Share News

అమరావతికి ఆమోదం

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:39 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది.

అమరావతికి  ఆమోదం

  • ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా చట్టబద్ధ రక్షణ ప్రక్రియ సంపూర్ణం

  • రాష్ట్రపతి ముర్ము ఆమోద ముద్ర.. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు-2026 సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు చేరింది. సాయంత్రానికే దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాత్రి 10 గంటలకల్లా ‘గెజిట్‌ నోటిఫికేషన్‌’ కూడా వెలువడింది. దీంతో ‘అమరావతి’కి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి రాజీవ్‌ మణి ఈ గెజిట్‌ను విడుదల చేశారు. 2014నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలో... ‘పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి ఒక కొత్త రాజధాని ఉంటుంది’ అని పేర్కొనగా... సవరణ చట్టంలో ‘ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలాగే... సీఆర్డీయే చట్టం-2014 కింద నోటిఫై చేసిన ప్రాంతమంతా ‘అమరావతి’ పరిధిలోకి వస్తుందని మరో సవరణ చేశారు. వెరసి... 2024 జూన్‌ 2వ తేదీ నుంచే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి అమలులోకి వచ్చినట్లయింది. రాజధాని అమరావతిపై చట్టబద్ధమైన స్పష్టత ఇప్పిస్తూ, రక్షణ కల్పించాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. దీనిపై కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఈ ప్రక్రియ మరింత పకడ్బందీగా జరిగేలా... అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కేంద్రం సూచించింది. దీంతో... మార్చి 28న రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. 2024 జూన్‌ 2 నుంచే అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించేలా చట్ట సవరణ చేయాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ మేరకు 2014 చట్టంలోని సెక్షన్‌ 5లోని సంబంధిత సబ్‌ సెక్షన్లలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఈ తీర్మానాన్ని అప్పటికప్పుడు ప్రత్యేక దూత ద్వారా ఢిల్లీకి పంపించారు. ఆ వెంటనే కేంద్రమూ కదిలింది. లోక్‌సభలో ఈనెల 1, రాజ్యసభలో 2వ తేదీన చట్ట సవరణ బిల్లుపై ఆమోద ముద్ర పడింది. దాదాపు 4.30 గంటలపాటు ఉభయసభలలో సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఇది సోమవారం రాష్ట్రపతి భవన్‌ చేరడం... రాత్రికే గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ కావడం విశేషం.

Updated Date - Apr 07 , 2026 | 05:39 AM