Share News

గ్రోత్‌ ఇంజన్‌గా అమరావతి

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:22 AM

రాజధాని అమరావతి రాష్ట్రానికి ఓ గ్రోత్‌ ఇంజన్‌గా ఉండాలని, ఆదాయం తెచ్చి పెట్టే నగరంగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ...

గ్రోత్‌ ఇంజన్‌గా అమరావతి

  • రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా అభివృద్ధి

  • హరిత, నీలి నగరంగా రాజధాని నిర్మాణం

  • సీఆర్‌డీఏ సమావేశంలో సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి రాష్ట్రానికి ఓ గ్రోత్‌ ఇంజన్‌గా ఉండాలని, ఆదాయం తెచ్చి పెట్టే నగరంగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 60వ సీఆర్‌డీఏ సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణంలో భాగంగా వివిధ ప్రతిపాదనలను ఆమోదించారు. సీఎం మాట్లాడుతూ రాజధానిలో చేపట్టే ఐకానిక్‌ నిర్మాణాలు తెలుగుదనం ఉట్టిపడేలా, సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. అమరావతిని హరిత, నీలి నగరంగా, లివబుల్‌ సిటీగా నిర్మిస్తున్నామన్నాని స్పష్టం చేశారు. బిట్స్‌ పిలాని వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలతో అమరావతి ఓ కీలక విద్యా కేంద్రంగా నిలవనుందన్నారు. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని, కృష్ణా నదిపై నిర్మించే బ్రిడ్జిని ఐకానిక్‌గా ఉండాలని నిర్దేశించారు. అసెంబ్లీ వంటి భవనాల నిర్మాణాలు సందర్శకులకు అద్భుత అనుభూతిని కలిగించేలా ఉండాలన్నారు. రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ ప్రక్రియపై కార్యాచరణ మొదలుపెట్టాలని సూచించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులతో పాటు ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా అమరావతి మారాలన్నారు. రాజధానిలో నిర్మించే ఎత్తైన, ఐకానిక్‌ భవనాల నిర్మాణానికి ఓ ప్రత్యేక ప్రణాళిక ఉండాలన్నారు. నవ నగరాలతో పాటు నగర విస్తరణపై భవిష్యత్తు ప్రణాళికలు ఉండాలన్నారు. నీరు, విద్యుత్‌, గ్యాస్‌ అవసరాలన్నీ ప్రజలకు డక్ట్‌ల ద్వారా సరఫరా జరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచనలు చేశారు.


పలు కీలక అంశాలకు సీఆర్‌డీఏ ఆమోదం

  • అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్‌ టవర్ల నిర్మాణానికి 1208.41 కోట్ల వ్యయంపై పాలనా అనుమతి ఇచ్చేందుకు, సచివాలయ, జీఏడీ, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణంలో వివిధ పనులు చేపట్టేందుకు రూ.2540 కోట్ల వ్యయానికి ఆమోదం.

  • శాసనసభ భవనంలో వివిధ సివిల్‌ పనులకు గాను రూ.798 కోట్లు వ్యయం చేసేందుకు, ఎల్పీఎస్‌ జోన్‌ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల లాంటి మౌలిక సదుపాయాల కల్పన చేపట్టేందుకు ఆమోద ముద్ర.

  • రాజధానిలో 220 కేవీ లైన్స్‌ రీరూటింగ్‌కు ఓకే.

  • 2వదశ ఎల్పీఎస్‌ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్‌ మంజూరు కోసం నిబంధనల్లో మార్పు.

  • మెట్టభూములకు ఎకరాకు రూ.40 వేలు, జరీబుకు రూ.60 వేలకు కౌలు పెంచుతూ నిర్ణయం.

  • కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో 1.78 ఎకరాలు, స్వామి నారాయణ్‌ గుకుల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటుకు వేర్వేరు చోట్ల 4.23 ఎకరాలు, అగ్నిమాపక శాఖకు రాయపూడివద్ద 2 ఎకరాలు, డీఏవీ పాఠశాలకు నెక్కల్లు వద్ద 3 ఎకరాలు కేటాయింపు.

Updated Date - Apr 24 , 2026 | 05:22 AM