ల్యాండ్ పూలింగ్ రైతులకు ఊరట
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:10 AM
రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచే దిశగా సీఆర్‌డీఏ 63వ అథారిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన..
కొత్తగా భూములిచ్చే వారికి రూ.40 వేల కౌలు
సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచే దిశగా సీఆర్‌డీఏ 63వ అథారిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ల్యాండ్ పూలింగ్ రైతులకు పెరిగిన వార్షిక కౌలు, కొత్తగా పూలింగ్‌లో పాల్గొనే వారికి రుణమాఫీ, గ్రామకంఠాల్లో భూములు కోల్పోయే వారికి మెరుగైన పునరావాసం, టౌన్‌షి్‌పలలో అంతర్జాతీయ పాఠశాలలు, ఆస్పత్రుల ఏర్పాటు వంటి అంశాలకు ఆమోదం లభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఎకరానికి రూ.40వేల వరకు యాన్యుటీ అందించాలని నిర్ణయించారు. భూములు అప్పగించిన తేదీ నుంచి పదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. జరీబు భూములకు ప్రతి ఏడాది ఎకరానికి రూ.5వేల చొప్పున, మెట్టభూములకు రూ.3వేల చొప్పున వార్షిక కౌలు పెరగనుంది. ట్రంక్ రోడ్ల నిర్మాణం కారణంగా గ్రామకంఠాల్లో భూములు కోల్పోయే కుటుంబాలకు అదే గ్రామంలో సమాన విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయిస్తారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఒక సంవత్సరం పాటు అద్దె భత్యాన్ని నెలకు రూ.5వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ అథారిటీ ఆమోదం తెలిపింది. కొత్తగా ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చే రైతులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ వర్తింపజేయాలని నిర్ణయించారు. 2026 జనవరి 6లోపు తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది.
ఇంటర్నేషనల్ స్పోర్ట్సు సిటీ పరిధిలోని 307 ఎకరాల ఇనామ్, దేవదాయ శాఖ భూముల బదిలీ కోసం దేవదాయ శాఖకు రూ.159 కోట్ల పరిహారం చెల్లించేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఫిషరీస్ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక అక్వేరియం, కార్యాలయం నిర్మాణానికి 2 ఎకరాల భూమిని కేటాయించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు 7.42 ఎకరాలు, ఈశా ఫౌండేషన్‌కు భూమితో పాటు పార్కు వినియోగం హక్కులు, పార్కు నిర్వహణ బాధ్యతలు, సీఐఐకి 4 ఎకరాల భూమి కేటాయిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, సీడ్ యాక్సిస్ రోడ్డుకు అవసరమైన 2.50 ఎకరాలకు మంగళవారంతో గడువు ముగిసింది. బుధవారం నుంచి భూసేకరణ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకుని పరిహారం జమ చేస్తారు.