Share News

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేయండి

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:12 AM

రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అవరోధంగా ఉన్నాయని..

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేయండి

  • హైకోర్టుకు ఏజీ విజ్ఞప్తి.. తీర్పు రిజర్వ్‌

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణం విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అవరోధంగా ఉన్నాయని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ న్యాయస్థానానికి వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు ఈ కారణంగానే ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో విస్తృత ప్రజాప్రయోజనాన్ని గుర్తించి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులకు అవసరమైన కొన్ని భూములను సేకరణ విధానంలో తీసుకున్నట్టు తెలిపారు. కాగా, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు కోసం పెనుమాక గ్రామంలో తన భూమిని సేకరించే విషయంలో అధికారులు చట్టనిబంధనలు అనుసరించలేదని పేర్కొంటూ చోడిశెట్టి నిర్మలత హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జరిగిన విచారణలో ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ చింతలపూడి పురుషోత్తం కుమార్‌తో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. తాము నిర్ణయం వెల్లడించే వరకు ఆ స్థలం విషయంలో ప్రస్తుత స్థితిని కొనసాగించాలని అధికారులకు స్పష్టం చేసింది.

Updated Date - Jul 22 , 2026 | 05:13 AM