Share News

అమరావతిపై అవే కుట్రలు!

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:36 AM

నాడు అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులన్నారు. అమరావతిపై విషం గక్కారు. నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేశారు. రాజధాని రైతులను, మహిళలను ఎన్నో రకాలుగా వేధించారు.

అమరావతిపై అవే కుట్రలు!

  • రాజధాని రైతుల పరిరక్షణ పేరిట చిచ్చుకు యత్నం

  • జగన్‌ పార్టీ నేతలపై తిరగబడిన రైతులు

  • నాడు అధికారంలో ఉండగా మూడుముక్కలాట

  • నిర్మాణాలు ఆపేసి, రైతులకు తీవ్ర వేధింపులు

  • అధికారం పోయాక ‘మావిగన్‌’ అంటూ కొత్తపాట

  • ప్రభుత్వంపై రాజధాని రైతులను రెచ్చగొట్టే యత్నం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నాడు అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులన్నారు. అమరావతిపై విషం గక్కారు. నిర్మాణాలను ఎక్కడికక్కడ ఆపేశారు. రాజధాని రైతులను, మహిళలను ఎన్నో రకాలుగా వేధించారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినా వైఖరి మారలేదు. ‘మావిగన్‌’ అంటూ కొత్త పాట అందుకున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి పదే పదే విషం చిమ్ముతూనే ఉన్నారు. ఇప్పుడు అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ పేరిట.. రాజధాని రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్రలకు దిగారు. అమరావతికి ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ‘మావిగన్‌’ ఏర్పాటు చేయాలని ఆ మధ్య ఉచిత సలహా ఇచ్చిన జగన్‌.. అకస్మాత్తుగా తన పార్టీ నేతలను అమరావతికి పంపారు. ఎవరూ పిలవకుండానే శనివారం జగన్‌ పార్టీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్‌లు రాజధాని ప్రాంతంపై యుద్ధానికి వెళ్లినట్టుగా వెళ్లారు. తమ అనుచరులతో కలసి ఉండవల్లి ప్రాంతానికి వాహనాల్లో వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న రాజధాని రైతులు, మహిళా రైతులు వైసీపీ నేతల వాహనాలను అడ్డుకున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించి విషప్రచారం చేయాలనుకున్న జగన్‌ పార్టీ నేతలకు చుక్కలు చూపించారు.


పారని జగన్‌ పాచిక

అమరావతి నిర్మాణం కోసం అదనంగా భూసమీకరణకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో.. ఇటీవల తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో కొంత మంది పార్టీ ముఖ్యనేతలు, ఇంకొందరు రైతులతో అమరావతి వ్యతిరేక గళాన్ని వినిపించేలా కుట్ర రాజకీయానికి జగన్‌ తెరతీశారు. తమ భూములను బలవంతంగా లాక్కొంటున్నారంటూ ఈ సమావేశంలో రైతులతో చెప్పించారు. దీనిని జగన్‌ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయించారు. కానీ ఆ సంతోషం 24 గంటలు కూడా నిలవలేదు. జగన్‌తో సమావేశమైన మరునాడే పెనుమాకకు చెందిన రైతు ఎం.రామారావు తన రెండున్నర ఎకరాల భూమిని రాజధాని కోసం అప్పగించేశారు. అయునా అమరావతిపై కుట్రలు ఆపలేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలతో.. అమరావతి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదని, 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే మావిగన్‌ను జగన్‌ రాజధానిగా ప్రకటిస్తారంటూ ప్రకటనలు చేయించడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఏకంగా రాజధాని గ్రామాల్లో పర్యటనకు వెళ్లడంతో రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది.


రాజధాని రైతుల ఆగ్రహం

2019-24 మధ్య కాలంలో జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు రాజధాని రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించారు. మహిళా రైతులపైనా పోలీసులతో దాడులు చేయించారు. వందలాది కేసులు పెట్టారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. తమ ఆశలు నెరవేరబోతున్నాయని అమరావతి రైతులు భావిస్తున్న పరిస్థితుల్లో రైతుల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ నేతలు వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. అసలు అమరావతిని రాజధానిగానే గుర్తించనప్పుడు.. రాజధాని రైతుల పరిరక్షణ పేరిట వైసీపీ బ్యాచ్‌ రావడం వెనుక కుట్ర ఉందని మహిళా రైతులు మండిపడ్డారు.

రాష్ట్రంలో అశాంతికి కుట్ర

రాష్ట్రంలో అశాంతి నెలకొల్పేలా జగన్‌ నిత్యం ఏదో ఒక కుట్రకు తెరతీస్తున్నారని కూటమి ఆరోపిస్తోంది. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగిన మరునాడే రైతులు జగన్‌కు ఎదురు తిరిగారు. ఆయన ఈ అసహనంతోనే అంబటి, పేర్ని, లేళ్ల, దేవినేనిలను మందీ మార్బలంతో ఉండవల్లి, పెనుమాక రైతులపైకి ఉసికొల్పారని అంటున్నారు. రైతులపై దండయాత్రకు వెళ్లినట్లుగా, వారి మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ నేతలను పంపారని విమర్శిస్తున్నారు. మొత్తానికి రాజధాని రైతులు ఎదురు తిరగడంతో జగన్‌ పార్టీ నేతల కుట్రలు సాగలేదు.

Updated Date - Jun 28 , 2026 | 05:41 AM