Share News

జయహో అమరావతి!

ABN , Publish Date - Apr 03 , 2026 | 06:26 AM

రాష్ట్ర చరిత్రలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చింది.

జయహో అమరావతి!

  • 2014లో రాజధానిగా ప్రకటించిన నాటినుంచి నేటి వరకూ ఎన్నెన్నో మలుపులు, పోరాటాలు

  • గత టీడీపీ హయాంలో జోరుగా నిర్మాణాలు.. కలల రాజధానిని చిదిమేసిన వైసీపీ సర్కారు

  • 1,631 రోజుల పాటు మహిళలు, రైతుల ఉద్యమం.. కూటమి ప్రభుత్వంలో మళ్లీ జోరుగా పనులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర చరిత్రలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నెరవేర్చింది. మాజీ సీఎం జగన్‌ మొదలుపెట్టిన మూడు ముక్కలాటకు చెక్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించిన నాటి నుంచి నేటివరకూ చోటుచేసుకున్న ఆసక్తికర పరిణామాల సింహావలోకనమే ఈ కథనం!

ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంతో చరిత్ర

దేశంలోనే మొట్టమొదటసారిగా అమరావతిలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంను ప్రారంభించిన చంద్రబాబు ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. అమరావతిని 53,748 ఎకరాల్లో నిర్మించాలని భావించారు. భూసేకరణకు బదులు భూసమీకరణ ప్రక్రియకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సిద్ధమైంది. రైతులిచ్చిన భూమిని అభివృద్ధి చేసి తిరిగి వారికి ఒప్పందం ప్రకారం ప్లాట్‌లు రిజిస్టర్‌ చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ఎల్‌పీఎస్‌ దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీలకు ఓ మోడల్‌గా నిలిచింది. పట్టా భూములిచ్చిన రైతులకు తిరిగి రెసిడెన్షియల్‌ ప్లాట్‌ 1,000 గజాలు, కమర్షియల్‌ ప్లాట్‌ 250 గజాలు, జరీబు భూములైతే నివాస స్థలం వెయ్యి గజాలు, కమర్షియల్‌ ప్లాట్‌ 450 గజాలు చొప్పున పంపిణీ చేశారు. అసైన్డ్‌ భూములు ఇచ్చిన రైతులకు కూడా స్థలాలు కేటాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పలు రాయితీలు కల్పించింది. రైతులకు రిజిస్ట్రేషన్‌ ఫీజులో మినహాయింపు ఇచ్చారు. భూమి లేని పేదలకు పదేళ్ల పాటు రూ.2,500 చొప్పున పెన్షన్లను అందించారు. భూములిచ్చిన రైతులకు యాన్యుటీ రూ.30వేలు, రూ.50వేలు చొప్పున చెల్లించారు. ఒకే దఫా రూ.1.50 లక్షల రుణాలను మాఫీ చేశారు. ఉపాధి వేతనాలను 365 రోజులకు పెంచారు. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించారు. రైతులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు జీవనోపాధుల కల్పన, పలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టారు.


ఆర్థిక రాజధానిగా అమరావతి

అమరావతి కేవలం అధికార కేంద్రమే కాకుండా ఆర్థిక రాజధానిగా విలసిల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ ప్రారంభించే ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పన జరగాలి. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో పాటు ఉద్యోగాల కల్పన, గ్రీన్‌ అండ్‌ క్లీన్‌ సిటీగా, నాణ్యమైన నివాసాలు, వనరుల నిర్వహణను ప్రభావితం చేయడం, సాంస్కృతిక, వారసత్వ సంపదను కాపాడుకునేలా రాజధాని ప్రాంతాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2025 కల్లా 292.80 కి.మీ. మేజర్‌ రోడ్ల నెట్‌వర్క్‌ కలిగి ఉండాలని, 35 లక్షల జనాభాతో నివాసాలు, 15 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలని భావించారు. పార్కులు, వసతులు, వాకింగ్‌ ట్రాక్‌లు, వరద నివారణ చర్యలు, టూరిజం, మెట్రో, వాటర్‌వేస్‌తో పాటు నగరంలో ఎక్కడైనా సైకిళ్లపై తిరిగే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించారు.

కలల రాజధానికి బీజం పడిందిలా...

2014లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం.. దేవతల రాజధాని అమరావతి పేరుతో రాష్ట్రానికి నూతన రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 2014 అక్టోబరు 4న తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించింది. సింగపూర్‌ ప్రభుత్వ సహకారంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతిష్ఠాత్మకంగా రాజధాని నగరం నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. దేశాన్ని తలదన్నే రాజధాని కోసం 34,400 ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ అనే వినూత్న పథకం కింద అప్పగించేందుకు 29,966 మంది అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. తుళ్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 29 గ్రామాల ప్రజలతో వందల సమావేశాలు, సదస్సులు, చర్చల అనంతరం 2017 జనవరి 1 నుంచి ల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియను ప్రారంభించి ఆగస్టు 16 నాటికి పూర్తి చేశారు.


సీఆర్‌డీఏ ఆవిర్భావం

అమరావతి నిర్మాణానికి ముందుగా ఏపీ సీఆర్‌డీఏ ఆవిర్భవించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ, ఆర్థిక సహకారంతో పాటు సీఆర్‌డీఏ ప్రణాళికలను రక్షించే ఉద్దేశంతో క్యాపిటల్‌ రీజియన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ, 2014 చట్టం తీసుకొచ్చి, ఏపీ కేపిటల్‌ సిటీ ఎల్‌పీఎ్‌స(ఎఫ్‌ అండ్‌ ఐ) రూల్స్‌, 2015 రూపొందించారు. రాష్ట్ర రాజధాని ప్రాంతంగా 8,603.32 చ.కి.మీ. పరిధిని గుర్తించారు. ఈ ప్రాంతంలో 953 గ్రామాలు, 12 పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. గుంటూరు జిల్లాలోని 26 మండలాలు, కృష్ణా జిల్లాలోని 30 మండలాలను సీఆర్‌డీఏ పరిధిలో చేర్చారు. 217.23 చ.కి.మీ.ల్లో రాజధాని అమరావతిని నోటిఫై చేశారు.

ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

2017 అక్టోబరు 22న విజయదశమి నాడు రాజధాని అమరావతికి ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన ప్రదేశంలో 16వేల గ్రామాల నుంచి పవిత్రమైన నీరు, మట్టి తీసుకొచ్చి నిక్షిప్తం చేశారు. అనంతరం మౌలిక వసతుల కల్పనకు రూ.27,097 కోట్లకు టెండర్లు పిలిచారు. భవన నిర్మాణాల కోసం రూ.10,519 కోట్లు కేటాయించారు. 2014-19 మధ్యకాలంలో రూ.41వేల కోట్లకు టెండర్లు పిలవగా రూ.5వేల కోట్ల పనులు పూర్తి చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల నివాసాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాలు అప్పటి టీడీపీ ప్రభుత్వం 95శాతం పూర్తి చేసింది.


హైకోర్టు తీర్పుతో బ్రేకులు

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించి, అభివృద్ధి చేయాలని 2022 మార్చి 2న హైకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం విభజిత రాష్ట్రానికి శాపమని తొలుత భావించారు. కానీ ఆ చట్టంలో ఉన్న ఒక్క పదం అమరావతిని కాపాడింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం- 2014లోని క్లాజ్‌ 11లో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానికి హైదరాబాద్‌, తెలంగాణలోని ప్రధాన నగరాల నుంచి రైలు, రోడ్డు మార్గాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ అక్కడ ‘ది న్యూ క్యాపిటల్‌’ అన్న పదం వాడారు. ఇంగ్లిషులో నామవాచకానికి ముందు ‘ది’ వాడితే అది ఏకవచనంగా భావించాల్సి ఉంటుందని హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సతో పాటు ముగ్గురు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ది న్యూ క్యాపిటల్‌ అంటే ఒకే ఒక కొత్త రాజధాని అని అర్థంమని చెబుతూ, మూడు రాజధానులకు తెరదించారు.

కమిటీలు... నివేదికలు

మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత 2019 సెప్టెంబరు 13న జీఎన్‌ రావు కమిటీని అధ్యయనం కోసం వేస్తున్నట్లు జగన్‌ ప్రకటించారు. ఈ కమిటీ డిసెంబరు 20న ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అదే నెల 29న హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. 2020 జనవరి 3న బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక సమర్పించింది. జనవరి 19న అందిన హైపవర్‌ కమిటీ నివేదికను 20న అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించారు. జూలై 16న బిల్లును అసెంబ్లీలో తిరిగి ప్రవేశపెట్టి ఆమోదించారు. జూలై 17న బిల్లులను కౌన్సిల్‌కు, 18న గవర్నర్‌కు పంపారు. జూలై 31న గవర్నర్‌ సంతకం చేశారు.


కూటమితో పునరుత్తేజం

2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతిని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిర్మాణం కోసం నిధులు సమకూర్చింది. భూములు పొందిన కేంద్ర సంస్థలు మళ్లీ పనులు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర సహకారంతో అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోడ్లు, నీటిసరఫరా, డ్రైనేజీ, విద్యుత్‌, రైతుల ప్లాట్‌లు, ప్రభుత్వ భవనాలు, పట్టణాభివృద్ధికి రూ.49వేల కోట్లు కేటాయించారు. తుళ్లూరు, అమరావతి మండలాల్లో ఏడు గ్రామాల్లో రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా 22 వేల ఎకరాలు సమీకరించనుంది.

ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

2017 అక్టోబరు 22న విజయదశమి నాడు రాజధాని అమరావతికి ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన ప్రదేశంలో 16వేల గ్రామాల నుంచి పవిత్రమైన నీరు, మట్టి తీసుకొచ్చి నిక్షిప్తం చేశారు. అనంతరం మౌలిక వసతుల కల్పనకు రూ.27,097 కోట్లకు టెండర్లు పిలిచారు. భవన నిర్మాణాల కోసం రూ.10,519 కోట్లు కేటాయించారు. 2014-19 మధ్యకాలంలో రూ.41వేల కోట్లకు టెండర్లు పిలవగా రూ.5వేల కోట్ల పనులు పూర్తి చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల నివాసాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాలు అప్పటి టీడీపీ ప్రభుత్వం 95శాతం పూర్తి చేసింది.


జగన్‌ రాకతో సీన్‌ రివర్స్‌

2019 ఎన్నికల్లో జగన్‌ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిపై ప్లేట్‌ ఫిరాయించింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో జగన్‌ ప్రకటించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళన బాట పట్టారు. 2020 జనవరి 5న తుళ్లూరు నుంచి మందడం వరకు వేలాది మంది పాదయాత్ర చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్‌ చేస్తూ నిరవధిక ఉద్యమం ప్రారంభించారు. ఇదే డిమాండ్‌తో 2020 జనవరి 10న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పొంగళ్లు తీసుకుని వెళ్తున్న రైతు మహిళలపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. అదేనెల 20న వేలాది మంది మహిళా రైతులు అసెంబ్లీని ముట్టడించారు. మహిళలు, రైతులు, రైతు కూలీలు 2022 నవంబరు 11 నుంచి 21 వరకు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ పేరుతో తిరుమల వరకు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత చేపట్టిన ‘అమరావతి నుంచి అరసవల్లి వరకు’ రెండో విడత పాదయాత్రను రామచంద్రాపురం వద్ద పోలీసులు అడ్డగించారు. అమరావతి ఉద్యమం 2024 జూన్‌ 5 వరకు సుదీర్ఘంగా 1,631 రోజుల పాటు కొనసాగి చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.


అమరావతిపై అక్కసు

అమరావతి విధ్వంసానికి జగన్‌ సర్కారు అనేక కుట్రలకు పాల్పడింది. 2019 జూన్‌లో ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసకాండకు జగన్‌ తెర తీశారు. సీఆర్‌డీఏ పరిధిని వైసీపీ సర్కారు 6,993.24 చ.కి.మీ.కు తగ్గించింది. సీఆర్‌డీఏను 45 మండలాలు, 799 గ్రామాలు, 12 పట్టణ స్థానిక సంస్థలకు పరిమితం చేసింది. రాజధాని ప్రాంతంలో భూసేకరణ చేసేందుకు ఇచ్చిన నోటీసులను గుంటూరు కలెక్టర్‌ నుంచి వెనక్కి తీసుకోవాలని సీఆర్‌డీఏను ఆదేశించింది. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు తాళం పడింది. ఏపీ సీఆర్‌డీఏ ప్రారంభించిన నాలుగు క్యాంటీన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను మూసేశారు. భూమి లేని పేద రైతులకు ఇచ్చే పెన్షన్లకు కూడా చెక్‌ పెట్టారు. కేవలం రూ.3వేల కోట్ల సివిల్‌ పనులు కొనసాగించాలని, మిగిలిన రూ.35,583 కోట్ల పనులను నిలిపేయాలని ఆదేశించారు. వైసీపీ నేతలు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసి నిధులు రాకుండా నిలిపేశారు. భూ కేటాయింపులు పొందిన 130 సంస్థల్లో 122 సంస్థలు నిర్మాణాలను నిలిపేశాయి.

Updated Date - Apr 03 , 2026 | 06:36 AM