Share News

అమరావతికి ‘చట్టబద్ధత’

ABN , Publish Date - Mar 29 , 2026 | 04:46 AM

ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే ప్రక్రియలో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ...

అమరావతికి ‘చట్టబద్ధత’

  • అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం.. ఐదున్నర గంటలు చర్చ

  • సీఎం, డిప్యూటీ సీఎం సహా 23 మంది ప్రసంగాలు

  • తీర్మానం ప్రతిని దూత తో ఢిల్లీకి పంపిన ప్రభుత్వం

  • ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ‘సవరణ’ బిల్లు

  • ఉభయ సభల ఆమోదంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించే ప్రక్రియలో కీలక ఘట్టం విజయవంతంగా ముగిసింది. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇందుకోసమే శనివారం అత్యవసరంగా నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై 5.35 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పలువురు మంత్రులు సహా టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన 23 మంది ప్రసంగించారు. అనంతరం తీర్మానాన్ని ఏకగీవ్రంగా ఆమోదించారు. ఏపీ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్‌ 5(2)లో ఏపీ కొత్త రాజధాని అని ఉన్న చోట అమరావతి అనే పదాన్ని చేర్చాలని అందులో పొందుపరిచారు. అనంతరం తీర్మానం ప్రతిని సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారికి ఇచ్చి ప్రత్యేక దూతగా ఢిల్లీకి పంపించారు. తీర్మానం ప్రతులను కేంద్ర హోం శాఖకు, లోక్‌సభ, రాజ్యసభ స్పీకర్‌ కార్యాలయాలకూ పంపిస్తున్నారు.


ఇక కేంద్రానిదే బాధ్యత

అసెంబ్లీ తీర్మానం నేపఽథ్యంలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ పునర్విభజన చట్టానికి కేంద్రం సవరణ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి చట్టంలోని సెక్షన్‌ 5(2)లో ఏపీ కొత్త రాజధాని అని ఉన్న చోట అమరావతి అనే పదాన్ని పొందుపరుస్తూ చట్టసవరణ బిల్లును ఇప్పటికే రూపొందించింది. గత వారమే కేంద్ర క్యాబినెట్‌ దీనిని ఆమోదించాల్సి ఉంది. అయితే అసెంబ్లీ తీర్మానం ఉంటే భవిష్యత్‌లో సమస్యలు ఉండవని కేంద్ర న్యాయ శాఖ చెప్పడంతో చివరి నిమిషంలో పక్కనపెట్టారు. పీఎంవో సూచనలతో రాష్ట్రప్రభుత్వం అత్యవసరంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటుచేసి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి పంపింంది. ఏప్రిల్‌ 1న జరిగే కేంద్ర మంత్రిమండలి సమావేశంలో చట్టసవరణ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపే వీలుంది. అనంతరం ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును కేంద్రం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది. అవి ఆమోదించగానే అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత సిద్ధిస్తుంది.


ఏపీకే ఎందుకంటే..!

నిజానికి రాష్ట్రానికి రాజధానిగా ఏ నగరం ఉండాలో కేంద్రం నిర్ణయించదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలోనూ తామెందుకు జోక్యం చేసుకోవాలని తొలుత కేంద్రం నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘రాజధానిగా అమరావతినే ప్రకటించే అధికారం మాకెక్కడిది? మాపై ఎందుకు ఒత్తిడి తెస్తారు? ఈ విషయంలో మాకు రాజ్యాంగ హక్కులు, చట్టబద్ధమైన అధికారాలేమీ లేవు’ అని ఢిల్లీ పెద్దలు, అధికారులు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఆ పేరుతో వాయిదాలు వేస్తూ వచ్చారు. అయితే పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 5(2)లో ఒక అంశం ఉంది. ఏపీ, తెలంగాణలకు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదే ఉంటుందని అందులో పేర్కొన్నారు. పదేళ్ల గడువు ముగిశాక.. హైదరాబాద్‌ తెలంగాణకు శాశ్వత రాజధానిగా ఉంటుందని స్పష్టంగా పొందుపరిచారు. తెలంగాణకు ఏది శాశ్వత రాజధానో చెప్పిన కేంద్రం.. ఏపీ విషయంలో మాత్రం మౌనం పాటించింది. తమ రాజధాని ఏదో చట్టప్రకారం కేంద్రమే ప్రకటించాలని.. అమరావతి కొత్త రాజధాని అని పేర్కొంటూ చట్టాన్ని సవరించాలని రాష్ట్రప్రభుత్వం కోరుతోంది. చట్టంలో కేం ద్రానికున్న ప్రత్యేకఅధికారాలను గుర్తుచేసింది. చివరకు కేంద్రం ఆ అంశాలను గుర్తించింది. చట్టసవరణకు బలం చేకూరేందుకు ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాలని కోరింది.

పార్లమెంటు ఆమోదం తర్వాత వేడుకలు: సీఎం

చట్టసవరణ బిల్లుకు పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదం లభించే వీలుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పార్లమెంటు ఆమోదముద్ర పొందిన తర్వాత రాష్ట్రమంతటా వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు.

Updated Date - Mar 29 , 2026 | 04:49 AM