మీ సంగతి తేలుస్తా... తాట తీస్తా
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:26 AM
మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల పట్ల మరోసారి దురుసుగా వ్యవహరించారు. ‘మీ సంగతి తేలుస్తా.. తాట తీస్తా..’ అంటూ చిందు లు తొక్కారు.
పోలీసులపై అంబటి చిందులు.. గుంటూరు ‘ఆంధ్రజ్యోతి’ వద్ద రచ్చ
గుంటూరు, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసుల పట్ల మరోసారి దురుసుగా వ్యవహరించారు. ‘మీ సంగతి తేలుస్తా.. తాట తీస్తా..’ అంటూ చిందు లు తొక్కారు. బుధవారం గుంటూరు ‘ఆంధ్రజ్యోతి’ కార్యాలయం ఎదుట ధర్నా సందర్భంగా చెలరేగిపోయారు. కార్యాలయానికి రక్షణగా ఏర్పాటుచేసిన బారికేడ్లను తోసుకుంటూ, పోలీసులను నెట్టుకుంటూ దూసుకెళ్లారు. వారించడానికి ప్రయత్నించిన అరండల్‌పేట ఎస్‌హెచ్‌వో ఆరోగ్యరాజుకు వేలు చూపుతూ విరుచుకుపడ్డారు. ‘ఓయ్..ఏయ్’ అంటూ బెదిరింపులకు దిగా రు. అక్కడ విధుల్లో ఉన్న ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, ఇన్‌చార్జి వెస్ట్ డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావులను ఉద్దేశించి.. ‘నీవేవరు’ అంటూ ఏకవాక్య సంబోధన చేస్తూ మాట్లాడారు. ‘‘మర్యాద గా మమ్మల్ని కార్యాలయం వరకు వెళ్ళినివ్వండి. లేదంటే బలవంతంగా తోసుకుని వెళ్లాల్సి ఉంటుంది’’ అని దౌర్జన్యానికి దిగారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తీవ్ర స్థాయిలో పోలీసులకు హెచ్చరికలు చేశారు. వైసీపీ కార్యకర్తలపై లాఠీ ఎత్తిన పోలీసుల తాటతీస్తానని బెదిరించారు. పదేపదే ఓ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులను పేర్లు పెట్టి పిలుస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేేస ధోరణితో మాట్లాడారు.