Share News

సెక్యూరిటీ గార్డే తగలబెట్టాడు!

ABN , Publish Date - Mar 27 , 2026 | 05:33 AM

రాజధాని అమరావతిలో పైపుల దహనం కేసులో పోలీసుల అనుమానమే నిజమైంది. పైపుల స్టాక్‌ పాయింట్‌ సెక్యూరిటీ గార్డే నిందితుడిగా తేలింది.

సెక్యూరిటీ గార్డే తగలబెట్టాడు!

  • రాజధాని పైపుల దహనం కేసు దర్యాప్తులో పురోగతి

గుంటూరు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో పైపుల దహనం కేసులో పోలీసుల అనుమానమే నిజమైంది. పైపుల స్టాక్‌ పాయింట్‌ సెక్యూరిటీ గార్డే నిందితుడిగా తేలింది. ఈనెల 23న రాత్రి మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ పైపుల స్టాక్‌ పాయింట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. సుమారు రూ.10 కోట్ల విలువైన పైపులను అక్కడ ఉంచగా, అందులో సగం పైపులు దగ్ధమయ్యాయని ఆ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈనెల 11న ఎల్‌ అండ్‌ టీ కంపెనీలోనూ ఇదే తరహా అగ్ని ప్రమాదం సంభవించి సుమారు రూ.9 కోట్ల విలువైన పైపులు దగ్ధమయ్యాయి. రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న పైపుల దగ్ధం కేసులపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వరుస ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, కుట్ర కోణం ఉంటే చేధించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మూడు రోజులుగా అక్కడే మకాం వేసి దర్యాప్తును పర్యవేక్షించారు. లోతుగా విచారణ చేయించారు. అందరి వేళ్లు సెక్యూరిటీ గార్డు రాము వైపే చూపిస్తుండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా రాము అసలు విషయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. డ్యూటీ విషయంలో సూపర్‌వైజర్‌ ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నాడని రాము కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. తనతో ఓవర్‌ టైం పనిచేపిస్తున్నాడని కోపం పెంచుకున్నాడు. కనీసం సెలవు ఇవ్వడం లేదని, 12 గంటలు చేయాల్సి ఉంటే రోజంతా పనిచేయిస్తున్నాడని పోలీసుల వద్ద రాము ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి రాము ఈనెల 23న సాయంత్రం 6 గంటలకు విధులు ముగించుకొని వెళ్లి పోవాల్సి ఉంది. అంతేగాక ఆరోజు ఆయనకు నీళ్ల విరేచనాలు అవుతుండటంతో డ్యూటీ టైం అయిపోగానే వెళ్లిపోవాలని భావించాడు. అయితే, సూపర్‌వైజర్‌ అందుకు భిన్నంగా ‘రాత్రికి కూడా నీవే విధుల్లో ఉండాలి’ అంటూ హుకుం జారీ చేయడంతో రాము తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఏదైనా పెద్ద ఘటన జరిగితేగానీ ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకోరని, ఆ ఘటన వల్లనైనా సూపర్‌వైజర్‌పై కంపెనీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని రాము భావించాడు. ఆ మేరకు ఆరోజు రాత్రి సమీపంలోని వాహనాల నుంచి పెట్రోల్‌ తీసి పైపులకు నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. రాము చెబుతున్నది నిజమేనా? లేదంటే ఇంకా మరే కారణాలైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు. రాముకు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ మరింత లోతుగా విచారిస్తున్నారు.

Updated Date - Mar 27 , 2026 | 05:33 AM