Share News

అమరావతిపై వైసీపీ విష క్రీడ!

ABN , Publish Date - Jul 13 , 2026 | 03:58 AM

వైసీపీ ఆడిన రాజకీయ విషక్రీడలో అమాయకులైన రాజధాని రైతులు బలయ్యారు. 99.5 శాతం మంది భూములిచ్చాక.. మిగిలిన అరశాతం మంది ఏమీ చేయలేరని తెలిసీ అమరావతిని అడ్డుకోవడానికి ఆ పార్టీ వారిని వాడుకుంది.

అమరావతిపై వైసీపీ విష క్రీడ!

  • 99.5 శాతం మంది భూములు ఇచ్చాక కూడా కుట్రలు

  • రాజధానిని ఆపలేమని తెలిసీ రైతులను బలిచేసిన వైనం

  • భూసమీకరణతో బేరీజు వేసుకుంటున్న రైతులు

  • సమీకరణతో 2 రెట్లు మేలు.. భవిష్యత్తుకు భరోసా

  • భూసేకరణతో తీవ్రంగా నష్టపోతున్నామని లెక్కలు

  • భూసేకరణపై సీఆర్డీఏ వాస్తవాల వెల్లడి

గుంటూరు(రాజధాని), జూలై 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఆడిన రాజకీయ విషక్రీడలో అమాయకులైన రాజధాని రైతులు బలయ్యారు. 99.5 శాతం మంది భూములిచ్చాక.. మిగిలిన అరశాతం మంది ఏమీ చేయలేరని తెలిసీ అమరావతిని అడ్డుకోవడానికి ఆ పార్టీ వారిని వాడుకుంది. అండగా ఉంటామని భరోసా ఇచ్చి చివరకు భూసేకరణకు బలిచేసింది. రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న ఈ-3 సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ కోసం చేపట్టిన 2.725 ఎకరాల భూసేకరణను బూచిగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో భూసేకరణకు వెళ్లడానికి ముందు జరిగిన పరిణామాలపై సీఆర్డీఏ అధికారులు కీలక వివరాలు వెల్లడించారు. భూసమీకరణ అయితేనే లాభమని, భూసేకరణ నోటిఫికేషన్‌ వరకు వెళ్లే పరిస్థితి తేవద్దని వారు రైతులకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. తోటి రైతులతో చెప్పించి ఒప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత కూడా భూసమీకరణకు అవకాశం ఉందని, ఎన్నోవిధాలుగా నచ్చజెప్పారు. ఈ క్రమంలో కొందరు సమీకరణకు అంగీకరించారు. చివరి నిమిషం దాకా అంటే భూసేకరణకు అవార్డ్‌ పాస్‌ కాకముందు వరకు ల్యాండ్‌ పూలింగ్‌ కింద అవకాశం ఉందని, ముందుకు రావాలని అధికారులు రైతులకు చెబుతూనే ఉన్నారు. ఉండవల్లిలో 20.323 ఎకరాలకు భూసేకరణ చేపట్టాలని సీఆర్డీఏ ప్రతిపాదిస్తే, అధికారుల సంప్రదింపులతో సుమారు 10 ఎకరాలకు చెందిన రైతులు సహకరించారు. ఇంకా కొందరు ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో 10.50 ఎకరాలకు భూసేకరణకు నోటిఫికేషన్‌ ఇచ్చారు.


తర్వాత కూడా సంప్రదింపుల ప్రక్రియ కొనసాగింది. దీంతో మరికొందరు రైతులు సమీకరణకు అంగీకరించారు. ఈ క్రమంలో కొందరు రైతులు వైసీపీ అధినేత జగన్‌ను కలిశారు. ఆయన నైజం తెలుసుకుని 1.12 ఎకరాలను సమీకరణకు ఇచ్చేందుకు నేలపాడు రైతు ముందుకొచ్చారు. ఇక మిగిలిన 2.725 ఎకరాలకు సంబంధించి తప్పని పరిస్థితుల్లో భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించి 11 మంది రైతులకు రూ.7.14 కోట్ల పరిహారాన్ని మంజూరు చేశారు. చెక్కులు ఇచ్చేందుకు అధికారులు వెళ్తే రైతులు నిరాకరించారు. ఆ చెక్కులను ట్రైబ్యునల్‌లో అందజేసే ప్రక్రియ కొనసాగుతోంది.


భూసేకరణపై అంతర్మథనం

ఉండవల్లిలో తలెత్తిన పరిణామాలపై భూసమీకరణకు నిరాకరించిన రైతుల్లో అంతర్మథనం మొదలైంది. ఇప్పటికే భూములు కోల్పోయినవారు తమకు జరిగిన నష్టాన్ని తలుచుకుని బావురుమంటున్నారు. భూసేకరణతో పలువురు రైతులకు జరిగిన తీవ్రనష్టాన్ని, భూసమీకరణ ద్వారా తోటి రైతులు పొందిన మెరుగైన ప్రయోజనాన్ని బేరీజు వేసుకుంటున్నారు. రాజధాని పరిధిలో జరుగుతున్న ట్రంకు రోడ్ల నిర్మాణం, ఎల్‌పీఎస్‌ లేఔట్ల అభివృద్ధికి అవసరమైన 720 ఎకరాల కోసం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు జారీ చేసింది. తొలుత రోడ్లకు అవసరమైన భూములను భూసేకరణ ద్వారా తీసుకుంటోంది. దీంతో మిగిలిన గ్రామాల రైతుల్లో ఆందోళన మొదలైంది. భూసమీకరణకు మొగ్గు చూపితేనే మేలేమోనని భావిస్తున్నారు. ఉండవల్లిలో భూమి మార్కెట్‌ విలువ ఎకరం రూ.7 కోట్ల వరకూ ఉంది. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు కోసం ఈ గ్రామంలో 2.7 ఎకరాలు తీసుకోవడంతో 11 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే భూసమీకరణ ద్వారా అయితే వారికి ఎకరానికి 1,450 గజాల స్థలం వచ్చేది. దాని విలువ ప్రస్తుతం రూ.6 కోట్ల వరకూ ఉంది. అమరావతి నిర్మాణం పూర్తయి, పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలైతే ఆ భూమి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. తద్వారా వారి భవిష్యత్తుకు భరోసా లభించేది. భూసేకరణతో వారికి ఎకరానికి రూ.2.62 కోట్లు మాత్రమే వచ్చాయి. ఈ మొత్తం భూసమీకరణ కంటే 60శాతం తక్కువ.


అదీ నగదు రూపంలో వచ్చింది. అవి ఖర్చయిపోతే భవిష్యత్తు ప్రయోజనం కూడా దెబ్బతింటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భూసేకరణ ప్రారంభం కాకముందే భూసమీకరణకు వెళితే ప్రయోజనం ఉంటుందన్న ఆలోచన రైతుల్లో కనిపిస్తోంది. భూసేకరణ నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్దాత 110 ఎకరాల భూమిని సమీకరణ ద్వారా రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని అమరావతిలో భూసేకరణ ఎలా జరుగుతుందో చూస్తామని నమ్మబలికిన వైసీపీ సరిగ్గా ఆ సమయానికి ముఖం చాటేసింది. దీంతో రైతులకు ఎలాంటి సహాయం అందలేదు. అండగా ఉంటామని చెప్పిన పార్టీ కష్టకాలంలో తమను వదిలేసిందన్న భావన రైతుల్లో కలిగింది. తోటి రైతులు భూసమీకరణకు భూములిచ్చి భారీ ప్రయోజనాలతో పాటు, గౌరవాన్నీ పొందడంతో మెజారిటీ రైతులు భూసమీకరణకే మొగ్గు చూపుతున్నారు.

Updated Date - Jul 13 , 2026 | 03:59 AM