ఆర్-5 జోన్ పూర్తిగా వెనక్కి
ABN , Publish Date - May 06 , 2026 | 04:21 AM
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌నుదెబ్బతీసేలా గత ప్రభుత్వం రూపొందించిన ఆర్-5 జోన్‌ను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్టు త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది.
మాస్టర్‌ప్లాన్‌కు నష్టం జరగకుండా 2023కు ముందు స్థితికి
900 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని రెండు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు
రాజధాని రైతులకు స్పష్టం చేసిన త్రిసభ్య కమిటీ
సెంటు పట్టాల పేరుతో గత ప్రభుత్వం కుట్ర
ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 51 వేల మందికి పట్టాలు
లబ్ధిదారులకు సొంత జిల్లాల్లోనే భూములు కేటాయిస్తామన్న కమిటీ
గుంటూరు(రాజధాని), మే 5 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌నుదెబ్బతీసేలా గత ప్రభుత్వం రూపొందించిన ఆర్-5 జోన్‌ను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్టు త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. రాజధాని రైతుల సమస్యలపై సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశం అనంతరం కమిటీ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్, పొంగూరి నారాయణ, తెనాలి శ్రావణ్‌కుమార్ సమావేశ నిర్ణయాలను మీడియాకు తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్‌కు విఘాతం కలగకుండా ఉండేదుకు వీలుగా 2023కు ముందు స్థితికి ఆర్ 5 జోన్‌ను తీసుకువస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రెవెన్యూ శాఖకు బదిలీ చేసిన 900 ఎకరాలను తిరిగి తీసుకుంటున్నామని, ఇప్పటికే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా లబ్ధిదారులకు వారి సొంత జిల్లాల్లోనే భూములు కేటాయిస్తామని స్పష్టం చేశారు.
కీలక ప్రాంతాలను దెబ్బతీయడానికే ఆర్-5 జోన్
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా గత ప్రభుత్వం ‘పేదలకు భూహక్కు’ పేరుతో రాజధానిలోని పలు గ్రామాల్లో సెంటు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా నవ నగర ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి కీలకంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని ఇళ్ల పట్టాలు జారీ చేసింది. రాజధాని పరిధిలోని కురగల్లు, కృష్ణాయపట్నం, తుళ్లూరు, రాయపూడి, మందడం పరిధిలోని నాలెడ్జ్ సెంటర్లు, ఎలకా్ట్రనిక్ రీజియన్లలోని 900 ఎకరాలను రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 51 వేల మందికి సెంటు పట్టాలు ఇచ్చింది. హడావుడిగా రూ.110 కోట్లు ఖర్చు చేసి ప్లాట్లు, రోడ్లు, విద్యుత్ స్తంభాలు వేసింది. రైతులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా పట్టించుకోకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టాలు జారీ చేశారు. హడావుడిగా ఇళ్లు కూడా నిర్మాణం ప్రారంభించారు. సుప్రీంకోర్టు తీర్పుతో సెంటు పట్టాల వ్యవహారానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తాజాగా ఆర్ 5 జోన్‌పై నిర్ణయం తీసుకుంది.