దేశం గర్వించే మహనీయుడు అంబేడ్కర్
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:59 AM
అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేడ్కర్ ఆదర్శప్రాయులని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
బాబాసాహెబ్‌కు సీఎం చంద్రబాబు ఘననివాళి
అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేడ్కర్ ఆదర్శప్రాయులని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ‘ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలవడానికి ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగమే కారణం. ప్రతి పౌరుడికీ రాజ్యాంగ రక్షణ కల్పించిన అంబేడ్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేద్దాం’ అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి డోలా బాల వీరాజంనేయస్వామి, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, లిడ్‌క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంత్రి లోకేశ్ ఆయనకు నివాళులర్పించారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పాల్గొన్నారు.
ఏపీభవన్‌లో అంబేడ్కర్ జయంతి వేడుకలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం భవన్ ప్రాంగణంలోని అంబేడ్కర్ విగ్రహానికి రెసిడెంట్ కమిషనర్(ఆర్‌సీ) ప్రవీణ్‌కుమార్, రాష్ట్రప్రభుత్వ సలహాదారు అశోక్‌కుమార్ జైన్, జాయింట్ కమిషనర్ ఎన్‌వీ రామారావు, డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, ఉన్నతాధికారులు కదిరిమోహన ప్రభాకర్, సురేశ్, భవన్ సిబ్బంది తదితరులు పూలమాలలు వేసి నివాళుర్పించారు.