చంద్రబాబు, నారాయణ క్వాష్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:42 AM
రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూముల విషయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ..
గత ప్రభుత్వంలో అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సీఐడీ కేసులు.. హైకోర్టులో ముగిసిన వాదనలు
అమరావతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని అసైన్డ్ భూముల విషయంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబా బు, మంత్రి నారాయణ వేర్వేరుగా వేసిన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాతపూర్వక వాదనలు సమర్పించేందుకు ఇరుపక్షాలకు వెసులుబాటు కల్పించింది. శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో మంగళగిరి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24 ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాబు, పి.నారాయణపై కేసులు నమోదు చేశారు. వీటిని కొట్టివేయాలని కోరుతూ వారు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు 2021 మార్చి 19న స్టే విధించింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ఇటీవల తుది విచారణ ప్రారంభించింది. శుక్రవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రిప్లై వాదనలు వినిపించారు.