అమరావతి అజేయం
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:57 AM
అమరావతి అజేయం, అద్భుతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక ఒక్క అంగుళం కూడా అమరావతిని కదల్చలేరని స్పష్టం చేశారు.
ఇక అంగుళం కూడా కదిలించలేరు
భూములతో పాటు భవిష్యత్తునూ ఇచ్చిన రైతులు
అందుకే అమరావతి మన శాశ్వత రాజధాని
స్వీయాభివృద్ధి పద్ధతిలో రాజధాని నిర్మాణం
ఒకే రాజధాని.. అభివృద్ధి మాత్రం వికేంద్రీకృతం
అమరావతితోపాటు విశాఖ, తిరుపతీ మెగా సిటీలే
తీర్మానానికి మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
2028 నాటికి తొలి దశ పనులు పూర్తి
‘‘రాజధాని అంటే ఎక్కడో ఒక దగ్గర వంద ఎకరాలు తీసుకొని భవనాలు కట్టేయవచ్చు. కానీ, ఏపీకి ఆర్థిక వనరులు, ఆదాయం తెచ్చిపెట్టే బలమైన రాజధాని ఉండాలనుకున్నాను. రైతులు 58 రోజుల్లోనే 34 వేల ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు, తొలిరోజుల్లోనే చెరుకు తోటలకు నిప్పుపెట్టారు. రుణాలు రాకుండా అడ్డుకునేందుకు ప్రపంచబ్యాంకుకు ఈ-మెయిల్స్ పంపించారు. కానీ రైతుల త్యాగాలు, పవిత్ర మట్టి, నీరు అమరావతిని అజేయమైనవిగా మార్చాయి. రైతులు భూములే కాదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తును కూడా ఇచ్చారు. రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా.’’
- సీఎం చంద్రబాబు
ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు. విజనరీ లీడర్ వచ్చే తరం గురించి ఆలోచిస్తారు. ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు హైదరాబాద్‌ను అలానే అభివృద్ధి చేశారు.
- డిప్యూటీ సీఎం పవన్
ఆనాడు జగన్ అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు. తాను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకుంటున్నానని, అమరావతి రాజధాని ఎక్కడికీ వెళ్లదని చెప్పారు. అబద్ధం చెప్పి 151 సీట్లు గెలిచారు. గెలిచిన వెంటనే ప్లేట్ ఫిరాయించారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ప్రారంభించారు. అమరావతిని నాశనం చేశారు.
- మంత్రి లోకేశ్
అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): అమరావతి అజేయం, అద్భుతమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇక ఒక్క అంగుళం కూడా అమరావతిని కదల్చలేరని స్పష్టం చేశారు. ‘‘ఇది చట్టబద్ధమైన భరోసా. తెలుగు వైభవం అయిన అమరావతే శాశ్వత రాజధాని’’ అని చంద్రబాబు శాసనసభలో పునరుద్ఘాటించారు. 2028 నాటికల్లా అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని ప్రకటించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగా లు అసామాన్యమైనవని, అనేక కష్టనష్టాలను తట్టుకున్న వారికి పాదాభివందనం అంటూ చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. తీర్మానానికి మద్దతు పలికిన సభ్యులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఏమన్నారంటే...
అవే కుట్రలు...కుతంత్రాలు
‘‘అమరావతికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలు, కుతంత్రాలు, రైతుల పట్ల గత ప్రభుత్వం చేసిన దమనకాండ, అన్యాయం చూసి చలించిపోయాను. అనేక సందర్భాల్లో చాలా కోపం వచ్చింది. ఇంత అన్యాయం చేస్తారా? అని భావోద్వేగానికి లోనయ్యాను. ఆనాటి పరిణామాలను సభలో పలువురు సభ్యులు గుర్తు చేసినప్పుడు మరోసారి ఉద్వేగం కలిగింది. ఇంత జరిగినా రాజధానిపై వైసీపీ బుద్ధి మారలేదు. గతంలో మాదిరిగానే ఇంకా అమరావతిపై కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూనే ఉంది. రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదంటున్నారు. వీళ్లకు ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందేమో? రాజారెడ్డి రాజ్యాంగాన్ని వాళ్లు అనుసరిస్తారు. కానీ మనం అంబేడ్కర్ రాజ్యాంగం అనుసరిస్తున్నాం. విభజన అనంతరం ఏపీకి రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలని 46 శాతం మంది కోరుకున్నట్లుగా శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది. మేం అదే పని చేశాం. చారిత్రక నేపథ్యం ఉన్న అమరావతి ప్రాంతాన్నే రాజధానిగా ఏర్పాటు చేశాం. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్ బేషరతుగా అమరావతికి మద్దతు ఇస్తున్నానని గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు రోజుకో మాటతో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారు.’’
ఆ ఐదేళ్లూ కీచకపర్వమే..
‘‘ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2019 నుంచే విధ్వంస పాలన మొదలుపెట్టింది. వారి చర్యలతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు రాజధాని పరిరక్షణ కోసం, జగన్ మూడు ముక్కలాటకు నిరసనగా చేపట్టిన ప్రజా పోరాటాలను ఉక్కుపాదంతో అణచివేశారు. రైతులు, మహిళలపై కేసులు పెట్టి బూట్లతో తన్నారు. లాఠీలతో కొట్టారు. అడ్డగోలుగా కేసులు పెట్టి కీచకపర్వం సాగించారు. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీ ద్వారా పాస్ చేయించాలని చూశారు. అయినా హైకోర్టు న్యాయాన్ని కాపాడింది. మూడు రాజధానుల ప్రతిపాదన తుగ్లక్ నిర్ణయమని మీడియా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసింది. గత పాలనలో రైతులు, మహిళలు, నేను, పవన్ సహా అందరం బాధితులమే.’’
మూడు రీజియన్లుగా అభివృద్ధి..
‘‘రాష్ట్రానికి రాజధాని ఒక్కటే. అదే అమరావతి. కానీ, అభివృద్ధి మాత్రం వికేంద్రీకృతం. రాష్ట్రంలోని అ న్ని ప్రాంతాలను ప్రగతిపథంలోకి తెస్తాం. విశాఖపట్నం, తిరుపతి, అమరావతి రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. ఆ ప్రాంతాలను మెగా సిటీలుగా అభివృద్ధిచేస్తాం. అమరావతి స్వయం అభివృద్ధి విధానంలో నిర్మితమవుతుందని చెప్పాం..అదే జరుగుతుంది.’’
మోదీ హామీ మేరకే..
‘‘అమరావతి నిర్మాణ బాధ్యతను పార్లమెంట్ తీసుకుంటుందని ప్రధాని నరేంద్రమోదీ భరోసా ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ. 15వేల కోట్ల తక్షణ సహాయం అందించింది. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2028 నాటికి తొలిదశ పనులు పూర్తిచేసి అమరావతికి ఒక రూపు తీసుకొస్తాం. 2027 నాటికి రహదారులు, లే అవుట్‌లు సహా కీలకమైన మౌళిక సదుపాయాల కల్పన పూర్తవుతుంది. ప్రస్తుతం రూ.56వేల కోట్ల విలువైన 91 పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తిచేయించి ప్రధాన మంత్రిని పిలిపించి, ఆయనతోనే ప్రార ంభింపచేస్తాం. ఇదే మా సంకల్పం. ప్రతి తెలుగువ్యక్తీ గర్వపడేలా అమరావతి రాజధాని ఉంటుంది. నాది అమరావతి, నా రాజధాని అమరావతి అని తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే రోజు తప్పకుండా వస్తుంది.’’ అని సీఎం చంద్ర బాబు వ్యాఖ్యానించారు.