Share News

అమరావతిపై వైసీపీ దండయాత్ర

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:30 AM

రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దండయాత్ర చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి రేపారు. రాజధాని రైతుల్లో విభేదాలు సృష్టించి, అమరావతిపై మరోమారు విషం కక్కాలన్న వైసీపీ ఎత్తుగడను రైతులు అడ్డుకున్నారు.

అమరావతిపై  వైసీపీ దండయాత్ర

  • రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో రైతుల్లో విభేదాలు సృష్టించేందుకు కుట్ర

  • అమరావతి పర్యటనను అడ్డుకున్న రైతులు

  • అంబటి, పేర్ని, లేళ్ల, అవినాశ్‌కు నిరసన సెగ

  • ఉండవల్లి వద్ద రోడ్డుపై రైతుల బైఠాయింపు

  • నెట్టుకుంటూ ముందుకెళ్లేందుకు నేతల యత్నం

  • అమరావతి రాజధాని కాదన్న వైసీపీ నేతలకు

  • ఇక్కడ ఏం పనంటూ ప్రశ్నించిన రైతులు

  • ఇరుపక్షాల మధ్య తోపులాట.. తీవ్ర ఉద్రిక్తత

  • పరస్పరం రాళ్లు, కోడిగుడ్లు విసురుకున్న వైనం

  • రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలు

మంగళగిరి/తాడేపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు దండయాత్ర చేశారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో అలజడి రేపారు. రాజధాని రైతుల్లో విభేదాలు సృష్టించి, అమరావతిపై మరోమారు విషం కక్కాలన్న వైసీపీ ఎత్తుగడను రైతులు అడ్డుకున్నారు. రాజధానికి భూములివ్వని కొద్దిమంది రైతులను అడ్డు పెట్టుకుని... సీఆర్‌డీఏ పరిరక్షణ కమిటీ, రాజధాని రైతుల పరిరక్షణ కమిటీల పేరుతో వైసీపీ నేతలు విభజన రాజకీయానికి తెర లేపారు. వైసీపీ నేతల బృందం శనివారం రాజధాని గ్రామాల్లో ఒకటైన పెనుమాకలో పర్యటించే లక్ష్యంతో ఉండవల్లి మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించగా రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉండవల్లి షిర్డీ సాయిబాబా మందిరం సమీపంలో వైసీపీ బృందానికి, రాజధాని రైతులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చెలరేగింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సకాలంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మొత్తంమీద గంటపాటు ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం, ఘర్షణ వాతావరణం కనిపించింది.

Untitled-5 copy.jpg


ఏం జరిగిందంటే...

రాజధాని రైతుల పరిరక్షణ కమిటీ పేరుతో పెనుమాకలో పర్యటించేందుకు వైసీపీ నేతలు ఉండవల్లి బయల్దేరారు. వైసీపీ బృందం పర్యటన గురించి ముందస్తు సమాచారం అందుకున్న రాజధాని రైతులు పెద్దసంఖ్యలో ఉండవల్లి సెంటర్‌కు సమీపంలోని సాయిబాబా గుడి వద్దకు చేరుకున్నారు. రోడ్డుపై అడ్డుగా బైఠాయించి వైసీపీ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ‘రాజధానిగా అమరావతిని కాదన్న వైసీపీ నేతలకు రాజధానిలో ఏం పని?’, ‘రాజధాని ద్రోహి జగన్‌’, ‘జై అమరావతి.. జైజై అమరావతి’ అనే స్లోగన్‌లతో కూడిన ప్లకార్డులను రైతులు ప్రదర్శించారు. ఈలోగా అక్కడికి వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, దేవినేని అవినాశ్‌, లేళ్ల అప్పిరెడ్డి, మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు వైసీపీ కార్యకర్తలతో కలిసి నాలుగు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. రోడ్డుపై అడ్డుగా బైఠాయించిన రాజధాని రైతులు వీరిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. వైసీపీ బృందం తమ కార్లను వదిలేసి, అడ్డుగా ఉన్న రాజధాని రైతులను నెట్టుకుంటూ పాదయాత్రగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో రాజధాని రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అసలు అమరావతి రాజధాని కాదన్న వైసీపీ నేతలకు అమరావతిలో ఏం పనంటూ రైతులు తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. వారిని మరింత గట్టిగా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య తోపులాట మొదలై పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేతలు పట్టువదలకుండా ముందుకు కదులుతామంటూ భీష్మించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరుపక్షాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పాటు కోడిగుడ్లు విసురుకున్నారు.


భారీగా పోలీసుల మోహరింపు

మంగళగిరి డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు భారీగా అప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఇరుపక్షాలను చెరోవైపు నెట్టివేస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఓ ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌తో పాటు తాడేపల్లి పీఎ్‌సకు చెందిన కానిస్టేబుల్‌ గాయపడ్డారు. పోలీసులు వీరిని హుటాహుటిన మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘర్షణలో వైసీపీ నేత అప్పిరెడ్డికి చెందిన కారు అద్దాలు కొంతవరకు ధ్వంసమయ్యాయి. మొత్తం మీద పోలీసులు శ్రమించి ఇరుపక్షాలను చెరోపక్కకు తరలించారు. వైసీపీ నేతలకు సర్దిచెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపించివేశారు. దీంతో వైసీపీ బృందం తాడేపల్లిలోని జగన్‌ నివాసం వద్ద ఉన్న తమ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. వైసీపీ నేతలు మళ్లీ ఏక్షణానైనా రాజధానిలోకి వచ్చే అవకాశముందని అనుమానించిన రాజధాని రైతులు ఉండవల్లి సెంటర్‌ సమీపంలోనే కొదిసేపు వేచివున్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే సమ్మతించి, ఆ తరువాతే రాజధానిలోకి వైసీపీ నేతలు అడుగుపెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

కానిస్టేబుల్‌కు అనిత పరామర్శ

రాళ్ల దాడిలో గాయపడ్డ చిత్తూరు జిల్లా స్పెషల్‌ పార్టీ కానిస్ట్టేబుల్‌ చిన్న తంబిని హోంమంత్రి అనిత ఫోన్‌లో పరామర్శించారు. తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


వైసీపీ కొత్త నాటకాలు: మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి రైతుల పేరుతో వైసీపీ కొత్త నాటకాలకు తెరదీసిందని మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో విమర్శించారు. ‘రైతుల మనోభావాలతో రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటైంది. అమరావతిని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు అమరావతి రైతుల పరిరక్షణ పేరుతో కొత్త నాటకానికి తెరదీశారు. అమరావతి రైతుల ఆగ్రహానికి కారణం వైసీపీ ద్వంద్వ వైఖరే. గొడ్డలి పార్టీ నేతలు పోలీసులపై దాడి చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. పోలీసులపై దాడులను ప్రభుత్వం ఉపేక్షించదు’ అని అచ్చెన్న స్పష్టం చేశారు.

జగన్‌ ఎన్ని జన్మలెత్తినా అమరావతిని అడ్డుకోలేరు: మంత్రి సవిత

జగన్‌ ఎన్ని జన్మలెత్తినా. తల్లకిందులుగా తపస్సు చేసినా అమరావతిని అడ్డుకోలేరని మంత్రి సవిత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘రాజధాని అమరావతిపై విషం కక్కుతున్న జగన్‌, తన అనుచరులను రెచ్చగొడుతూ రాజధాని ప్రాంతంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. జగన్‌కు అభివృద్ధి చేతకాదు. చేసి చూపిస్తే తట్టుకోలేని సైకో మనస్తత్వం అతనిది. జనాలు చీకొట్టినా జగన్‌కు సిగ్గురావడం లేదు. గొడ్డలి పార్టీ ఎన్ని కుట్రలు చేసినా అమరావతిని నిర్మించి తీరుతాం’ అని మంత్రి సవిత స్పష్టం చేశారు.

Updated Date - Jun 28 , 2026 | 05:34 AM