భూసమీకరణకు సై
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:22 AM
రాజధాని అమరావతికి భూములు ఇవ్వడానికి వెనకడుగు వేసిన రైతుల మనసు మారింది. భూసమీకరణకు తాము కూడా ఇప్పుడు జై కొడుతున్నారు.
అమరావతికి తొలగుతున్న అడ్డంకులు
ఎల్‌పీఎస్‌కు ముందుకు వస్తున్న మిగిలిన రైతులు
తాజాగా 4 గ్రామాల్లో 106 ఎకరాల అప్పగింత
త్వరలో మరో 130 ఎకరాలూ ఇచ్చేందుకు రెడీ
2024 తర్వాత భారీగా అప్పగింత ఇదే ప్రథమం
పెద్ద రైతులంతా ముందుకు వస్తున్న వైనం
గుంటూరు (రాజధాని), జూన్ 17 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి భూములు ఇవ్వడానికి వెనకడుగు వేసిన రైతుల మనసు మారింది. భూసమీకరణకు తాము కూడా ఇప్పుడు జై కొడుతున్నారు. వెలగపూడి గ్రామంలోని పెద్ద రైతు కారుమంచి రంగారావు కుటుంబం, బంధువులు మొత్తం 76 ఎకరాలు, రాయపూడి గ్రామానికి చెందిన గద్దె సత్యన్నారాయణ కుటుంబం 16 ఎకరాలు సీఆర్డీఏ కార్యాలయంలో బుధవారం భూసమీకరణకు ఇచ్చారు. వీరితో పాటు తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి గ్రామాలకు చెందిన రైతులు మొత్తం 106 ఎకరాల భూమిని సమీకరణకు అంగీకరిస్తూ పత్రాలు అధికారులకు అందజేశారు. వచ్చే రోజుల్లో మరింత మంది రైతులు ముందుకొచ్చే అవకాశం ఉంది. దీంతో అమరావతి నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోతున్నట్లే అని భావిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం తొలివిడత భూసమీకరణ చేపట్టిన సమయంలో మెజారిటీ రైతులు దానికి సంసిద్ధత తెలిపారు. ఫలితంగా 28,973 మంది రైతులు 34,162 ఎకరాలను సమీకరణకు ఇచ్చారు. మరో 6,381 మంది రైతులు 3,522 ఎకరాలు ఇవ్వాల్సి ఉంది. రకరకాల కారణాలతో వీరంతా వెనకడుగు వేశారు. 2019-24 మధ్య వైసీపీ పాలనలో భూసమీకరణ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ భూసమీకరణ కార్యక్రమంలో కదలిక వచ్చింది. ఒక్కొక్కరుగా రైతులు భూసమీకరణకు ముందుకు వస్తున్నారు.
జగన్‌ను కలిశాక అనూహ్య స్పందన
ఇటీవల ఉండవల్లి, పెనుమాక గ్రామాల రైతులు కొందరు మాజీ సీఎం జగన్‌ను కలిశారు. తమ భూములు బలవంతంగా లాక్కుంటున్నారని, వాటిని ఇచ్చేదేలేదని వారు చెప్పారు. కానీ.. ఆ మరుసటి రోజే జగన్‌ను కలిసిన రైతుల్లో ఒకరైన అశోక్ మనసు మార్చుకుని భూసమీకరణకు తన భూమిని ఇచ్చారు. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో పెద్ద రైతులు ముందుకు వచ్చారు. వాస్తవానికి బుధవారం 220 ఎకరాల భూమి సమీకరణకు ఇచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో భూసమీకరణకు ఇస్తున్న నేపథ్యంలో స్వయంగా మంత్రికే తమ ఆమోద పత్రాలు ఇవ్వాలని వారు భావించారు. అయితే 106 ఎకరాలు అధికారులకు ఇచ్చారు. త్వరలో రాయపూడి, మందడం, మల్కాపురం గ్రామాలకు చెందిన రైతులు 130 ఎకరాల వరకూ భూమిని ఇవ్వనున్నారు. గడిచిన రెండేళ్లలో ఇంత పెద్దమొత్తంలో భూమి సమీకరణకు ఇవ్వడం ఇదే ప్రథమం. పెద్దమొత్తంలో ఇచ్చే భూమిని మంత్రి నారాయణ సమక్షంలో ఇచ్చే యోచనలో వారు ఉన్నట్లు తెలిసింది. కాగా, ఇటీవల ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు రైతులు భూసమీకరణకు మొగ్గుతున్నారు.