అమరావతిలో ప్రజాప్రతినిధుల నివాసాలు సిద్ధం
ABN , Publish Date - May 20 , 2026 | 05:28 AM
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తున్నాయి. కిందటేడాది సీఆర్డీఏ భవనం అందుబాటులోకి రాగా..
వారం రోజుల్లో జీఏడీకి ఎమ్మెల్యే క్వార్టర్లు
మరో 15 రోజుల వ్యవధిలో ఎమ్మెల్సీల ఆవాసాలు కూడా అప్పగింత
రికార్డు వేగంతో మౌలిక సదుపాయాల కల్పన
వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి ఈ భవనాల్లోనే ప్రజా ప్రతినిధులు
(గుంటూరు-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలు ఒక్కొక్కటిగా నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తున్నాయి. కిందటేడాది సీఆర్డీఏ భవనం అందుబాటులోకి రాగా ఇప్పుడు ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 23 నెలల్లోనే రికార్డు వేగంతో వీటిని పూర్తి చేసి అన్ని హంగులతో ఈ అపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో వారం పది రోజుల్లో వీటిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్(జీఏడీ)కి అప్పగించనున్నారు.
పునర్నిర్మాణ పనులు ప్రారంభమైన తరువాతే
2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. శాసన సభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా భవనాలను పరిశీలించి తొమ్మిది నెలల్లో వాటిని పూర్తి చేసి తమకు అప్పగించాలని కోరారు. అయితే ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకూ వీటి పనులు అంతగా సాగలేదు. నిజానికి 2019 నాటికే ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు సంబంధించిన ఆరు అపార్ట్‌మెంట్లు 85 శాతం పనులు పూర్తి చేసుకున్నాయి. అయితే అత్యంత కీలకమైన ఇంటీరియర్, గార్డెనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులు కొంత మేర పెండింగులో ఉన్నాయి. వీటితోపాటు సీవరేజ్ ట్యాంకు నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. వీటన్నింటీనీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు.
శరవేగంగా ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణం
ఎమ్మెల్సీ క్వార్టర్స్‌కు సంబంధించిన ఆరు అపార్ట్‌మెంట్ల నిర్మాణం 2019 నాటికి సివిల్ వర్కులను కూడా పూర్తి చేసుకోలేదు. మొండి గోడలతో ఉన్న వీటిని కూటమి ప్రభుత్వం వచ్చాక 23 నెలల్లో దాదాపుగా పూర్తి చేశారు. బయట రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, వైద్య సదుపాయాలతోపాటు, ఆరోగ్య, వ్యాయామ కేంద్రం వంటి అత్యాధునిక సదుపాయాలు ఎన్నో సిద్ధం చేశారు.
సీడ్ యాక్సిస్ రోడ్డుకు పక్కనే...
ప్రజా ప్రతినిధుల కోసం నిర్మించిన ఈ భవనాలు సీడ్ యాక్సిస్ రోడ్డును అనుకుని ఉంటాయి. మొత్తం నాలుగు వరుసల్లో 12 అపార్టుమెంట్లను నిర్మించారు. ప్రతి అపార్ట్‌మెంటులో ఫ్లోరుకు 2 ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కో ఫ్లాట్ 3,500 చ.అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ఒక్కో అపార్ట్‌మెంట్‌లో 24 ఫ్లాట్ల చొప్పున మొత్తం 288 మంది ప్రజా ప్రతినిధులకు సరిపోతాయి. ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో 175 మంది, శాసన మండలిలో 60 మంది ప్రజా ప్రతినిధులు... కలిపి మొత్తం 235 మంది ఉన్నారు. ప్రతి ఫ్లాటులో మూడు బెడ్రూములు, ఆఫీస్ రూము, విజిటర్స్ లాంజ్, కిచెన్, ఓపెన్ హాలు ఉన్నాయి. ఈ భవనాలన్నింటినీ షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించారు. వీటిని గ్రీన్ ఎనర్జీ బిల్డింగులుగా మార్చేందుకు భవనాలపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నారు.