అమరావతికి ‘క్వాంటమ్’ కళ
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:50 AM
సాంకేతిక విప్లవానికి దన్నుగా, యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.
పండుగ వాతావరణంలో క్వాంటమ్ వ్యాలీ
భవనాలకు శంకుస్థాపన.. పైలాన్ ఆవిష్కరణ
సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమక్షంలో 15 సంస్థలతో కీలక ఎంవోయూలు
గుంటూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక విప్లవానికి దన్నుగా, యువత భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. వేలాది మంది విద్యార్థులు, యువకులు, రాజధాని రైతుల సమక్షంలో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం సాగింది. సభాప్రాంగణంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అడుగుపెట్టగానే యువత కేరింతలు మిన్నంటిపోయాయి. విద్యార్థి, యువకుల సందళ్ల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం పలు ప్రాజెక్టులను ఆవిష్కరించారు. సభాప్రాంగణంలోనే 15 ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఎంఓయూలు కుదిరాయి. తొలుత టీసీఎ్‌సకు సంబంధించిన క్వాంటమ్ క్లౌడ్ సర్వీసె్‌సను చంద్రబాబు, జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీసీఎస్ సీఈవో హ్యారిక్ విన్ క్లౌడ్ సర్వీసు సేవల గురించి వివరించారు. అనంతరం ఐబీఎం సంస్థకు సంబంధించిన క్వాంటమ్ ఇన్నొవేషన్ సెంటర్(క్యూఐసీ)ను వారిద్దరూ ప్రారంభించారు. ఐబీఎం ప్రతినిధి అమిత్ సంఘీ క్యూఐసీ గురించి వివరించారు. ఆ తరువాత వాషింగ్టన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్టెమ్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రిసెర్చ్ (వైజర్) సంస్థకు సంబంధించిన వైజర్ క్వాంటమ్ సొల్యూషన్స్‌ను ఆవిష్కరించారు. వచ్చే ఐదేళ్లలో 31 లక్షలమందికి శిక్షణ ఇస్తామని వైజర్ ప్రతినిధి వర్థన్ తెలిపారు. అనంతరం ఎస్‌ఆర్‌ఎం వైస్ చాన్సలర్ సతీశ్ మాట్లాడారు. అనంతరం క్వాంటం అవేర్ 2.0ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జితేంద్ర సింగ్‌ను చంద్రబాబు సన్మానించారు. శాలువా కప్పి, ఆయనకు అరకు కాఫీని అందజేశారు. సభలో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు, టీసీఎస్, ఐబీఎం, ఎల్‌అండ్‌టీ తదితర సంస్థల ప్రతినిధులను కూడా సత్కరించారు.
అనంతరం హ్యాక్‌థాన్‌లో పాల్గొన్న 50 మంది విద్యార్థులతో ఫొటోలు దిగారు. కాగా సభాప్రాంగణంలో ప్రదర్శించిన ఏవీలు సభికులు, విద్యార్థులు, సాంకేతికరంగ నిపుణులను ఆకట్టుకున్నాయి. క్వాంటమ్ వ్యాలీ నమూనా సభికులను ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి లోకేశ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారాయణ, దుర్గేశ్, ఎల్‌అండ్‌టీ సీఎండీ ఎంవీ సతీశ్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కె.సత్యనారాయణ, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగ కార్యదర్శి అభయ్ కరందికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అబ్జర్వర్ అజయ్‌కుమార్ సూద్, ప్రముఖ ఐటీ సంస్థలు, రాష్ట్రం నలుమూలల నుంచి పలు విద్యాసంస్థల ప్రతినిధులు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.
భాగస్వామ్య సంస్థలతో ఒప్పందాలు
క్వాంటమ్ కంప్యూటింగ్, అల్గారిథమ్స్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సెక్యూరిటీ, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ బయో ఫౌండ్రీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఐక్యూ లీప్, ట్రై క్వాంటా ల్యాబ్స్, క్యూబిట్ ఫోర్స్, ఎస్‌ఆర్‌ఎం, క్వాంట్ ఫోకస్ ల్యాబ్స్ సహా 15 సంస్థలు ముందుకొచ్చాయి. వాటితో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అత్యధికంగా క్వాంటమ్ హార్డ్‌వేర్ అభివృద్ధికి సంబంధించి ఆరు సంస్థలు ఉత్సాహం చూపించాయి. ఈ సంస్థల రాకతో రాష్ట్రంలో క్వాంటమ్ సెన్సింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధనలు జరగనున్నాయి. హెల్త్ కేర్ అప్లికేషన్లు, డిఫెన్స్, ఏరోస్పేస్ అవసరాలకు స్వదేశీ క్వాంటమ్ టెక్నాలజీని రూపొందించుకోగలుగుతాం. నేషనల్ క్వాంటమ్ మిషన్‌కు అనుగుణంగా హార్డ్‌వేర్ సిద్ధం చేసుకోగలం. శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ రిఫరెన్సు, రిసెర్చ్ స్పెషాలిటీ సాకారం అవుతుంది. యువతకు క్వాంటమ్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు ఊపందుకుంటాయి.