Share News

షా ఫార్ములాతో ఏపీకి 38 ఎంపీ సీట్లు: పురందేశ్వరి

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:34 AM

నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రతిపాదించిన 50 శాతం పెంపు ఫార్ములా ఏపీకి మేలు చేస్తుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.

షా ఫార్ములాతో ఏపీకి 38 ఎంపీ సీట్లు: పురందేశ్వరి

రాజమహేంద్రవరం అర్బన్‌, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రతిపాదించిన 50 శాతం పెంపు ఫార్ములా ఏపీకి మేలు చేస్తుందని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. అలా కాకుండా 2026 జనాభా లెక్కల ప్రకారం అయితే.. ప్రస్తుతమున్న 25 స్థానాల్లో 5 సీట్లకు కోతపడుతున్నారు. చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు వీగిపోవాలనే ఒకే లక్ష్యంతో విపక్షాలు పనిచేశాయని, మహిళలకు అన్యాయం చేసిన విపక్షాలు క్షమాపణ చెప్పాలని పురందేశ్వరి డిమాండ్‌ చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆమె మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు మూడు దశాబ్దాల కల అని, ఇప్పటికే ఆలస్యం జరిగిందని అన్నారు. మహిళా బిల్లు 2023లోనే పార్లమెంట్‌లో పాస్‌ అయిందని, దీనిని డీలిమిటేషన్‌ బిల్లుతో ఎందుకు కలిపారనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయన్నారు. కానీ, 2026 జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ బిల్లులో పొందుపరిచారన్నారు. ఈ లెక్కన 2029లో రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితిలేదని, 2034 వరకు వేచి చూడాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లోనే రాజ్యాంగ సవరణకు సిద్ధమయ్యారని తెలిపారు. కానీ, బిల్లును నీరుగార్చాలనే ఆలోచనతో విపక్షాలు వీగిపోయేలా చేసి, దేశ మహిళలను వంచించాయని విమర్శించారు. 2026 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లకు వెళితే కచ్చితంగా సీట్లు తగ్గుతాయన్నారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలగకుండా ఉండేందుకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని.. అమిత్‌ షా 50 శాతం పెంపు ఫార్ములాను తీసుకువచ్చారని తెలిపారు. ఫలితంగా ప్రస్తుతమున్న సీట్లకు అదనంగా 50 శాతం స్థానాలు పెంచుతామని ప్రతిపాదించారన్నారు. దీనివల్ల విపక్షాలకు ఇబ్బందేమిటని పురందేశ్వరి ప్రశ్నించారు.

Updated Date - Apr 22 , 2026 | 05:35 AM