రాజధానికి రాచబాట సిద్ధం!
ABN , Publish Date - Aug 05 , 2026 | 03:52 AM
రాజధాని అమరావతికి రాచబాట అయిన సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్-2, స్టీలు బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూములను భూసేకరణ ద్వారా తీసుకున్న..
తుది దశకు చేరిన సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం
భూసేకరణ అనంతరం వేగం పుంజుకున్న పనులు
కొండవీటి వాగుపై భారీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి
అప్రోచ్ రోడ్లకు ఇరువైపులా అరుదైన మొక్కలు
రోడ్డు పొడవునా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల నిర్మాణం
12న సీఎం కాన్వాయ్ ట్రయిల్‌రన్, 13న ప్రారంభం
గుంటూరు(రాజధాని), ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి రాచబాట అయిన సీడ్ యాక్సిస్ రోడ్డు ఫేజ్-2, స్టీలు బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న భూములను భూసేకరణ ద్వారా తీసుకున్న తరువాత యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో 2 వారాల్లోపే సీడ్ యాక్సిస్ రోడ్డు ముఖచిత్రం మారిపోయింది. సీడ్ యాక్సిస్ (ఈ-3) రోడ్డు మొత్తం పొడవు 21.78 కి.మీ. కాగా దొండపాడు నుంచి వెంకటపాలెంలోని మంతెన ఆశ్రమం వరకూ ఫేజ్-1 కింద 14.35 కి.మీ. రోడ్డు ఇప్పటికే పూర్తయింది, ఫేజ్-2 కింద 3.92 కి.మీ రోడ్డుతో పాటు ఫేజ్-3 కింద 3.51 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా విజయవాడ నుంచి అమరావతికి ముఖద్వారం ఉండవల్లి వద్ద రెండు స్టీలు బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. తద్వారా అమరావతికి ఉత్తరాన ఉన్న జిల్లాలకు ప్రకాశం బ్యారేజీ మీదుగా అనుసంధానానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ కరకట్టపై నుంచి ప్రయాణించే వారంతా ఇకనుంచి సీడ్ యాక్సిస్ రోడ్డుపై నేరుగా అమరావతి చేరుకుంటారు.
ఉండవల్లిలోని బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న 110 మీటర్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వారం క్రితమే పూర్తయి, 18 మీటర్ల వెడల్పున బీటీ(తారు) రోడ్డు సిద్ధమైంది. కొండవీటి వాగుపై నిర్మించే 284 మీ. పొడవైన భారీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం మంగళవారం పూర్తయింది. దీన్ని సీడ్ యాక్సిస్ రోడ్డుకు కలిపే అప్రోచ్ రోడ్ల పనులు కూడా మరో నాలుగైదు రోజుల్లో పూర్తి కానున్నాయి. తక్షణ అవసరం రీత్యా 12 మీ. వెడల్పుతో 4 వరుసల్లో సీడ్ యాక్సిస్ రోడ్డును నిర్మిస్తున్నారు. రానున్న రోజుల్లో మరో బ్రిడ్జి నిర్మించి దీన్ని కూడా 9 వరసలకు విస్తరిస్తామని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఫేజ్-2 సీడ్ యాక్సిస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జి నిర్మాణాలను ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీనికి మూడు రోజుల ముందుగానే రోడ్డు పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని ఏడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. 12 సీఎం కాన్వాయ్ ట్రయిల్ రన్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
టూరిస్ట్ స్పాట్‌గా ముఖద్వారం
సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఉండవల్లి ముఖద్వారం కావడంతో అక్కడ రహదారిని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. బకింగ్‌హామ్ కాలువ, కొండవీటి వాగులపై నిర్మించే రెండు స్టీల్ బ్రిడ్జిల మధ్య ప్రాంతాన్ని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ఏడీసీఎల్ చర్యలు తీసుకుంటోంది. ఈ వంతెనల అప్రోచ్ రోడ్లకు ఇరువైపులా అరుదైన జాతి మొక్కలతో గార్డెనింగ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కొండవీటి వాగుపై నిర్మించే భారీ స్టీలు బ్రిడ్జి అందాలను వీక్షించేందుకు వీలుగా రెండు వంతెనల మధ్య ప్రాంతాన్ని వ్యూ పాయింట్‌గా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. రోడ్డుకు ఇరువైపులా బఫర్ జోన్లలో మహాగని, స్పర్టోడియా, లాస్టోమియా ఆరెంజ్, గోల్డెన్ నీమ్, కాసియో ఫిస్టులా వంటి అనేక అరుదైన మొక్కలతో సుందరమైన పార్కు వాతావరణాన్ని సృష్టించనున్నారు. దీంతోపాటు సీడ్ యాక్సిస్ రోడ్డు పొడవునా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. వాటికి అనుబంధంగా గ్రీన్ జోన్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు.