అప్పుడు అడ్డుకుని.. ఇప్పుడు పరామర్శలా?: అనగాని
ABN , Publish Date - Apr 15 , 2026 | 06:03 AM
తండ్రి వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో జువ్వలదిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టు రాకుండా అడ్డుకునేలా జీవోలు ఇప్పించిన జగన్... ఏ మొహం పెట్టుకొని నేడు జువ్వలదిన్నె పర్యటనకు వెళ్తున్నారు? అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు.
అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): తండ్రి వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో జువ్వలదిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టు రాకుండా అడ్డుకునేలా జీవోలు ఇప్పించిన జగన్... ఏ మొహం పెట్టుకొని నేడు జువ్వలదిన్నె పర్యటనకు వెళ్తున్నారు? అని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. ‘కృష్ణపట్నం పోర్టుపై ఆధిపత్యం సాధించావు. ఆ పోర్టు నుంచి సొమ్ములు వసూలు చేసుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో తీరం వెంట మరో పోర్టు కానీ హార్బర్ కానీ నిర్మించడానికి వీల్లేదంటూ జీవో నంబరు 40 ఇప్పించావు. ఇవి వాస్తవాలు కావా? 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే జువ్వల దిన్నె హార్బర్, రామాయపట్నం పోర్టు పనుల్లో కదలిక వచ్చింది. మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు రాబోతున్న తరుణంలో దాన్ని చూసి తట్టుకోలేని జగన్ వారి నడుమ చిచ్చు పెట్టేందుకే జువ్వలదిన్నె వెళుతున్నారు’ అని అనగాని విమర్శించారు.