క్వాంటైమ్!
ABN , Publish Date - Apr 14 , 2026 | 04:36 AM
ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ విప్లవంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ తనదైన ముద్ర వేయబోతోంది. రెండు స్వదేశీ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ల (టెస్ట్ బెడ్) ఆవిష్కరణతో...
క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్లు నేడే ప్రారంభం
జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు
దేశంలోనే తొలిసారిగా ఏపీలో ‘టెస్ట్ బెడ్స్’
ఎస్‌ఆర్‌ఎం, మేధా టవర్స్‌లో స్వదేశీ కంప్యూటర్లు
క్వాంటమ్ హార్డ్‌వేర్ పరీక్షలకు అంతా సిద్ధం
గ్లోబల్ లీడర్‌గా ఏపీ ఎదిగేందుకు దోహదం
సంక్లిష్ట సమస్యలకు క్వాంటమ్‌తో సత్వర పరిష్కారం
ఔషధాల నుంచి వ్యవసాయం వరకూ ఉపయుక్తం
అమరావతి, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ విప్లవంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ తనదైన ముద్ర వేయబోతోంది. రెండు స్వదేశీ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ల (టెస్ట్ బెడ్) ఆవిష్కరణతో దేశానికి క్వాంటమ్ హబ్‌గా అవతరించబోతోంది. గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ రోజైన మంగళవారం ఆ రెండు టెస్టింగ్ బెడ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో భాగంగా వన్- ఎస్ టెస్ట్‌బెడ్‌ను రాజధాని ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలోనూ, వన్- క్యూ టెస్ట్ బెడ్‌ను గన్నవరంలోని మేధాటవర్స్‌లోనూ ఏర్పాటు చేశారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఏర్పాటు చేసిన సెంటర్‌ను సీఎం చంద్రబాబు నేరుగా ప్రారంభిస్తారు. గన్నవరం సెంటర్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించి రెండు కంప్యూటర్లను జాతికి అంకితం చేస్తారు. దీనితో ఆంధ్రప్రదేశ్ టెక్ శకంలో నూతన అధ్యాయానికి నాంది పడనుంది. ఈ రెండు ఫెసిలిటీలతో ప్రత్యేకమైన క్వాంటమ్ పరీక్షలు చేసి, ధ్రువీకరించగలిగిన దేశంలోనే తొలి రాష్ట్రంగా ఏపీ అవతరిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రెండు ఫెసిలిటీ సెంటర్లు విస్తృతమైన హార్డ్‌వేర్ పరిశోధనలకు, ధ్రువీకరణ పరీక్షలకు ఉపయోగపడతాయి. ఈ సెంటర్లలో పరిశోధకులు, విద్యార్థులు, స్టార్ట ప్స్, క్వాంటమ్‌పై పనిచేసే కంపెనీలు వివిధ రకాల పరీక్షల ద్వారా పని తీరు నిర్ధారించుకోవచ్చు. వీటికి టీఐఎ్‌ఫఆర్, ఐఐఎ్‌ససీ, డీఆర్‌డీవో సాంకేతిక సహకారం అందించాయి. దేశంలోనే తొలిసారి ఏర్పాటవుతు న్న టెస్ట్‌బెడ్స్ ప్రారంభకార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, స్టార్ట్‌పల ఫౌండర్లు తదితరులు హాజరుకానున్నారు.
హీలియంతో కూలింగ్..
అమరావతిలో ఏర్పాటయ్యే రెండు క్వాంటమ్ టెస్ట్‌బెడ్‌లు ఓపెన్ యాక్సెస్ టెక్నాలజీగా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ ఓపెన్ యాక్సిస్ వల్ల ప్రధానంగా టెక్ విద్యార్థులు హార్డ్‌వేర్ పరికరాలపైనా, పనితీరుపైనా అవగాహన పెంచుకునేందుకూ, నైపుణ్యాన్ని సాధించేందుకూ వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్వాంటమ్ కంప్యూటర్లలోని చిప్స్‌ను మైనస్ 263 నుంచి 273 సెంటీగ్రేడ్ మధ్య ఉంచుతారు. దాని కోసం కూలింగ్ కంప్రెషర్లు ఉంటాయి. ఈ కంప్రెషర్లను అల్యూమినియం, రాగి సిలెండర్లలో నిక్షిప్తం చేస్తారు. కంప్రెషర్లను అత్యంత ఖరీదైన హీలియం-3, హీలియం-4 గ్యాస్‌లతో నింపుతారు. దీంతో సిలెండర్లలో మైనస్ 273 డిగ్రీల సెంటిగ్రేడ్ వాతావరణం ఉంటుంది. ఇంత ఎక్కువగా కూలింగ్ చేయడం వల్ల క్వాంటమ్ కంప్యూటర్ వద్ద విపరీతమైన వేడి ఉంటుంది. కూలింగ్ కోసం వాడే హీలియం గ్యాస్ బహిరంగ మార్కెట్లో లీటరు రూ. ఐదు లక్షల దాకా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
సమస్యలకు చిటికెలో పరిష్కారం
సంక్లిష్ట సమస్యలకు వేగవంతమైన పరిష్కారం క్వాంటమ్ టెక్నాలజీతో సాధ్యం. క్లాసిక్ (సంప్రదాయ) కంప్యూటర్ల కంటే క్వాంటమ్ కంప్యూటర్ల విశ్లేషణ సామర్థ్యం చాలా ఎక్కువ. ఒక రోగి శరీరంలోని లక్షల రకాల జన్యుపరమైన సమాచారాన్ని (డీఎన్‌ఏ డేటా), లక్షణాలను విశ్లేషించి వ్యాధిని చాలా వేగంగా గుర్తించే అవకాశం క్వాంటమ్‌తో ఉంటుంది. మెడికల్ రంగంలో క్వాంటమ్ టెక్నాలజీ వినియోగం ఇంకా పరీక్షల దశలోనే ఉంది. క్వాంటమ్ కంప్యూటర్ రాకతో ఔషధ తయారీ రంగానికి పెద్ద ఊతమొస్తుందని, ఫిన్ టెక్, సప్లయ్ చెయిన్, ఇతర కాలిక్యులేషన్లలోనూ క్వాంటమ్ టెక్నాలజీ వేగవంతమైన సమాధానాలను ఇస్తుందని సీనియర్ శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్ చెప్పారు. సరికొత్త సాగు విధానాలను, పద్ధతులను రైతులకు వివరించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా అమరావతి క్వాంటమ్ సెంటర్ ఎదిగేందుకు వన్-ఎ్‌స, వన్-క్యూ టెస్ట్‌బెడ్స్ మార్గదర్శకంగా నిలుస్తాయని చెబుతున్నారు.