హైదరాబాద్‌ను మించి.. అమరావతి!
ABN , Publish Date - Mar 23 , 2026 | 03:38 AM
ఏపీ రాజధాని అమరావతిని హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేశామన్నారు.
అన్ని విధాలా రాజధాని అభివృద్ధి
నాలెడ్జ్ ఎకానమీని ఊహించే ఐటీకి ప్రోత్సాహం
సెల్‌ఫోన్ల గురించి మాట్లాడితే.. చులకన చేశారు
వైసీపీవాళ్లు అమరావతిని శ్మశానమని గేలి చేశారు
తిరుమల దర్శనాలలో ఏఐ టెక్నాలజీ వినియోగం
కల్తీ నెయ్యికి ఆస్కారం లేకుండా ప్రయోగశాలలు
భవిష్యత్తులో ఏఐ, స్పేస్, ఎలక్ర్టానిక్స్ రంగాలు కీలకం
రాష్ట్రాభివృద్ధికే స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్
ప్రతి ఒక్కరూ ‘గివ్ బ్యాక్ టు సొసైటీ’ని ఆచరించాలి
ఐఎ్‌సబీ లెర్నింగ్ సమ్మిట్-2026లో చంద్రబాబు
పాలనలో నేడు మనం తీసుకున్న నిర్ణయాలే రేపటికి చరిత్ర అవుతాయి. ఇదంతా ఒక్కరోజులో జరిగిందేమీ కాదు. గతంలో తీసుకున్న నిర్ణయాలే నేటి దీర్ఘ ప్రణాళికలుగా మారాయి. ‘స్వర్ణాంధ్ర విజన్-2047’తో వ్యవసాయ, పారిశ్రామిక, సేవల రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. గతంలో తీసుకున్న స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలే హైదరాబాద్‌ను ప్రపంచంలో అత్యంత నివాసయోగ్య నగరాల్లో ఒకటిగా మార్చాయి. అలాంటి మోడల్‌నే ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలో అమలు చేస్తున్నాం.
- సీఎం చంద్రబాబు
హైదరాబాద్, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతిని హైదరాబాద్‌ను మించి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ చేశామన్నారు. రాజధానిని అద్భుత నగరంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. వైసీపీ హయంలో నాటి పాలకులు అమరావతిని శ్మశానం అంటూ గేలి చేశారని, తర్వాత దాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. 2024లో తమ ప్రభుత్వం వచ్చాక రాజధానిని పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. అమరావతిని స్మార్ట్, బ్లూ-గ్రీన్ రాజధానిగా అభివృద్థి చేయడంతో పాటు హైదరాబాద్‌ను మించి ఎదిగేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని తెలిపారు. అమరావతిలో త్వరలో క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, భవిష్యత్‌లో క్వాంటం పరికరాల తయారీకి కూడా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో జరిగిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్థి, సాంకేతికత, ఆర్థిక సంస్కరణలు, భవిష్యత్ ప్రణాళికలపై ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
సంస్కరణలు అందిపుచ్చుకుని
1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను అందిపుచ్చుకున్నాం. అదేదిశగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి పారిశ్రామిక, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేశాం. ఐటీకి సూచికగా సైబర్ టవర్స్‌ను నిర్మించాం. ‘నాలెడ్జ్ ఎకానమీ’ భవిష్యత్తుని ముందుగానే అంచనా వేసి ఐటీ రంగాన్ని ప్రోత్సహించాం. దీంతో బెంగుళూరు, చెన్నైలాంటి నగరాలను వదలి అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో అడుగుపెట్టాయి. అప్పట్లో నేను సెల్‌ఫోన్ గురించి మాట్లాడితే పంపుసెట్ల గురించి మాట్లాడాలని విమర్శించారు. జీనోమ్ వ్యాలీ ఏర్పాటు, ఐఎ్‌సబీ స్థాపన, ఫార్మా రంగంలో రెండు తెలుగు రాష్ర్టాలు అగ్రస్థానంలో నిలవడం కూడా అప్పటి నిర్ణయాల ఫలితమే. కరోనా సమయంలో హైదరాబాద్ నుంచి ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరా జరగడం ఈ ఎకోసిస్టం విజయానికి నిదర్శనం.
వైసీపీ హయాంలో..
వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రమంతా సర్వనాశనం అయింది. విభజన సమయం కంటే దారుణంగా రాష్ట్ర పరిస్థితి తయారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్థి, సుపరిపాలనపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నాం. ప్రస్తుతం పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ ముందంజలో ఉంది. ఇప్పటి వరకు దాదాపు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. పోలవరం ప్రాజెక్టు రాష్ర్టానికి అత్యంత కీలకం. గోదావరిలో భారీ వరదలు వచ్చినా తట్టుకునేలా దీన్ని నిర్మిస్తున్నాం. 2019 నాటికి 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశాం. తర్వాత కాలంలో వైసీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రం వాల్ దెబ్బతింది. ఇప్పుడు మళ్లీ రూ.1000 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాల్సి వస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టును పూర్తిచేసి ఇతర రాష్ర్టాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తాం. అలాగే రాష్ర్టాన్ని మూడు రీజియన్లుగా అభివృద్థి చేస్తూ, విశాఖలో గూగుల్, రిలయన్స్ సహా డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నాం.
గ్రీన్ ఎనర్జీలో ఏపీ నెంబర్ 1
భవిష్యత్ సాంకేతికతలో కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటం, డ్రోన్స్, స్పేస్, ఎలక్ర్టానిక్స్ రంగాలు కీలకం. వీటికి అనుగుణంగా డ్రోన్ సిటీలు, స్పేస్, ఎలక్ర్టానిక్స్ హబ్‌లను అభివృద్థి చేస్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక ఇంధనాలు విద్యు త్ రంగాన్ని ప్రభావితం చేస్తాయి. తక్కువ ఖర్చుతో విద్యుత్ అందించడమే లక్ష్యం. ప్రస్తుత పశ్చిమాసియా యుద్థ ప్రభావంతో ఇంధన కొరతలు, ముఖ్యంగా ఎల్పీజీ కొరత నేపథ్యంలో పీఎన్జీ ప్రాధాన్యం పెరిగింది. దక్షిణ భారతదేశంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుంది.
తిరుమలలో ఏఐ సాంకేతికత
తిరుమలలో ఏఐ సాంతికేతికతను వినియోగించి దర్శనాల సామర్థ్యాన్ని 15--20 శాతం పెంచనున్నాం. ప్రసాదాల తయారీలో వినియోగించే పదార్థాలను ఆధునిక ప్రయోగశాలల ద్వారా నిరంతరం పరీక్షిస్తున్నాం. గతంలో ఉన్నట్లుగా కల్తీ నెయ్యి సమస్యలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేలా ‘డిజిటల్ హెల్త్ రికార్డులు’ రూపొందిస్తున్నాం. భవిష్యత్తులో ఏఐ డాక్టర్ ేసవలు అందుబాటులోకి తీసుకురానున్నాం. రైతులకు ఏఐ ఆధారిత సేవలు అందించి వ్యవసాయాన్ని ఆధునికీకరించనున్నాం. ఉద్యాన, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఎగుమతులను పెంచాలని యువ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నాం. రాష్ర్టాన్ని దేశంలో అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు.. 15 శాతం స్థిర వృద్థి రేటు సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. భవిష్యత్తులో జనాభా అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్’పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
పీపీపీతోనే అభివృద్ధి
పీపీపీ మోడల్ ద్వారా మౌలిక వసతుల అభివృద్థి సాధ్యమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘పీపీపీ విధానంలో చేపట్టిన జేగురుపాడు విద్యుత్ ప్రాజెక్టు వంటివి విజయవంతమయ్యాయి. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రహదారులు, ఎయిర్‌పోర్టులు వంటివి దేశ అభివృద్థికి దోహదపడ్డాయి. గిరిజన ప్రాంతాల అభివృద్థి కోసం అరకు కాఫీని ప్రపంచ మార్కెట్లో ప్రమోట్ చేయడానికి ‘నాంది’ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దీనిని గ్లోబల్ స్థాయిలో ప్రోత్సహించేందుకు ఆనంద్ మహీంద్ర లాంటి ప్రముఖులు ముందుకు వస్తున్నారు. పేదల ఆర్థిక, సామాజిక పురోగతికి పీ4 కార్యక్రమం కీలకం. ‘గివ్ బ్యాక్ టు సొసైటీ’ భావనను ప్రతి ఒక్కరూ ఆచరించాలి.’’ అని సీఎం పిలుపునిచ్చారు.