బాబును తిట్టండని మీ పార్టీ నేతలు చెప్పారా?
ABN , Publish Date - May 01 , 2026 | 03:48 AM
ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టాలని మీ పార్టీ నేతలు ఎవరైనా చెప్పారా? సీఎం స్థాయి వ్యక్తిని దూషించడం తప్పని తెలియదా’ అని పోలీసులు మాజీ మంత్రి...
అంబటిని ప్రశ్నించిన వేంపల్లె పోలీసులు
వేంపల్లె, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ‘ముఖ్యమంత్రి చంద్రబాబును తిట్టాలని మీ పార్టీ నేతలు ఎవరైనా చెప్పారా? సీఎం స్థాయి వ్యక్తిని దూషించడం తప్పని తెలియదా’ అని పోలీసులు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబును ప్రశ్నించారు. ఈ ఏడాది జనవరి 30న గుంటూరులో అంబటి సీఎంనుద్దేశించి అనుచితంగా మాట్లాడారంటూ కడప జిల్లా వేంపల్లె మండల టీడీపీ కన్వీనర్ రామమునిరెడ్డి వేంపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిబ్రవరి 1న ఫిర్యాదు చేశారు. ఐపీసీ 352, 353 సెక్షన్ల కింద కేసు (క్రైం నంబర్ 25/2026) నమోదు చేశారు. విచారణకు రావాలని ఏప్రిల్ 14న అంబటికి నోటీసు జారీ చేశారు. ఆయన గురువారం ఉదయం 10:45కు స్టేషన్‌కు వచ్చారు. వేంపల్లె సీఐ టి.నరసింహులు, ఆర్కేవ్యాలీ సీఐ శంకర్‌రెడ్డి, ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ ఆయన్ను న్యాయవాదులు, స్థానిక వీఆర్‌వో సమక్షంలో 2 గంటలపాటు విచారించారు. మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. ముఖ్యమైన ప్రశ్నలకు లేదు, కాదంటూ ఆయన సమాధానాలు దాటవేసినట్లు సమాచారం. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాబోయేది జగన్ ప్రభుత్వమే. లోకేశ్ రెడ్‌బుక్‌కు కుక్కలు కూడా భయపడవని ఎప్పుడో చెప్పాను’ అని అన్నారు.