‘క్వాంటమ్’తో భవిష్యత్తు భేష్!
ABN , Publish Date - Apr 13 , 2026 | 04:50 AM
భవిష్యత్‌కు భరోసానిచ్చే క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ వేదిక కానుంది. క్వాంటమ్ కంప్యూటర్ ప్రకృతి విపత్తులకు పరిష్కారం చూపుతుందని ఈ రంగంలో నిష్ణాతులు చెబుతున్నారు.
ప్రకృతి విపత్తులకు చక్కని పరిష్కారం
అంతుచిక్కని సమస్యలను తీర్చే మార్గం
మానవాళి మనుగడకు దివ్యౌషధం
రేపు క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీ ప్రారంభం
ప్రపంచం ముందుకు స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్
గ్లోబల్ లీడర్‌గా అమరావతి క్వాంటమ్ వ్యాలీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
భవిష్యత్‌కు భరోసానిచ్చే క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీ వేదిక కానుంది. క్వాంటమ్ కంప్యూటర్ ప్రకృతి విపత్తులకు పరిష్కారం చూపుతుందని ఈ రంగంలో నిష్ణాతులు చెబుతున్నారు. కరోనా సమయంలో క్వాంటమ్ కంప్యూటింగ్ అందుబాబులో ఉండిఉంటే.. ఆ మహమ్మారిని అంతమొందించే పరిష్కారం చిటికెలో దొరికేదని చెబుతున్నారు. జీవన ప్రమాణాలను పెంచడంలో క్వాంటమ్ కంప్యూటర్ అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రోగాలకు కారణాలను లిప్తపాటులో గుర్తించి వాటిని నివారించే ఔషధాల తయారీకి సహకరిస్తుందని, మానవాళి మనుగడకు దివ్యౌషధంలా మారుతుందని చెబుతున్నారు. ఈ నెల 14న ప్రపంచ క్వాంటమ్ కంప్యూటర్ దినోత్సవం సందర్భంగా... క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. క్వాంటమ్ కంప్యూటర్లు తయారు కావాలంటే టెస్ట్ బెడ్‌లు కావాలి. వాటినే రిఫరెన్స్ ఫెసిలిటీస్ అంటారు. భారత్‌లో ఇప్పటివరకూ అవి ఎక్కడా లేవు. దేశంలోనే తొలిసారిగా అమరావతిలోనే ప్రారంభం కానున్నాయి. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభించనున్నారు.
ప్రముఖ సంస్థల తోడ్పాటుతో..
ఎస్‌ఆర్‌ఎంలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్‌ను క్యూబిట్ ఫోర్స్ సంస్థ అధిపతి ఎల్. వెంకట సుబ్రహ్మణ్యంరూపొందించారు. ఎలకా్ట్రనిక్స్ విభాగంలో డాక్టరేట్ చేసిన వెంకట్‌కు క్వాంటమ్ కంప్యూటింగ్‌లో అపార అనుభవం ఉంది. ప్రస్తుతం క్వాంటమ్ ఇండియా లీడర్ సంస్థకు సేవలందిస్తున్నారు. ఐబీఎం మాస్టర్ ఇన్వెంటర్‌గా ప్రఖ్యాతిగాంచిన వెంకట్.. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్‌లో సేవలందించాలని కోరిన వెంటనే ఆ దిశగా ఆలోచన చేశారు. దేశంలోని ప్రఖ్యాత సంస్థల తోడ్పాటుతో స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేశారు. దీనికోసం రూ.14కోట్ల దాకా వ్యయం అయినట్టు వెంకట్ వెల్లడించారు. మరోవైపు క్యూబీటెక్ స్మార్ట్ సొల్యూషన్‌కు చెందిన పినాక పృధ్వీ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. హార్డ్‌వేర్ రంగంలోని పరిజ్ఞానంతో క్వాంటమ్ కంప్యూటింగ్ తయారీ, నిర్వహణపై దృష్టిసారించారు. క్యూబిటెక్ రూపొందించిన ఈ క్వాంటమ్ కంప్యూటర్‌ను గన్నవరం మేథా టవర్స్ వద్ద పరిశోధనా సౌలభ్యం కోసం ఉంచారు. క్వాంటమ్ కంప్యూటర్ అందుబాటులోకి వస్తే.. వైద్యరంగంలో పరిశోధనలు చేసేందుకు.. పరిష్కార మార్గాలు గుర్తించేందుకు ఉపయోగపడుతుందని నేషనల్ క్వాంటమ్ మిషన్ సభ్యుడు, సీనియర్ శాస్త్రవేత్త ప్రవీణ్ కుమార్ తెలిపారు. సంప్రదాయ కంప్యూటర్లతో పోలిస్తే దీని పనితీరు వేరుగా ఉంటుందన్నారు. రూ.14కోట్లతోనే క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారుచేసిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ కి అప్పుడే విదేశాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ టెక్నాలజీ తమకు కావాలంటూ జర్మనీ తదితర దేశాలు కోరుతున్నాయని సాంకేతిక రంగ నిపుణుడు ఒకరు వివరించారు.
క్వాంటమ్ ఫెసిలిటీతో ఏపీలో టెక్ శకం
రేపు వన్ ఎస్, వన్ క్యూ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ఆవిష్కరణ
అమరావతి, మంగళగిరి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): అమరావతి వేదికగా భారత క్వాంటమ్ విప్లవం ప్రారంభం కానుంది. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా 14న క్వాంటమ్ రిఫరెన్స్ పెసిలిటీ ఏర్పాటు కానుంది. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఏర్పాటు చేసిన వన్ ఎస్ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్‌ను ప్రత్యక్షంగానూ.. గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటుచేసిన వన్ క్యూ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్‌ను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లా జేసీ అశుతోశ్ శ్రీవాత్సవ ఎస్‌ఆర్‌ఎం వర్సిటీని సందర్శించారు. క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభం అనంతరం జరిగే సభలోనూ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దీంతో ఈ రెండు వేదికలను జేసీ పరిశీలించారు.