Share News

క్వాంటమ్‌తో మేలిమలుపు

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:33 AM

అమరావతి ప్రపంచ స్థాయి క్వాంటమ్‌ హబ్‌గా మారుతోంది. ఈ భవిష్యత్‌ టెక్నాలజీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. పూర్తి స్వదేశీ...

క్వాంటమ్‌తో మేలిమలుపు

  • పరిశోధనా కేంద్రంగా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ

  • రెండేళ్లలో రాష్ట్రం నుంచే కంప్యూటర్ల ఎగుమతి

  • ఇప్పటికే సిద్ధమైన రెండు చిన్న కంప్యూటర్లు

  • కీలకమైన హార్డ్‌వేర్‌ పరిశోధన కోసం వినియోగం

  • ‘టెస్ట్‌ బెడ్స్‌’గా ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, మేధా టవర్స్‌

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రపంచ స్థాయి క్వాంటమ్‌ హబ్‌గా మారుతోంది. ఈ భవిష్యత్‌ టెక్నాలజీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రెండేళ్లలో క్వాంటమ్‌ కంప్యూటర్లను తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేయాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలో భాగంగా.. ఇప్పటికే రెండు చిన్న కంప్యూటర్లు సిద్ధమయ్యాయి. క్వాంటమ్‌ కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ పనితీరుపై పరిశోధనలు చేసేందుకు ఆ రెండు కంప్యూటర్లను ప్రత్యేకంగా ‘టెస్ట్‌ బెడ్స్‌’గా వినియోగించనున్నారు. ఈ పరిశోధనలు చేసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఆ వివరాలను గురువారం విజయవాడలో నిర్వహించిన మీడియా అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న వెల్లడించారు. రాష్ట్రంలో రెండేళ్లలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటమ్‌ కంప్యూటర్లు అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 14న ప్రపంచ క్వాంటమ్‌ కంప్యూటర్‌ దినోత్సవం సందర్భంగా రెండు టెస్టింగ్‌ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికి అంకితమిస్తారని వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఇలా క్వాంటమ్‌ కంప్యూటర్‌ టెస్ట్‌ ల్యాబ్‌లను ఒకటి ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో.. రెండోది గన్నవరం మేధా టవర్స్‌లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ రెండు క్వాంటమ్‌ టెస్ట్‌ బెడ్స్‌ ద్వారా.. కొత్తగా తయారు చేసిన క్వాంటమ్‌ కంప్యూటర్ల పనితీరును నిర్ధారణ చేయవచ్చని ప్రద్యుమ్న వెల్లడించారు. క్వాంటమ్‌ వ్యాలీలో ప్రధానంగా హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ (ఆల్గారిథమ్స్‌), స్కిల్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌, పార్టనర్‌షి్‌పలు ఉంటాయని వివరించారు. రెండేళ్లలో అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో క్వాంటమ్‌ కంప్యూటర్లను ఉత్పత్తిని చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా ఇప్పుడు రెండు క్వాంటమ్‌ కంప్యూటర్లను హార్డ్‌వేర్‌ పరిశోధన కోసం తయారు చేశామన్నారు. ఈ రెండు తయారయ్యాక అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో క్వాంటమ్‌ కంప్యూటర్లు తయారు చేయడం సాధ్యమేనన్న ధీమా కలిగిందన్నారు. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ నుంచి హార్డ్‌వేర్‌, ఆల్గారిథమ్స్‌తో కూడిన సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచానికి అందించగమన్న నమ్మకం కుదిరిందన్నారు. ఈ మీడియా అవగాహనా కార్యక్రమంలో అమరావతి క్వాంటమ్‌ కంప్యూటర్‌ సీఈవో శ్రీధర్‌, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సతీశ్‌కుమార్‌, ఐ అండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌ విశ్వనాథన్‌, క్యూబీ టెక్‌ పృథ్వీ, క్యూబీ ఫోర్స్‌ వెంకట్‌, క్వాంటమ్‌ కంప్యూటర్స్‌ సైంటిస్ట్‌ ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఏడాది తిరగకుండానే రెండు కంప్యూటర్లు

గతేడాది జూన్‌ 30న జాతీయ స్థాయిలో క్వాంటమ్‌ కంప్యూటర్స్‌పై విజయవాడ వేదికగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు ఏడాది తిరగకుండానే స్వదేశీ పరిజ్ఞానంతో రెండు క్వాంటమ్‌ కంప్యూటర్‌లను ‘టెస్ట్‌ బెడ్‌’లుగా సిద్ధం చేశారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో అమరావతి 1 ఎస్‌, గన్నవరం మేధా టవర్స్‌ వద్ద అమరావతి 1 క్యూ పేరిట వాటిని ఏర్పాటు చేస్తున్నారు. హార్డ్‌వేర్‌ పరీక్షలకు ఉపయోగపడే ఈ రెండు కంప్యూటర్లను తయారు చేయడానికి డీఆర్‌డీవో, డీవైఎ్‌సఎల్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, క్యూబిట్‌ ఎలకా్ట్రనిక్స్‌, క్యూబిట్‌ ఫోర్సెస్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాయి.

హార్డ్‌వేర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లుగా..

ఎస్‌ఆర్‌ఎం, మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసే కంప్యూటర్ల హార్డ్‌వేర్‌ పరిజ్ఞానం భారతీయ విద్యార్థులతో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఓపెన్‌ యాక్సిస్‌ విధానంలో అందుబాటులో ఉంటుంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన ఈ రెండు కంప్యూటర్‌లూ.. హార్డ్‌వేర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లుగా అందరికీ ఉపయోగపడతాయి. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ను క్యూబిట్‌ ఫోర్స్‌ సంస్థకు చెందిన వెంకట్‌ (చెన్నై), మేధాటవర్స్‌లో ఏర్పాటు చేసే క్వాంటమ్‌ కంప్యూటర్‌ను క్యూబీ టెక్‌కు చెందిన పృథ్వీ (విశాఖపట్నం) తయారు చేశారు. ఈ రెండు భవిష్యత్తు క్వాంటమ్‌ కంప్యూటర్ల పనితీరును పరిశీలించే పరిశోధనా కేంద్రాలుగా ఉపయోగపడతాయి. క్యూబిట్‌ ఫోర్స్‌, క్యూబిటెక్‌ తయారు చేసిన రెండు క్వాంటమ్‌ కంప్యూటర్లూ గత నెల 31న ఎస్‌ఆర్‌ఎం, మేధాటవర్స్‌కు చేరుకున్నాయి. వీటి అసెంబ్లింగ్‌ ఈనెల 11వ తేదీనాటికి పూర్తవుతుంది.

మైనస్‌ 273 సెంటిగ్రేడ్‌ కూలింగ్‌ ఉండాల్సిందే..

క్వాంటమ్‌ కంప్యూటర్‌ పని చేయాలంటే మైనస్‌ 263 నుంచి 273 సెంటీగ్రేడ్‌లో ఉష్ణోగ్రత ఉండాలి. దీనిని ఒక సిలెండర్‌లో భద్రపరుస్తారని నిపుణులు చెబుతున్నారు. అతి శీతల వాతావరణం ఉండాలని, ఈ ఉష్ణోగ్రత చేరుకునేందుకు కనిష్ఠంగా 36 గంటలు పడుతుందని వారు విరించారు. క్వాంటమ్‌ టెక్నాలజీకి హార్డ్‌వేర్‌పై అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం కృత్రిమ మేధ చుట్టూ తిరుగుతోందని, అందుకే ఇటీవల ఒరాకిల్‌ లాంటి ప్రఖ్యాత సంస్థ ఒక్కసారిగా 32,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిందని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సీహెచ్‌ సతీశ్‌ కుమార్‌ అన్నారు. ప్రస్తుత తరుణంలో మేలిమలుపుగా నిలిచే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌పై విద్యార్థులు దృష్టి పెట్టాలన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 04:33 AM