అమరావతిలో రూ.100 కోట్లతో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం
ABN , Publish Date - May 13 , 2026 | 05:20 AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.100 కోట్ల వ్యయంతో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం రాబోతోందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
ప్రైవేట్ కొరియర్లకు దీటుగా తపాలా శాఖ
ప్రతి చోటా మార్కెటింగ్ విభాగాలు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో జట్టు.. డెలివరీ సేవలు విస్తృతం
పోస్టల్ ఆదాయాన్ని 2,100 కోట్లకు పెంచాం
ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికో పాస్‌పోర్ట్ కేంద్రం
‘ఆంధ్రజ్యోతి’తో కేంద్ర మంత్రి పెమ్మసాని
న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రూ.100 కోట్ల వ్యయంతో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కేంద్రం రాబోతోందని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేటు కొరియర్ రంగానికి దీటుగా తపాలా శాఖను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. మోదీ 3.0 ప్రభుత్వంలో ఆయా శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి జూన్ నెలతో రెండేళ్ల పూర్తి కానున్న సందర్భంగా పెమ్మసాని మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతిచోటా ‘మార్కెటింగ్ సెల్స్’ ఏర్పాటు చేసి, చీఫ్ మార్కెటింగ్ స్టాఫ్‌ను నియమించామని చెప్పారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలతో జతకట్టి.. డెలివరీ ేసవలను విస్తృతం చేస్తున్నామని అన్నారు. తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ‘డాక్ సేవ’ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. దీని ద్వారా ఎక్కడి నుంచైనా సేవలు పొందవచ్చని చెప్పారు. పార్సిల్ ట్రాకింగ్, పోస్టేజ్ కాలిక్యులేషన్, ఫిర్యాదుల నమోదు, బీమా ప్రీమియం చెల్లింపుల వంటి సేవలు ఉన్నాయన్నారు. స్పీడోపోస్ట్, రిజిస్టర్డ్ పోస్టు, పార్సిల్ బుకింగ్ సేవలను గంటల తరబడి లైన్లో నిలబడే అవసరం లేకుండా యాప్ ద్వారానే పూర్తిచేసుకోవచ్చన్నారు. పార్సిల్, మెయిల్, బీమా, పొదుపు ఖాతాలు, ఆధార్ సేవలు, ఈ-కేవైసీ వంటి సేవలన్నీ పోస్టాఫీసులోనే పొందేలా చేస్తున్నామని తెలిపారు.
రూ.200 కోట్ల నుంచి రూ.2,100 కోట్లకు..
పోస్టల్ రాబడిలో వృద్ధి గత పదేళ్లలో సరాసరి ఏటా రూ.200 కోట్లు మించలేదని.. తాను బాధ్యతలు చేపట్టాక ఆ వృద్థిని రూ.2,100 కోట్లకు పెంచినట్లు పెమ్మసాని చెప్పారు. ప్రతి విభాగంలో దాదాపు 30-40 శాతం వృద్థి రేటు నమోదు చేస్తున్నామని చెప్పారు. 24 గంటల్లో ఎన్ని పార్సిళ్లు ఇచ్చాం.. 48 గంటల్లో ఎన్ని డెలివరీ అయ్యాయి? రిటర్న్ వచ్చిన పార్శిళ్లకు కారణమేంటనే అంశాలపై మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపా రు. ప్రతి పోస్టాఫీసులో ఐటీని ప్రవేశపెట్టి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని తెలిపారు. గతంలో చాలాచోట్ల ఆఫీసులే తెరిచేవారు కా దని, ఇప్పుడు ఉద్యోగులను జియో ట్యా గింగ్ పరిధిలోకి తెచ్చామని చెప్పారు. త్వరలో సేవింగ్స్ ఖాతాలు సహా ఇతర సౌకర్యాలన్నీ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందని తెలిపారు. ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో 9 వేల మంది గ్రా మీణ డాక్ ేసవకులతో భారీ సమ్మేళనం నిర్వహించామని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి పెంచేందుకు.. ఫొటోఫ్రేమ్స్ కట్టేవారు, ఇతర చేతివృత్తుల వారికే పోస్టల్ పార్సిల్ సర్వీసు బాధ్యతలు అప్పగించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. తపాలా శాఖ అంటే కేవలం ఉత్తరాలు, మనీఆర్డర్లు మాత్రమే కాదని, సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుంటూ, కార్పొరేట్ సంస్థలకు దీటుగా లాభాల బాట పట్టిస్తున్నామని చెప్పారు. సంస్కరణలు తోడై తే పోస్టాఫీసు లాభదాయకమైన వ్యాపార కేంద్రం అవుతుందని గ్రహించామని చెప్పారు. సాంకేతికతను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి ‘ఇండియా పోస్ట్’ను సరికొత్తగా ఆవిష్కరించామని తెలిపారు. దేశంలోని మొత్తం 1.65 లక్షల పోస్టాఫీసుల్లో దాదాపు 1.05 లక్షల కార్యాలయాలు నెలకు కనీసం ఒక్క లావాదేవీ కూడా జరగని స్థితిలో ఉండేవని.. లోపాలు సరిదిద్ది ఇప్పుడు వీటన్నిటినీ పటిష్ఠం చేశామని చెప్పారు.
తపాలా రంగానికి ఏఐ హంగులు
తపాలా శాఖను ఆధునిక లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ‘ఏపీటీ 2.0’ ప్రవేశపెట్టినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాతకాలపు పద్థతులకు స్వస్తి పలికి కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిర్వహణతో పోస్టల్ శాఖను కార్పొరేట్ తరహా సామర్థ్యం దిశగా నడిపిస్తున్నట్లు తెలిపారు. ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే కాకుండా, డేటా ఆధారిత నిర్ణయాలను వేగంగా తీసుకోవడం సాధ్యమవుతుందని, ఫలితంగా వినియోగదారులకు వేగవంతమైన, నమ్మకమైన సేవలు అందుతాయన్నారు. ఈ వేదిక ద్వారా ముఖ్యంగా గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన సేవలు అందని ప్రాంతాలను గుర్తించి, వారికి తపాలా సేవలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని క్రియాశీల మేధగా మార్చడం వల్ల ఆదాయ మార్గాలు మెరుగుపడటమే కాకుండా, లాజిస్టిక్స్ రంగంలో భారత తపాలా శాఖ పోటీతత్వం పెరుగుతుందన్నారు. సైబర్ భద్రతతో కూడిన డిజిటల్ మౌలిక సదుపాయాల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.