జిల్లా వైభవాన్ని చాటిచెప్పేలా అనకాపల్లి ఉత్సవ్
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:06 PM
జిల్లా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అనకాపల్లి ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
29, 30 తేదీల్లో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలి
హోం మంత్రి వంగలపూడి అనిత
అనకాపల్లి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అనకాపల్లి ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. విశాఖ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న అనకాపల్లి ఉత్సవ్ కార్యక్రమ ఏర్పాట్లపై కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, పంచకర్ల రమేశ్‌బాబు, కార్పొరేషన్ల చైర్మన్లు పీలా గోవింద సత్యనారాయణ, బత్తుల తాతయ్యబాబు, మళ్ల సురేంద్ర, జిల్లా అధికారులు, శ్రేయాస్ మీడియా ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులతో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా జరిగే అనకాపల్లి ఉత్సవ్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణలో ఎమ్మెల్యేలు ఇచ్చిన సూచనలు స్వీకరించి అమలు చేయాలని తెలిపారు. ఉత్సవ్ నిర్వహణ ద్వారా జిల్లా చరిత్రను మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవకాశం లభించిందన్నారు. అందరి సహకారంలో జిల్లా వైభవాన్ని చాటిచెప్పేలా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా స్టాల్స్, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలు, వేదికల వద్ద భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బోటింగ్‌లో ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ ధరించాలన్నారు. బోటు షికార్ల వద్ద గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫుడ్ స్టాల్స్‌లో ఏర్పాటు చేసే స్టాల్స్‌లోని ఆహారంలో నాణ్యత తనిఖీలు, పరిసరాల్లో శానిటేషన్, నీటి సరఫరా పక్కాగా జరగాలన్నారు. కళాకారులు, క్రీడాకారులకు సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఉత్సవాల వద్ద ఈవ్‌టీజింగ్ వంటి సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమం నిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం చేసినా, సమస్యలు సృష్టించాలని ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో మూడు ప్రదేశాల్లో ఉత్సవాలు
ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి, ఎమ్మెల్యేలకు కలెక్టర్ విజయకృష్ణన్ వివరించారు. మూడు ప్రదేశాల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొండకర్ల ఆవ, తిక్కవానిపాలెం, అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియాల్లో ఉత్సవాలు జరుగుతాయన్నారు. కొండకర్ల ఆవ వద్ద బోటింగ్, జిల్లా సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించే విధంగా స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తిక్కవానిపాలెం వద్ద సాహస క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో, బెల్లం మార్కెట్ ప్రాంగణంలో ఫ్లవర్‌షో, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, బాణసంచా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా 29వ తేదీన సింగర్ సునీత, 30వ తేదీన రామ్ మిరియాల సంగీత విభావరి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఏటికొప్పాక బొమ్మల తయారీ, కుండల తయారీ విధానంపై స్టాల్స్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించనున్నామన్నారు.
ఉత్సవాల్లో పరిశ్రమలు భాగస్వాములు కావాలి
జిల్లాలో తొలిసారి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అనకాపల్లి ఉత్సవ్ కార్యక్రమ నిర్వహణలో పరిశ్రమలు భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. శనివారం కలెక్టరేట్‌లో పరిశ్రమల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముత్యాలమ్మ తీరంలో వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు. కంపెనీల లోగోలతో కూడిన సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని, దీన్ని కంపెనీల ప్రతినిధులు వినియోగించుకోవాలని కోరారు. పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల కుటుంబాలు ఉత్సవ్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్సవ్ నిర్వహణ బ్రోచర్‌ను కలెక్టర్ విడుదల చేశారు.