Share News

అంబటికి మళ్లీ రిమాండ్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 04:30 AM

సంక్రాంతి లాటరీ పేరిట మోసగించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు ఈ నెల 26 వరకు గుంటూరులోని ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు రిమాండ్‌ విధించింది.

అంబటికి మళ్లీ రిమాండ్‌

  • లాటరీ కేసులో ఈ నెల 26 వరకు విధించిన గుంటూరు కోర్టు

గుంటూరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి లాటరీ పేరిట మోసగించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు ఈ నెల 26 వరకు గుంటూరులోని ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు. ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడిన కేసులో, పోలీస్‌ అధికారితో దురుసుగా ప్రవర్తించిన కేసులో ఆయన ఇప్పటికే జైలులో ఉన్నారు. 2023 జనవరిలో, అప్పటి వైసీపీ ప్రభుత్వం హయాంలో సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా చట్ట విరుద్ధంగా, నిషేధిత లాటరీ నిర్వహించారంటూ అంబటి రాంబాబుపై జనసేన జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సత్తెనపల్లి టౌన్‌ పోలీసులు పీటీ వారంట్‌పై గురువారం అంబటిని రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జడ్జి కుముదిని ఎదుట ఇరుపక్షాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. అంబటి తరఫున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాంబాబుపై రాజకీయ ప్రేరేపితమైన కుట్రలో భాగంగానే పాత కేసును ఇప్పుడు తెరపైకి తెచ్చారని, మిగిలిన కేసుల్లో బెయిల్‌ రావడంతో కావాలనే హడావుడిగా అదనపు సెక్షన్లు జోడించారని ఆరోపించారు. అందువల్ల పీటీ వారంట్‌ను డిస్మిస్‌ చేయాలని వాదించారు. ప్రాసిక్యూషన్‌ తరపున పీపీలు విజయలక్ష్మి, జగదీశ్‌ వాదనలు వినిపించారు. టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాది శ్రీరామ్‌ రాజీవ్‌ ఆనంద్‌ వారికి సహకరించారు. ‘‘2023లో వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబుపై క్రిమినల్‌ కేసు నమోదయింది. ఆ కేసులో 2025లో 14 మంది సాక్షులను విచారించాం’’ అని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అంబటి రాంబాబు చేసిన నేరానికి సంబంధించిన ఆధారాలను వారు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వార్డు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది బలవంతంగా పెన్షనర్లకు, ప్రజలకు లాటరీ టికెట్లు విక్రయించిన వీడియోలను జడ్జికి అందించారు. అంతేగాక అంబటి స్వయంగా లక్కీ డిప్‌ తీసిన వీడియోను కూడా పెన్‌ డ్రైవ్‌లో అందజేశారు. వాటిని పరిశీలించిన జడ్జి కుముదిని ఈ నెల 26 వరకు అంబటికి రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కాగా, అంబటిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.


పెన్షనర్లకు లాటరీలు అంటగట్టారు: పిటిషనర్‌

లాటరీ వ్యవహారంలో అంబటి రాంబాబు ఐదు కోట్ల వరకు లాభపడ్డారని పిటిషనర్‌ గాదె వెంకటేశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ఒక్కొక్కరికి బలవంతంగా 10టికెట్లు అంటగట్టి, పెన్షన్‌ డబ్బుల్లో వెయ్యి రూపాయలు జమ చేసుకున్నారు. వలంటీర్లపై ఒత్తిడి తెచ్చి ఈ విధంగా వేలాది టికెట్లు విక్రయించారు’’ అని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసును మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు తమ కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆర్థిక నేరం జరిగిన నేపథ్యంలో అంబటి రాంబాబును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, అంబటికి బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం వాదనలు జరగనున్నాయి.

అంబటి ‘అతి’

  • ‘తగ్గేదేలే...’ అన్నట్టు చేతులు తిప్పిన వైనం

ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన కేసులో అంబటి రాంబాబు నిందితుడు. పోలీసు అధికారిని దుర్భాషలాడిన వ్యవహారంలో విచారణను ఎదుర్కొంటున్నారు.ప్రభుత్వం ఇచ్చే పింఛన్లను కూడా వదిలిపెట్టకుండా, లాటరీ పేరిట వృద్ధులు, వితంతువులను చీటింగ్‌ చేసిన కేసులో ముద్దాయి. అయినా, పశ్చాత్తాపం లేదు. పైగా.. గురువారం కోర్టుకు తెచ్చినప్పుడు ‘తగ్గేదేలే...’ అన్నట్టు పుష్ప సినిమా మేనరిజాన్ని ప్రదర్శించారు. ఏడు వదుల వయసులో ఉన్న ఆయన కోర్టు ఆవరణలో ‘అతి’ విన్యాసాలు చేశారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి గురువారం మధ్యాహ్నం అంబటి రాంబాబును గుంటూరులోని కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో ప్రొసీడింగ్స్‌ పూర్తి కావడానికి కొంత సమయం ఉండడంతో రాంబాబును పోలీసు వాహనంలోనే ఉంచారు. ఆ సమయంలో అక్కడ సమీపంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, మీడియాను అంబటి రాంబాబు గమనించారు. వారి వైపు చూస్తూ.. తగ్గేదేలే...అన్నట్లు చెయ్యి తిప్పారు. తప్పు చేసినా చట్టం తనను ఏమీ చేయలేదనే ఉద్దేశంతోనే ఆ మేనరిజం ప్రదర్శించారా అంటూ.. మీడియా ప్రతినిధులు సైతం విస్మయానికి గురయ్యారు. కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడటానికి ఉండదు. ఈ ఉద్దేశంతోనే పోలీస్‌ అధికారి ఆయన కూర్చున్న వైపు కిటికీ అద్దం మూసేయబోగా, ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా కిటికీ తెరిచారు. అ తర్వాత మీడియాకు, కార్యకర్తలకు కనిపించేలా వింత విన్యాసాలు చేశారు. పోలీస్‌ వాహనం దిగే సమయంలో తనంతట తానే పోలీసు అధికారికి తగిలారు. ఆపై ‘డోంట్‌ టచ్‌ మీ’ అంటూ తిరిగి అదే అధికారికి వార్నింగ్‌ ఇచ్చారు.

Updated Date - Feb 13 , 2026 | 04:30 AM