దాడికి పవన్ కల్యాణ్‌దే బాధ్యత
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:43 AM
మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని ఆయన కుమార్తె మౌనిక డిమాండ్ చేశారు.
ఆయనను చూసుకునే మాపై దౌర్జన్యం
మహిళలున్న ఇంటిపై దాడి ఎలా చేస్తారు?
హోంమంత్రి అనితను ప్రశ్నించిన అంబటి కుమార్తె
గుంటూరు, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలని ఆయన కుమార్తె మౌనిక డిమాండ్ చేశారు. గుంటూరులో తన తల్లితో కలసి ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కాపులు పవన్ కల్యాణ్ వెంట ఉన్నారు. ఆయన బలం చూసుకొనే మా కుటుంబంపై దాడికి తెగబడ్డారు. దీనిపై పవన్ స్పందించాలి. మహిళల రక్షణ గురించి పవన్ చాలా సార్లు స్పందించారు. అలాగే మాపై జరిగిన దాడి పట్ల కూడా ఆయన స్పందించాలి. మా తండ్రి గొంతు నొక్కాలనే దాడులు చేశారు. అయితే, ఆయన ఇటువంటి దాడులకు భయపడబోరు. మా భద్రత గురించే ఆయన ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు’’ అని మౌనిక పేర్కొన్నారు. తాను తన తండ్రి వ్యాఖ్యలను సమర్థించటం లేదన్నారు. ఆడవాళ్లు ఉన్న ఇంటిపై ఎలా దాడి చేస్తారని ప్రశ్నించారు. హోం మంత్రి అనిత దీనికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.