జైలుకు అంబటి
ABN , Publish Date - Feb 02 , 2026 | 04:15 AM
బూతుల రాంబాబును జైలుకు తరలించారు. ముఖ్యమంత్రిపై అత్యంత అసభ్యకరంగా నోరు పారేసుకుని, ఇదేంటి అని ప్రశ్నించిన తెలుగు మహిళలపై రెచ్చిపోయిన వ్యవహారంలో..
సీఎంపై బూతులు మాట్లాడిన కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
గుంటూరు, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): బూతుల రాంబాబును జైలుకు తరలించారు. ముఖ్యమంత్రిపై అత్యంత అసభ్యకరంగా నోరు పారేసుకుని, ఇదేంటి అని ప్రశ్నించిన తెలుగు మహిళలపై రెచ్చిపోయిన వ్యవహారంలో అరెస్టు అయిన అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మెజిరేస్టట్ స్రవంతి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం ఆయనను ఎస్కార్ట్ పోలీసుల రక్షణలో రాజమండ్రి జైలుకు తరలించారు. అంతకుముందు గుంటూరులోని నల్లపాడు పోలీసు స్టేషన్‌లో అంబటి 21 గంటలపాటు లాక్‌పలో ఉన్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగ్రహావేశాల నుంచి అంబటిని అతికష్టం మీద కాపాడి శనివారం రాత్రి 10.40గంటల సమయంలో అరెస్టుచేసి, స్టేషన్‌కు పోలీసులు తెచ్చారు. తెలుగు తమ్ముళ్ల ప్రతిఘటనతో బిత్తరపోయిన అంబటి వాహనం ఆగగానే పోలీ్‌సస్టేషన్‌లోకి పరుగుతీశారు. ఆయన చేతికి ఉన్న ఉంగరాలు, ఒంటిపై ఉన్న బెల్టును పోలీసులు తీయించారు. తనపై నమోదైన కేసులో ఏ ఏ సెక్షన్లు పెట్టారో ఆయన ఆరా తీశారు. అనంతరం అంబటిని లాక్‌పలో ఉంచారు.లాక్‌పలో నేలపై ఆయన నిద్రించారు. రాత్రి 11:30 గంటలకు పోలీసులు తెప్పించిన ఇడ్లీ, దోశ తీసుకున్నారు. అర్ధరాత్రి 2:30కు టాబ్లెట్లు వేసుకున్నారు. ఆదివారం ఉదయం పోలీసులు తెప్పించిన టిఫిన్ అంబటి నిరాకరించారు. మధ్యాహ్నం 12 గంటలకు మూడు ఇడ్లీలు తీసుకున్న ఆయన, 3గంటల సమయంలో పెరుగన్నం తిన్నారు. అంబటిని లాక్‌పలో న్యాయవాది పోలు వెంకటరెడ్డి, వైసీపీ లీగల్ సెల్ నాయకురాలు రోళ్ల మాధవి కలిశారు. బెయిల్ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు.
తనను పోలీస్ స్టేషన్‌లో శారీరక వేధింపులకు గురిచేశారని మేజిస్ట్రేట్‌కు అంబటి ఫిర్యాదు చేశారు. ఇద్దరు సీఐలు తనను పంగ చీల్చి ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. అంబటి స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ రికార్డు చేశారు. జీజీహెచ్‌లో వైద్య పరీక్షల సమయంలో ఆయన వేధింపుల విషయం చెప్పలేదు. అంబటిపై 20 కేసులు ఉన్నాయని, చట్టంపై సంపూర్ణ అవగాహన ఉన్న ఆయన తరచూ వివాదాస్పద తీరుతో నేరాలకు పాల్పడుతున్నారని, పోలీసులపై ఏడుసార్లు దౌర్జన్యం చేశారని ప్రాసిక్యూషన్ న్యాయవాదులు వాదించారు.
విజయనగరంలో అంబటిపై మరో ఫిర్యాదు
సీఎం చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.