ప్రమాదం కాదు.. కుట్రే!
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:38 AM
రాజధాని అమరావతి నిర్మాణ పనులను చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీలో ప్లాస్టిక్ పైపులు దగ్ధం ఘటన వెనుక కుట్రకోణం ఉన్నట్లు పోలీసు వర్గాలు అంచనాకు వచ్చాయి.
అమరావతిలో అగ్గి ఘటనపై బలపడుతున్న అనుమానాలు
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు
గుంటూరు/తుళ్లూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణ పనులను చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్ కంపెనీలో ప్లాస్టిక్ పైపులు దగ్ధం ఘటన వెనుక కుట్రకోణం ఉన్నట్లు పోలీసు వర్గాలు అంచనాకు వచ్చాయి. తొలుత అగ్ని ప్రమాదంగా భావించినప్పటికీ ఘటనాస్థలాన్ని పరిశీలించిన నిపుణులు.. దీనిని ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటనగానే తేల్చారు. సాధారణంగా బీడీ, సిగరెట్ కాల్చి పడేసినా, లేదంటే షార్ట్ సర్క్యూట్ లాంటిది జరిగినా అక్కడి పైపులు దగ్ధమయ్యే పరిస్థితి ఉండదని వారు తేల్చారు. ప్రమాదంలో దగ్ధమైన పైపులు కనీసం 130 నుంచి 150 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటేనే కాలిపోతాయని పేర్కొంటున్నారు. దీనిని బట్టి ఎవరైనా పెట్రోల్ లాంటిది పోసి నిప్పంటించి ఉంటారనే అంచనాకు వచ్చారు. అది అగ్ని ప్రమాదం కాదని దీని వెనుక కుట్ర జరిగి ఉంటుందని నిర్థారణకు వచ్చినట్టు తెలిసింది. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. పైపులు దగ్ధమైన ప్రదేశంలో విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్డును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, విచారణలో సెక్యూరిటీ గార్డ్ పొంతన లేని సమాధానాలు చెప్పారని సమాచారం. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని సెక్యూరిటీ గార్డు చెబుతుండటంపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో తాను మోటార్ స్విచ్ ఆపడానికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఓ పాయింట్‌లో మంటలు కనిపించడంతో వెంటనే సూపర్‌వైజర్‌కు ఫోన్ చేసి చెప్పానని,, దీంతో, అగ్ని ప్రమాదం నియంత్రణ పరికరాలను ఉపయోగించాలని సూపర్‌వైజర్ సలహా ఇచ్చినట్లు విచారణలో వెల్లడించాడు. కాగా, భారీ అగ్నిప్రమాదం వెనుక కుట్రను ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా సాంకేతిక ఆధారాల ద్వారా కేసు తేల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటన జరిగిన
ప్రదేశంలో గానీ, సమీప ప్రాంతాల్లో గానీ సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులు పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి సారించారు. ప్రమాదం జరగడానికి ముం దు, ప్రమాద సమయం లో స్థానిక సెల్ టవర్ నుంచి కాల్ డేటా డంపును ేసకరించారు. కాల్‌డేటా ఆధారం గా అనుమానిత ఫోన్ నెంబర్లను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ేసకరించిన అనేక అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. పైపులు దహనం కావడాని కి పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాన్ని ఉపయోగించారా? అనే కోణంలోనూ విశ్లేషిస్తున్నారు. ఈ నెల 11న ఎల్‌అండ్‌టీ కంపెనీకి చెందిన పైపులు దగ్ధమైన నేపథ్యంలో ఆ ఘటనకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు ేసకరిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో చోటు చేసుకుంటున్న ఈ ఘటనల వెనుక రాజధాని వ్యతిరేక శక్తుల ప్రమే యం ఉందా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో 2014-15 మధ్య కొందరు అరటి తోటలను దగ్ధం చేశారు. ఆ కుట్ర వెనుక వైసీపీ వారు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలన్నింటినీ నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అన్ని కోణాల్లోనూ..
రాజధానిలో పనులు చేస్తున్న కార్మికులపై కూడా పోలీసులకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లు సకాలంలో జీతాలు ఇవ్వకపోతుండటంతో వారు సంస్థపై కొంత వ్యతిరేకభావనతో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కాంట్రాక్టర్లపై కోపంతో కార్మికులు ఎవరై నా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల వద్ద సీసీ కెమెరా ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఎవరైనా క్యాను,్ల బాటిల్స్‌లో పెట్రోల్ కొనుగోలు చేసి తీసుకొచ్చారా అనే వివరాలను సేకరిస్తున్నారు.
అగ్ని ప్రమాదాలపై ‘సిట్’
అమరావతిలో ఈ నెల 11న ఎల్ అండ్ టీ, 23న మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించిన పైపుల దగ్ధం జరిగి రూ.కోట్ల ఆస్తి నష్టం సంభవించటంపై ప్రభుత్వం సీరియ్‌సగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా ఘటనలపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఏటీ రవికుమార్ ఆధ్వర్యంలో ఈ బృందం రంగంలోకి దిగింది. బృందంలో నలుగురు ఎస్సైలు, నలుగురు సీఐలు, స్థానిక తుళ్లూరు స్టేషన్ సీఐ, డీఎస్పీ ఉన్నారు.