అమరావతికే ‘ఐ’కానిక్..!
ABN , Publish Date - Jun 23 , 2026 | 04:32 AM
లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన 135 మీటర్ల ఎత్తయిన ‘లండన్ ఐ’ ఆ నగరానికే తలమానికంగా నిలిచింది..!
కృష్ణానదీ తీరంలో ‘లండన్ ఐ’ తరహాలో నిర్మాణానికి అడుగులు
139 మీ. ఎత్తు.. 128 మీ. వ్యాసంతో ఏర్పాటు
గుంటూరు (రాజఽధాని), జూన్ 22 (ఆంధ్రజ్యోతి): లండన్‌లో థేమ్స్ నది ఒడ్డున ఏర్పాటు చేసిన 135 మీటర్ల ఎత్తయిన ‘లండన్ ఐ’ ఆ నగరానికే తలమానికంగా నిలిచింది..! ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తూ బ్రిటన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది...! అద్భుతమైన 360 డిగ్రీల వీక్షణను అంది స్తూ లండన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను ఆకాశం నుంచి వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ‘లండన్ ఐ’ స్ఫూర్తితో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచేలా ఏర్పాటు చేయనున్న భారీ ‘జెయింట్ వీల్’ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఐకానిక్ ఐ ప్రాజెక్టుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో దీని నిర్మాణానికి ఆర్థిక సాధ్యాసాధ్యాలను అంచనా వేసే ‘టెక్నో-ఎకనామిక్ ఫీజబిలిటీ రిపోర్ట్’ సిద్ధమైంది.
కృష్ణా నది ఒడ్డున.. రాయపూడి సమీపంలో..
ఈ నివేదక ప్రకారం కోర్ క్యాపిటల్ పరిధిలో నిర్మిస్తున్న ప్రభుత్వాధికారుల భవనాలకు తూర్పు వైపున కృష్ణా నది ఒడ్డున రాయపూడి, ఉద్దండరాయునిపాలెం సమీపంలో 6 ఎకరాల్లో ఈ పర్యాటక ప్రాజెక్టును నిర్మించనున్నారు. లండన్‌లోని థేమ్స్ నది ఒడ్డున నిర్మించిన ఐరోపాలోనే అత్యంత ఎత్తయిన కాంటిలెవర్డ్ అబ్జర్వేషన్ వీల్ తరహాలో దీన్ని నిర్మిస్తున్నారు. లండన్ ఐ వీల్ ఎత్తు 135 మీటర్లు (443), వ్యాసం 120 మీటర్లు కాగా.. ఇక్కడ అమరావతిలో నేలమట్టం నుంచి 139 మీటర్లు ఎత్తు, 128 మీటర్ల వ్యాసంతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. దీనిలో ఇందులో మొత్తం 28 ఏసీ, మెకానికల్లీ స్టెబిలైజ్డ్ క్యాప్సూల్ (క్యాబిన్లు) ఏర్పాటు చేస్తారు. ఒక్కో కాప్స్యూల్‌లో 20 నుంచి 25 మంది ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ చక్రం ఒక చుట్టు తిరగడానికి 27 నిమిషాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం 3 లక్షల చుట్లు (సైకిల్స్).. లేదా 30 ఏళ్ల కాలపరిమితి పనిచేసేలా దీన్ని నిర్మిస్తారు. ఈ భారీ జెయింట్ వీల్ నిర్మాణానికి మొత్తం వ్యయం రూ.120 కోట్లు అవుతుందని అంచనా వేశారు. పర్యాటకుల టికెట్ల ద్వారానే ఏటా రూ.35.66 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. దీనికి అనుబంధంగా ఎకరం విస్తీర్ణంలో రూ.39.2 కోట్లతో కమర్షియల్ ప్రాజెక్టును నిర్మిస్తారు. దీని ద్వారా ఏటా రూ.6.32 కోట్ల ఆదాయం రావొచ్చని అంచనా. లీజు, నిర్వహణ ఖర్చు రూ.19.25 కోట్లుగా అంచనా వేశారు.