‌ చూశాడని, కొల్లేజి లోవప్రసాద్‌ తన కారులో తరలించే ప్రయత్నం చేశాడని తెలిపారు. ఈ వ్యవహారంలో ఒడిశా, అల్లూరి జిల్లా పెదబయలుకు చెందిన మరికొంతమంది ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు. అత్యంత సాహసోపేతంగా తనిఖీలు నిర్వహించి, అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాను పట్టుకున్న పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు.

Updated Date - Jun 18 , 2026 | 03:59 AM