’అమరావతి.. అనితర సాధ్యం
ABN , Publish Date - Aug 14 , 2026 | 04:28 AM
రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని భారతదేశంలోనే నగర ప్రణాళిక విభాగంలో చేపట్టిన అతిపెద్ద ప్రయోగంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక అభివర్ణించింది.
భారత్‌లోనే ఇది అతిపెద్ద ప్రయోగం
నగర ప్రణాళిక విభాగంలో ముందడుగు
భావి తరాల కోసం సీఎం చంద్రబాబు కృషి
అత్యుత్తమ జీవన ప్రమాణాలుండేలా నిర్మాణం
2029 నాటికి పూర్తే ఆయన లక్ష్యం
క్వాంటం వ్యాలీతో సాంకేతిక గుర్తింపు
న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ప్రత్యేక కథనం
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నగర నిర్మాణాన్ని భారతదేశంలోనే నగర ప్రణాళిక విభాగంలో చేపట్టిన అతిపెద్ద ప్రయోగంగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక అభివర్ణించింది. ‘భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించడానికి ఓ వ్యక్తి చేస్తున్న ప్రయత్నం’ శీర్షికన ప్రచురించిన కథనంలో ఆంధ్రుల రాజధాని ప్రస్థానాన్ని సుదీర్ఘంగా వివరించింది. భారతదేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రాజధాని నగర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని పేర్కొంది. అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రతినిధులు అమరావతి నగర నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ కథనాన్ని రాశారు. ఈ కథనంలో ఏముందంటే..
ప్రధాన ఆకర్షణగా అసెంబ్లీ భవనం
ప్రసిద్ధ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ రూపకల్పన చేసిన డిజైన్ ప్రకారం ఈ నగరాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 25 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. గ్రిడ్ తరహాలో రూపుదిద్దుకుంటున్న ఈ నగరంలో సుమారు 8 కిమీ విస్తీర్ణంతో ప్రభుత్వ భవనాల సముదాయం ఉంటుంది. మంచినీటి సరస్సు మధ్యలో ఎత్తైన శిఖరంతో కూడిన అసెంబ్లీ భవనం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సచివాలయ, పరిపాలనా కార్యాలయాలు ఐదు ఎత్తైన టవర్లలో ఉంటాయి. ఇవి 16 వేల మంది ఉద్యోగులు పనిచేసుకునే విధంగా ఉంటాయి. అన్నింటికంటే ఎత్తైన టవర్‌లో సీఎం కార్యాలయం ఉంటుంది. దాని పైకప్పున హెలిప్యాడ్ నిర్మిస్తారు. నగరంలో 60ు ప్రాంతాన్ని నీరు లేదా పచ్చదనంతో నింపాలని ప్రణాళిక రచించారు. ఇందులో సుమారు 3 వేల కిలోమీటర్ల పొడవైన సైక్లింగ్ ట్రాక్‌లు ఉంటాయి.
క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు
హైదరాబాద్‌లో ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు అమరావతికి కూడా సాంకేతిక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నారు. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్‌కు మారుపేరుగా మార్చడంతో పాటు విద్యా సంస్థలను ఏర్పాటు చేసి క్వాంటం నిపుణులను తయారు చేయాలన్నది ఆయన ఆలోచన. నగరంలో 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటం వ్యాలీ క్యాంపస్ నిర్మాణం జరుగుతోంది. 156 క్యూబిట్ ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. 2029 చివరి నాటికి 88 వేలమంది ఇంజనీర్లకు వసతి కల్పించే 8 టవర్లను నిర్మించాలన్న లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ‘ప్రపంచాన్ని అనుసరించడం కంటే మార్గదర్శనం చేయడం అరుదైన అవకాశం. క్వాంటం రూపంలో ఆ అవకాశం లభించింది. రేపటి గురించి ఆలోచించడం అందరూ చేసేదే. నేను రాబోయే 20 ఏళ్ల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నాను’ అని సీఎం వివరించారు.
సవాళ్లను అధిగమించి..
ఒక మహానగర నిర్మాణానికి అడ్డంకులు సహజం. పశ్చిమాసియాలో యుద్ధంతో ఇంధన ధరలు పెరగడం, స్వరాష్ట్రాల్లో ఓటు వేయడానికి అమరావతిలో పని చేసే ఇతర రాష్ట్రాల కార్మికులు వెళ్లడం వంటి అడ్డంకులన్నింటినీ అధిగమిస్తూ ఇక్కడ పనులు ముందుకు సాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో ఆయన కలల అమరావతి స్తంభించింది. అన్ని ఆటుపోట్లను ఎదుర్కొని తిరిగి అధికారంలోకి వచ్చిన ఆయన.. మళ్లీ అమరావతి యజ్ఞంలో నిమగ్నమయ్యారు. అమరావతి విషయంలో ఆయన జపిస్తున్న మంత్రం ఒక్కటే అదే.. వేగం, వేగం, వేగం.
ఇదో బృహత్తర కార్యం
సుమారు 5 కోట్ల జనాభా కలిగిన దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి అనే నూతన రాజధానిని నిర్మించే బృహత్తరమైన కార్యాన్ని సీఎం చంద్రబాబు చేపట్టారు. భారతదేశంలో ఏ పెద్ద నగరాన్ని చూసినా అరకొర మౌలిక వసతులు, విపరీతంగా పెరుగుతున్న కాలుష్యంతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడంలో విఫలమవుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి చంద్రబాబు నడుం బిగించారు. ఆయనకు భారీ స్థాయి ప్రాజెక్టులను చేపట్టి విజయవంతం చేసిన చరిత్ర ఉంది. తన అనుభవంతో అమరావతిని భావితరాలు అత్యుత్తమ జీవన ప్రమాణాలతో నివసించగల నగరంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారు. 2029లో ఎన్నికలకు వెళ్లే నాటికి అమరావతిని ఎవరూ వెనక్కి తీసుకెళ్లలేని విధంగా తీర్చిదిద్దాలని పట్టుదలతో ఉన్నారు.
అమరావతే ఎందుకు..?
రాజధానిని ఒకే చోట కేంద్రీకరించవద్దని, వికేంద్రీకరణ చేయాలని చాలా మంది సూచించినప్పటికీ ఆంధ్రులు గర్వించేలా రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని ఉండాలన్న కోరికతో అమరావతిని చంద్రబాబు ఎంపిక చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కట్టుబట్టలతో వచ్చేసిన ప్రజలు తలెత్తుకునేలా రాజధాని ఉండాలనే లక్ష్యంతో ఈ బృహత్తర నగరానికి శ్రీకారం చుట్టారని యువనేత లోకేశ్ అన్నారు. ‘2014లో మా నాన్న, అమ్మతో కలిసి విజయవాడ విమానాశ్రయంలో దిగినప్పుడు అక్కడ పరిస్థితి దయనీయం. అదొక రేకుల షెడ్డు తప్ప ఏమీ కాదు. ఈ పరిస్థితిని అధిగమించాలన్న పట్టుదల వచ్చింది. ఆంధ్రులు గర్వించేలా రాజధాని ఉండాలని చంద్రబాబు కృషి చేస్తున్నారు’ అని తెలిపారు.