Share News

దేశానికి రక్షణ ‘సీమ’

ABN , Publish Date - May 15 , 2026 | 04:06 AM

ఒకప్పుడు రతనాల సీమగా వెలుగొందిన రాయలసీమ... నేడు దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా నిలవనుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో..

దేశానికి రక్షణ ‘సీమ’

  • పుట్టపర్తిలో ఐదో తరం ఫైటర్‌ జెట్ల తయారీ కేంద్రం

  • నేడు ఏఎంసీఏ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన

  • రక్షణ, డ్రోన్‌ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులకు కూడా

  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌, సీఎం చంద్రబాబు రాక

  • శ్రీసత్యసాయి జిల్లా చరిత్రలో సరికొత్త అధ్యాయం

పుట్టపర్తి, అమరావతి, న్యూఢిల్లీ, మే 14 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు రతనాల సీమగా వెలుగొందిన రాయలసీమ... నేడు దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా నిలవనుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో.. దేశంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక ఐదో తరం అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న ఏఎంసీఏ ఇంటిగ్రేషన్‌, ఫ్లైట్‌ టెస్టింగ్‌ కేంద్రానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. మంత్రి లోకేశ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలోని ఏరోనాటికల్‌ డెవల్‌పమెంట్‌ ఏజెన్సీ (ఏడీఏ) ఈ భారీ ప్రాజెక్టు చేపట్టనుంది. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్‌వేకి అనుసంధానంగా తొలిదశలో 138 ఎకరాల్లో రూ.15,803 కోట్ల పెట్టుబడితో ఫైటర్‌జెట్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు.. డీఆర్‌డీవో, ఏడీఏ ఆధ్వర్యంలో 140 ఏఎంసీఏలను ఇక్కడ తయారు చేస్తారు. ఐదోతరం యుద్ధ విమానాల అసెంబ్లింగ్‌, ఆన్‌గ్రౌండ్‌ టెస్టింగ్‌ కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం పుట్టపర్తిలో 600 ఎకరాలు కేటాయిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. వీటికోసం మరో 400 ఎకరాల భూములను ప్రభుత్వం సిద్ధం చేసింది. వీటితోపాటు కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న డ్రోన్‌ సిటీ ద్వారా భారత్‌లో అత్యుత్తమ డ్రోన్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటు కానుంది. ఏఎమ్‌సీఏ ప్రాజెక్టుతో పాటు డిఫెన్స్‌ రంగానికి చెందిన నాలుగు ప్రాజెక్టులు, కర్నూలు జిల్లాలో ఎనిమిది డ్రోన్‌ ప్రాజెక్టుల ద్వారా రూ.4,145 కోట్లు పెట్టుబడులు, 6071 మందికి ఉద్యోగాలు రానున్నాయి.


మరో నాలుగు సంస్థలు ఇవే..

ఏఎంసీఏ ప్రాజెక్టుతోపాటు ప్రముఖ రక్షణ డ్రోన్‌ తయారీ సంస్థల ఏర్పాటుకు కూడా రక్షణ మంత్రి శుక్రవారం భూమి పూజ చేస్తారు. మడకశిరలో కళ్యాణి స్ర్టాటజిక్‌ లిమిటెడ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఆగ్నేయాస్త్ర ఎనర్జెటిక్స్‌ సంస్థ 949.65 ఎకరాల్లో రూ.2,400 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించనుంది. భారత డైనమిక్స్‌ లిమిటెడ్‌... మిస్సైల్స్‌ సిస్టమ్స్‌ రంగంలో రూ.489 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. హెచ్‌ఎ్‌ఫసీఎల్‌ సంస్థ మల్టీ-మోడ్‌ హ్యాండ్‌ గ్రెనేడ్‌ (ఎంఎంహెచ్‌ జీ)తోపాటు ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ కోసం రూ.230 కోట్ల ప్రాథమిక మూలధన వ్యయంతో రక్షణ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్‌.. డిఫెన్స్‌ ప్రొపెల్లెంట్స్‌ వార్‌ హెడ్స్‌ తయారీలో రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతుంది.

శరవేగంగా అభివృద్ధి

శ్రీసత్యసాయి జిల్లాలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. ఇప్పటికే పాలసముద్రం వద్ద భారత్‌ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బెల్‌) ఆధ్వర్యంలో 1000 ఎకరాల్లో ఢిఫెన్స్‌ సిస్టమ్‌ ఇంటిగ్రేటెడ్‌ కాంపెక్స్‌ ఏర్పాటవుతోంది. ఆ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడి పెడుతోంది. క్షిపణి వ్యవస్థలు, రాడార్లు, ఎలక్ర్టానిక్‌ యుద్ధ వ్యవస్థ, ఏరోస్పేస్‌ రంగానికి అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ తయారుచేస్తారు.

డ్రోన్‌ ప్రాజెక్టులు ఇవే..

  • ఆల్గోబాటిక్స్‌ ప్రై.లి... రూ.34 కోట్ల పెట్టుబడి.. 52 మందికి ఉపాధి

  • డ్రోగో డ్రోన్స్‌ ప్రై.లి.. రూ.255 కోట్ల పెట్టుబడి... 850 మందికి ఉపాధి

  • డ్రోన్‌ల్యాబ్‌ టెక్నాలజీస్‌... రూ.5 కోట్ల పెట్టుడి... 14 మందికి ఉపాధి

  • హెచ్‌సీ లేబొరేటరీస్‌... రూ.100 కోట్ల పెట్టుబడి... 500 మందికి ఉపాధి

  • సెన్స్‌ ఇమేజ్‌ టెక్నాలజీస్‌... రూ.68కోట్లపెట్టుబడి... 45 మందికి ఉపాధి

  • ఎయిర్‌స్పేస్‌ఇండస్ట్రీస్‌... రూ.100 కోట్లు పెట్టుబడి.. 150మందికి ఉపాధి

  • జేడీకేఫ్లైడ్రోన్‌ వరల్డ్‌... రూ.114 కోట్ల పెట్టుబడి... 250 మందికి ఉపాధి

  • లాట్రిక్‌ ఎరేస్పేస్‌.... రూ.10 కోట్ల పెట్టుబడి... 125 మందికి ఉపాధి.

Updated Date - May 15 , 2026 | 04:08 AM