ఐదో తరానికి స్వాగతం!
ABN , Publish Date - May 15 , 2026 | 04:13 AM
అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)... భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న తొలి స్వదేశీ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఇది. దీన్ని డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ఏరోనాటికల్..
పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ, అసెంబ్లింగ్, ఫ్లైట్ టెస్టింగ్ కేంద్రం ఏర్పాటు
దేశంలోనే తొలి ఐదోతరం యుద్ధ విమానాల తయారీ ఇక్కడే
భారీ ప్రాజెక్టు రాకతో ఏరోస్పేస్ హబ్‌గా శ్రీసత్యసాయి జిల్లా
అనుబంధ సంస్థల ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు
అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)... భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న తొలి స్వదేశీ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఇది. దీన్ని డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ (ఏడీఏ) రూపొందిస్తోంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా, గగనతలంలో సంపూర్ణ ఆధిపత్యం చలాయించేలా దీన్ని తయారు చేస్తున్నారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పుట్టపర్తిలో ఏర్పాటు కానుంది. రూ.15,803 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ భారీ ప్రాజెక్టుతో రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా, భారత రక్షణ రంగానికి వెన్నెముకగా నిలిచే ఫైటర్ జెట్ల ఉత్పత్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఖ్యాతి గడించనున్నాయి. ముఖ్యంగా పుట్టపర్తి, పాలసముద్రం, మడకశిర ప్రాంతాలు రక్షణ రంగ ఉత్పత్తి కేంద్రాలవుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 7500 మందికిపైగా ఉపాధి లభించనుంది. జిల్లాలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి.
పుట్టపర్తిలోనే ఎందుకు..?
భారత్‌లో యుద్ధ విమానాల తయారీ కోసం ఇప్పటికే బెంగళూరు, హైదరాబాద్, నాసిక్‌లో కేంద్రాలున్నాయి. అయితే అక్కడ సుఖోయ్, తేజస్ వంటి ఫైటర్ జెట్లు తయారీ, మరమ్మతులు, విడిభాగాల తయారీ జరుగుతోంది. పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో పూర్తిగా ఐదోతరం ఏఎంసీఏల తయారీ, అసెంబ్లింగ్, ఫ్లైట్ టెస్టింగ్ చేపడతారు. ఇక్కడ 140 ఏఎంసీఏలను తయారు చేస్తారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రన్‌వే, ఈ కేంద్రం బెంగళూరుకు సమీపంలో ఉండడం, ఎయిర్ ట్రాఫిక్ రద్దీ లేని అనుకూల వాతావరణం.. వంటివన్నీ పుట్టపర్తిని ఎంచుకోవడానికి ప్రధాన కారణం. అలాగే సమీపంలోని బెంగళూరులోనే ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ (ఏడీఏ) డిజైన్, సాంకేతిక వ్యవస్థలకు కేంద్రంగా ఉంది. పుట్టపర్తి ఇక్కడకు దగ్గరగా ఉండడం వల్ల ఇరు కేంద్రాల మధ్య సమన్వయం, రవాణా సులభంగా ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్న రన్‌వేను 10వేల అడుగులకు పొడిగించడంతోపాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి 600 ఎకరాలకుపైగా భూమి అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా ఇక్కడ దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు, విడిభాగాల తయారీ యూనిట్లు వస్తాయని, తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తోంది.
లోపలి ఆయుధాలు..
ఏఎంసీఏలో ఇంటర్నల్ వెపన్స్ బే ఉంటుంది. దీనిలో 1..5 టన్నుల బరువైన ఆయుధాలను అమర్చవచ్చు. వీటిలో స్వదేశీ, లాంగ్ రేంజ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ అయిన అస్త్ర మార్క్-2, మార్క్-3, సుదూర లక్ష్యాలను ఛేదించే క్రూయిజ్ క్షిపణులు, శత్రువుల ఎయిర్‌ఫీల్డ్‌లను ధ్వంసం చేయడానికి ఉపయోగించే స్వదేశీ బాంబులు, అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే లేజర్ గైడెడ్ బాంబులు ఉంటాయి.
వెలుపలి ఆయుధాలు
స్టెల్త్ అవసరం లేని మిషన్ల కోసం విమానం వెలుపల 5.5 టన్నుల బరువున్న ఆయుధాలను అమర్చవచ్చు. వీటిలో బ్రహ్మోస్ తర్వాతి తరం సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, స్వల్ప లక్ష్యాలను ఛేదించేందుకు అస్త్ర-ఎంకే1 క్షిపణులు, క్లస్టర్ బాంబులు, 30 ఎంఎం ఆటోక్యానన్ గన్ ఉంటాయి. అలాగే ఏఎంసీఏలో ఆయుధాలతోపాటు.. అవసరాన్ని బట్టి అదనపు ఇంధన ట్యాంకులను కూడా నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల విమానం ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆయుధాల ఎంపిక, ప్రయోగానికి ఏఐ ఆధారిత వ్యవస్థలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం ఏ దశలో ఉంది
ఏఎంసీఏ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15,803 కోట్లు అందిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రొటోటైప్ (నమూనా) తయారీ దశలో ఉంది. 2028-29 నాటికి తొలి ప్రొటోటై్‌పకు పరీక్షలు పూర్తిచేసి.. 2032 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించాలని, 2035 నాటికి భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏఎంసీఏలో ఆయుధాలివే..!
అత్యాధునిక స్వదేశీ, విదేశీ ఆయుధాలను మోసుకెళ్లగలిగేలా ఏఎంసీఏను రూపొందిస్తున్నారు. ఇది స్టెల్త్ ఫైటర్ జెట్ కావడం వల్ల శత్రువుల రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు విమానం లోపల ఆయుధాలను అమర్చుతారు. అలాగే స్టెల్త్ అవసరం లేని మిషన్ల కోసం విమానం వెలుపల కూడా ఆయుధాలు అమర్చుకునేలా దీన్ని డిజైన్ చేస్తున్నారు.
మ్యాన్డ్-అన్‌మ్యాన్డ్ టీమింగ్
ఏఎంసీఏ అనేది ఒక హైబ్రిడ్ యుద్ధ విమానం. దీనిలో మ్యాన్డ్-అన్‌మ్యాన్డ్ టీమింగ్ (ఎంయూఎంటీ) అనే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అంటే మానవ సహిత, మానవ రహిత యుద్ధ విమానాల సమ్మేళనం. ప్రధాన ఫైటర్ జెట్‌ను పైలట్ నడుపుతాడు కాబట్టి దీన్ని మానవ సహిత యుద్ధ విమానం... అలాగే దీనిలో కొన్ని డ్రోన్లు కూడా ఉంటాయి కాబట్టి మానవ రహిత యుద్ధ విమానంగా పనిచేస్తుంది. మ్యాన్డ్-అన్‌మ్యాన్డ్ టీమింగ్ వ్యవస్థలో కృత్రిమ మేధ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని ఏఐ ఆధారిత డ్రోన్లు.. పైలట్ నడిపే ఏఎంసీఏకు నమ్మకమైన భాగస్వామిగా పనిచేస్తాయి. ఈ డ్రోన్లు స్వయంప్రతిపత్తిగా పనిచేస్తాయి కానీ.. అవసరమైనప్పుడు పైలట్ ఆదేశాలను పాటిస్తాయి. యుద్ధ సమయంలో ముందుగా ఈ డ్రోన్లు సేకరించిన సమాచారాన్ని ఏఎంసీఏలోని ఏఐ సాంకేతికత విశ్లేషించి పైలట్‌కు యుద్ధ రగం గురించి స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది. శత్రు దేశాల రక్షణ వ్యవస్థలను ఛేదించడం కోసం భారత్ అభివృద్ధి చేస్తున్న ఆధునిక యుద్ధ వ్యూహమిది.
ఏఎంసీఏ.. ఎందుకంత ప్రత్యేకం..?
శత్రువుల రాడార్లు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు, ఇతర నిఘా వ్యవస్థలకు చిక్కకుండా ఉండేందుకు దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. దీంతో ఇవి శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి సులభంగా దాడి చేసి రాగలవు. ఆయుధాలు బయటకు కనిపించకుండా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేయనున్నారు. అంటే శత్రువులకు కనిపించకుండా ఉండేందుకు బాంబులు, క్షిపణులను యుద్ధ విమానం లోపల ప్రత్యేకంగా అమర్చుతారు. దీంతో శత్రు రాడార్లు వీటిని కనిపెట్టలేవు. అలాగే గాలి నిరోధకత తగ్గి జెట్ వేగం పెరుగుతుంది. అమెరికాకు చెందిన ఎఫ్-35, ఎఫ్-22, చైనాకు చెందిన జే-35 వంటి ఫైటర్ జెట్లలో ఇలాంటి సౌలభ్యమే ఉంది. దీనిలో ట్విన్ ఇంజన్లు ఉంటాయి. ప్రారంభంలో తయారు చేసే ఎంకే1 వేరియంట్లలో అమెరికాకు చెందిన జీఈ-414 ఇంజన్లను.. ఈ తర్వాత రాబోయే ఎంకే2 మోడల్స్‌లో పూర్తి స్వదేశీ/విదేశీ భాగస్వామ్యంతో కూడిన ఇంజన్లను ఉపయోగిస్తారు.
సూపర్ క్రూయిజ్ సామర్థ్యం..
ఇది ఆఫ్టర్‌బర్నర్‌ను ఉపయోగించకుండానే (ఇంధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయకుండా) శబ్ధ వేగం కంటే ఎక్కువ వేగం (మాక్ 2.15 లేదా గంటకు 2,600 కి.మీ.)తో ప్రయాణిస్తుంది. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత వ్యవస్థలు, ఏఈఎస్ఏ (యాక్టివ్ ఎలక్‌ట్రనికల్లీ స్కాన్‌డ్ ఎరే) రాడార్లు, స్మార్ట్ సెన్సర్ ఫ్యూజన్లు వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. ఈ మల్టీరోల్ ఫైటర్ జెట్ 25 టన్నుల బరువు ఉంటుంది. దీని పోరాట పరిధి దాదాపు 1630 కిలోమీటర్లు.
- సెంట్రల్ డెస్క్