Share News

విపత్తులు పసిగట్టేందుకు డేటా సెంటర్‌

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:37 AM

విపత్తులను ముందే పసిగట్టి రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసేలా రాజధాని అమరావతిలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) శాఖ నిర్ణయించింది.

విపత్తులు పసిగట్టేందుకు డేటా సెంటర్‌

  • 6 పెటా బైట్స్‌ సామర్థ్యంతో అమరావతిలో ఏర్పాటుకు నిర్ణయం

అమరావతి, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): విపత్తులను ముందే పసిగట్టి రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేసేలా రాజధాని అమరావతిలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) శాఖ నిర్ణయించింది. దాదాపు రూ.180 కోట్ల వ్యయంతో, 6 పెటా బైట్‌ (పీబీ)ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్‌ నిర్మాణాన్ని ‘బిల్ట్‌ ఓన్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌’ (బూట్‌) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ఐటీ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) రాష్ట్రంలో విప్తతులపై ఎప్పటికప్పుడు మొబైల్‌ ఫోన్లకు సమాచారం అందిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అయితే భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృత పరచే ఉద్దేశంతో 6 పీబీ (6000 టెరాబైట్ల) సామర్థ్యంతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు సంస్థలు దీన్ని బూట్‌ విధానంలో నిర్మించేందుకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు వీలుగా మంగళవారం జరిగిన క్యాబినెట్‌ సమావేశం ముందుకు ప్రతిపాదనలు పంపారు. అయితే.. క్యాబినెట్‌లో అజెండా అంశాలన్నీ పక్కన పెట్టేసి.. కేవలం తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టు ఆదేశాలమేరకు ఏర్పాటైన సీబీఐ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) ఇచ్చిన నివేదికపైనే చర్చ జరిగింది. దీంతో డేటా సెంటర్‌పై నిర్ణయం తీసుకునే వీలు లేకుండా పోయింది. అయితే ఈ ప్రతిపాదనపై వచ్చే క్యాబినెట్‌లో చర్చించే వీలుందని అధికారవర్గాలు తెలిపాయి.

Updated Date - Feb 04 , 2026 | 04:38 AM