Share News

13 నుంచి అందుబాటులోకి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు

ABN , Publish Date - Jul 26 , 2026 | 05:18 AM

రాజధాని అమరావతి రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు(ఈ 3) ప్రధాన భాగం పూర్తి కాబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో 13 నాటికల్లా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్న..

13 నుంచి అందుబాటులోకి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు

  • యుద్ధప్రాతిపదికన ఫేజ్‌-2, ఫేజ్‌-3లోని స్టీల్‌ బ్రిడ్జి పనులు

  • కరకట్టతో పనిలేకుండా రాజధానికి రాజమార్గం

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

రాజధాని అమరావతి రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు(ఈ 3) ప్రధాన భాగం పూర్తి కాబోతోంది. ఎట్టి పరిస్థితుల్లో 13 నాటికల్లా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ఆగస్టు 15 నాటికి ఫేజ్‌-2 పనులను, ఫేజ్‌-3లో భాగమైన స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణాలను పూర్తిచేసి ఉండవల్లి నుంచి దొండపాడు వరకూ రోడ్డును పూర్తిగా అందుబాటులోకి తేవాలని ఏజీసీఎల్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఫేజ్‌-2 పనులు మొదలై శరవేగంగా జరుగుతున్నాయి. ఫేజ్‌-3 పనులూ ముమ్మరంగా సాగుతున్నాయి. ఉండవల్లి నుంచి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డును కలుపుతూ బకింగ్‌హామ్‌ కెనాల్‌పై బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. దీనిపై బీటీ రోడ్డు పనులు కూడా పూర్తయ్యాయి. అమరావతి కనెక్టివిటీలో సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు అత్యంత కీలకం. పాత, కొత్త(వెస్ట్‌ బైపాస్‌) 16వ నంబరు జాతీయ రహదారులను కలుపుతూ దొండపాడు వరకూ సాగే ఈ రహదారి పొడవు 21.78 కి.మీ. రాజధానిలో ఉత్తర దక్షిణాలుగా నిర్మించే 17 ఎన్‌ సిరీస్‌ రోడ్లను అనుసంధానం చేసుకుంటూ సాగే అతి పొడవైన రహదారి కావడంతో దీనిని సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుగా పిలుస్తున్నారు. ఒకసారి ఈ రోడ్డులో ప్రవేశిస్తే రాజధానిలోని ఏ ప్రాంతానికైనా వెళ్లే అవకాశం ఉంటుంది. ఫేజ్‌-1 దొండపాడు నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకూ 14.35 కి.మీ.... 2019 నాటికే అందుబాటులోకి వచ్చింది.


ఫేజ్‌-2లో పెనుమాక, ఉండవల్లి గుండా మరో 3.92 కి.మీ. రోడ్డు నిర్మించాలి. భూసమీకరణకు రైతులు సహకరించకపోవడంతో ప్రభుత్వం తాజాగా భూసేకరణ అస్త్రం ప్రయోగించింది. దీంతో ఆ సమస్య పరిష్కారమైంది. మంతెన ఆశ్రమం సమీపంలో అర ఎకరం భూమి ఇంకా సేకరించలేదు. దీనిపై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసిన నేపథ్యంలో అక్కడ పనులు ఆగాయి. ఈ రోడ్డు వేస్తే విజయవాడ ప్రకాశం బ్యారేజీ మీద నుంచి వచ్చే వారు ఉండవల్లి మీదుగా కరకట్టతో పనిలేకుండా నేరుగా రాజధాని అమరావతి చేరుకోవచ్చు. ఇక రాజధానిని పాత ఎన్‌హెచ్‌ 16 రోడ్డుతో అనుసంధానించే భాగాన్ని ఫేజ్‌-3 కింద నిర్మిస్తున్నారు. అందులో తొలి భాగమైన స్టీల్‌ బ్రిడ్జిని పూర్తి చేస్తున్నారు.

Updated Date - Jul 26 , 2026 | 05:19 AM