Share News

అమరావతికి మరో ఖ్యాతి!

ABN , Publish Date - May 18 , 2026 | 04:33 AM

కమ్యూనికేషన్స్‌, సైబర్‌ స్పేస్‌ కోసం దేశంలోనే మొట్ట మొదటి క్వాంటమ్‌-సెక్యూర్‌ కమ్యూనికేషన్స్‌ టెస్ట్‌ బెడ్‌ అమరావతిలో ఏర్పాటు కానున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

అమరావతికి మరో ఖ్యాతి!

  • దేశంలో తొలి క్వాంటమ్‌-సెక్యూర్‌ కమ్యూనికేషన్స్‌ టెస్ట్‌ బెడ్‌

  • క్వాంటమ్‌ వ్యాలీతో కలసి ఏర్పాటుచేయనున్న సీ-డాట్‌

  • భాగస్వాములకు సీఎం చంద్రబాబు అభినందనలు

  • ఆవిష్కరణలకు వేదికగా అమరావతి నిలుస్తుందని ఆకాంక్ష

అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): కమ్యూనికేషన్స్‌, సైబర్‌ స్పేస్‌ కోసం దేశంలోనే మొట్ట మొదటి క్వాంటమ్‌-సెక్యూర్‌ కమ్యూనికేషన్స్‌ టెస్ట్‌ బెడ్‌ అమరావతిలో ఏర్పాటు కానున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన సీ-డాట్‌.. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ భాగస్వామ్యంతో అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఈ టెస్ట్‌ బెడ్‌ ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. అమరావతిలో ఏర్పాటు చేయనుండటంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఇందుకోసం పని చేస్తున్న వారికి అభినందనలు తెలిపారు. క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌ హార్డ్‌వేర్‌, ఫొటోనిక్‌, ఆప్టికల్‌ సిస్టమ్స్‌, ఎన్‌క్రిప్షన్‌ టెక్నాలజీస్‌, సురక్షిత నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాలు, నెక్ట్స్‌-జనరేషన్‌ సైబర్‌ రక్షణ పరిష్కారాల పరిశోధన, పరీక్షలకు ఈ టెస్ట్‌ బెడ్‌ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ఈ తరహాలో టెస్ట్‌ బెడ్‌ల ఏర్పాటుతో మేక్‌ ఇన్‌ ఇండియా సాంకేతికతలు, సురక్షితమైన డిజిటల్‌ మౌలిక సదుపాయాల విషయంలో అమరావతికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతుందన్నారు. ఫ్రంటియర్‌ టెక్నాలజీస్‌, అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, డీప్‌-టెక్‌ ఆవిష్కరణలకు అమరావతి ప్రముఖ కార్యస్థానంగా ఆవిర్భవిస్తుందని తెలిపారు. ప్రపంచ భవిష్యత్తును మార్చే సాంకేతికతలను రూపొందించడంలో ఏపీ విద్యార్థులు, పరిశోధకులు, స్టార్ట్‌పలు, యువ ఆవిష్కర్తలు భాగస్వాములు కావడానికి ఇది సరికొత్త అవకాశాలను కల్పిస్తుందన్నారు. నెక్ట్స్‌ జనరేషన్‌ సైబర్‌ డిఫెన్స్‌ సొల్యూషన్లకు అమరావతి కేంద్ర బిందువు కానుందని వెల్లడించారు. ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌-ఇన్ఫర్మేషన్‌ సొసైటీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎక్స్‌ వేదికగా సీఎం స్పందించారు.


‘నేడు ప్రపంచ టెలీకమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ సొసైటీ దినోత్సవం. సురక్షితమైన సమాచార మార్పిడి, విశ్వసనీయమైన డిజిటల్‌ మౌలిక సదుపాయాలు, సైబర్‌ రెసిలియన్స్‌ అనేవి దేశాల భవిష్యత్తుకు ఎంత కీలకమో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. టెలీకమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌, క్వాంటమ్‌, ఐటీ రంగాల్లో అమరావతి కేంద్రంగా అభివృద్ధి జరుగుతోంది. ఏప్రిల్‌ 14న క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ ప్రారంభోత్సవం తర్వాత ఆయా రంగాల్లో కీలక అడుగులు పడుతున్నాయి’ అని పేర్కొన్నారు.

Updated Date - May 18 , 2026 | 05:40 AM