స్టార్ హోటళ్లకు ఆహ్వానం
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:00 AM
రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాలు పూర్తయ్యేనాటికి హోటళ్లను కూడా సిద్ధం చేస్తే బిజినెస్ మీటింగ్స్‌కు, ప్రభుత్వ కార్యక్రమాలు, పెట్టుబడిదారుల సదస్సులు, పర్యాటకం, దేశ, విదేశాల అతిథులకు..
రాజధానిలో ఒకేసారి ఐదు హోటళ్లకు ఆర్‌ఎ్‌ఫపీ
వీటిల్లో రెండు ఫోర్‌స్టార్, మూడు త్రీస్టార్ హోటల్స్
గుంటూరు, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాలు పూర్తయ్యేనాటికి హోటళ్లను కూడా సిద్ధం చేస్తే బిజినెస్ మీటింగ్స్‌కు, ప్రభుత్వ కార్యక్రమాలు, పెట్టుబడిదారుల సదస్సులు, పర్యాటకం, దేశ, విదేశాల అతిథులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ ఒకే రోజున స్టార్ హోటళ్లు ఐదు నిర్మాణానికి ప్రతిపాదన అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పీ)లను ఆహ్వానించింది. ఈ నెలాఖరు వరకు వివిధ సంస్థల నుంచి ఆర్‌ఎఫ్‌పీలను స్వీకరించి ఆ తర్వాత నిబంధనల మేరకు ఏజెన్సీలను ఖరారు చేయనుంది. గరిష్ఠంగా రెండేళ్ల వ్యవధిలోనే ఈ ఐదు స్టార్ హోటల్స్ ఏర్పాటు చేయించాలని సీఆర్‌డీఏ లక్ష్యంగా పెట్టుకొంది. ఐదు హోటళ్లలో త్రీ స్టార్ హోటల్స్ మూడు, ఫోర్ స్టార్ హోటల్స్ రెండు ఉన్నాయి. త్రీస్టార్ హోటళ్లు కనీసం 125 గదులు నిర్మించాల్సి ఉంటుంది. ఇందులో స్టాండర్డ్, సుపీరియర్, డీలక్స్ రూంలు ఉండాలి. మొత్తం గదులలో ఐదు శాతం సూట్ స్థాయిలో ఉండాలి. 24 గంటలూ పనిచేసే రెస్టారెంట్, బార్, రూం సర్వీసుతో పాటు 1,500 సీటింగ్ సామర్థ్యం కలిగిన బ్యాంకెట్/కన్వెన్షన్ హాల్ నిర్మించాలి. రూఫ్‌టా్‌పలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయాలి. త్రీ స్టార్ హోటల్ నిర్మాణానికి రూ.75 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలి. ఇదేవిధంగా ఫోర్ స్టార్ హోటళ్లని 175 గదులతో నిర్మించాలి. వీటిల్లో 2,500 సీటింగ్ సామర్థ్యం కలిగిన బ్యాంకెట్/కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫోర్‌స్టార్ హోటల్స్ నిర్మాణానికి కనీసం రూ.100 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాలి.