Share News

గెలిచి.. నిలిచింది!

ABN , Publish Date - Apr 03 , 2026 | 06:09 AM

రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా జరిగి ఉంటే ఈపాటికి ఓ రూపు వచ్చేది. కానీ ఆంధ్రుల కలల రాజధానిని గత జగన్‌ ప్రభుత్వం సమాధి చేయాలని చూసింది.

గెలిచి.. నిలిచింది!

  • అమరావతి ప్రస్థానంలో కీలక ఘట్టాలు

  • 2014లో ఆవిర్భావం నుంచి.. తాజాగా పార్లమెంటు ఆమోదం దాకా

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా జరిగి ఉంటే ఈపాటికి ఓ రూపు వచ్చేది. కానీ ఆంధ్రుల కలల రాజధానిని గత జగన్‌ ప్రభుత్వం సమాధి చేయాలని చూసింది. మూడు ముక్కలాటతో నిర్వీర్యం చేయాలని ప్రయత్నించింది. కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాక... తాజాగా పార్లమెంటులో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్‌విభజన సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం వరకూ కీలక ఘట్టాలు..

  • 2014 జూన్‌ 2: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో హైదరాబాద్‌ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా మారింది.

  • 2014 సెప్టెంబరు 1: గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ప్రాంతాన్ని ఖరారు చేశారు.

  • 2014 సెప్టెంబరు 3: గ్రీన్‌ ఫీల్డ్‌ విధానంలో రాజధాని నగరాన్ని నిర్మించాలని అసెంబ్లీ తీర్మానం చేసింది.

  • 2014 డిసెంబరు 8: రాజధానిపై మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి సింగపూర్‌ సంస్థలతో ఒప్పందం.

  • 2014 డిసెంబరు 30: సీఆర్‌డీఏ చట్టం అమల్లోకి వచ్చింది. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.

  • 2015 జనవరి: రాజధాని కోసం భూ సమీకరణ ప్రారంభమైంది.

  • 2015 మార్చి: 29 గ్రామాల్లో సుమారు 33 వేల ఎకరాల సమీకరణకు రైతుల అంగీకారం లభించింది.

  • 2015 ఏప్రిల్‌ 23: రాజధాని నగరానికి అధికారికంగా అమరావతి పేరు పెట్టారు.

  • 2015 జూలై 20: రాజధాని మాస్టర్‌ ప్లాన్లను సింగపూర్‌ బృందం ప్రభుత్వానికి అందజేసింది.

  • 2015 అక్టోబరు 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. అన్ని ప్రాంతాల నుంచి మట్టి, నీరు తెచ్చారు.


  • 2016 ఫిబ్రవరి: మాస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్లాన్‌ నోటిఫై చేశారు.

  • 2016 జూన్‌: ఏపీ సచివాలయం, ప్రభుత్వ విభాగాలు అమరావతి ప్రాంతం నుంచి పనిచేయడం ప్రారంభం.

  • 2018 డిసెంబరు: సచివాలయ టవర్స్‌కు శంకుస్థాపన.

  • 2019 ఫిబ్రవరి: హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన.

  • 2019 మే: వైసీపీ ప్రభుత్వంలో అమరావతిపై కుట్రలు ప్రారంభం.

  • 2019 డిసెంబరు 17: వైసీపీ మూడు రాజధానుల ప్రకటన

  • 2020 జూలై 31: సీఆర్‌డీఏ చట్టం రద్దు చేశారు. మూడు రాజధానుల బిల్లు పెట్టారు. శాసనమండలిలో టీడీపీ వ్యతిరేకించింది. అప్పటి మండలి చైర్మన్‌ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారు.

  • 2021 డిసెంబరు 13: న్యాయ వివాదాలతో మూడు రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సీఆర్‌డీఏ చట్టం పునరుద్ధరణ.

  • 2022 మార్చి 5: అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు తీర్పు.

  • 2024 జూన్‌ 2: పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. హైదరాబాద్‌ తెలంగాణకు పరిమితమైంది.

  • 2025 మే 2: ప్రధాని మోదీ రాజధాని పనులను పునఃప్రారంభించారు.

  • 2026 మార్చి 28: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతే ఉండాలని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.

  • 2026 ఏప్రిల్‌ 1: రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్‌విభజన సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది.

  • 2026 ఏప్రిల్‌ 2: సదరు బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

Updated Date - Apr 03 , 2026 | 06:10 AM