ఇక భూసేకరణకు సిద్ధం
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:51 AM
రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రధాన ఆటంకంగా ఉన్న భూమి సమస్య ఎట్టకేలకు పరిష్కారం కాబోతోంది. భూసమీకరణ ప్రక్రియ (పూలింగ్) ద్వారా ఇవ్వని భూములను ప్రభుత్వం..
అమరావతిలో ముగుస్తున్న నోటిఫికేషన్ల గడువు
రేపు పరిహారం, పునరావాసంపై ప్రకటన
ఆ మరుసటి రోజు నుంచే భూసేకరణ మొదలు
(గుంటూరు(రాజధాని)-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రధాన ఆటంకంగా ఉన్న భూమి సమస్య ఎట్టకేలకు పరిష్కారం కాబోతోంది. భూసమీకరణ ప్రక్రియ (పూలింగ్) ద్వారా ఇవ్వని భూములను ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ పక్రియ ద్వారా తీసుకోనుంది. ఆ మేరకు ఇప్పటికే జారీ అయిన భూసేకరణ నోటిఫికేషన్ల గడువు మరో 2 రోజుల్లో పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న భూసేకరణకు సంబంధించి పరిహారం, పునరావాసానికి సంబంధించిన అవార్డు (ప్రకటన) జారీ కానుంది. ముందుగా ఉండవల్లి పరిధిలో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి ఇవ్వకుండా ఉన్న భూములను సేకరించనున్నారు. కాగా, రాజధాని పరిధిలోని 29గ్రామాల్లో 95 శాతానికి పైగా ప్రజలు, రైతులు భూసమీకరణకు మొగ్గుచూపగా, 5శాతం మంది ససేమిరా అన్నారు. 2015 నుంచి ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని భూముల విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ కారణంగా రోడ్లు, డ్రైనేజీలు, వరదనీటి లైన్లు వంటి ప్రధాన మౌలిక సదుపాయాల కల్పన (ట్రంక్ ఇన్‌ఫ్రా) చాలాచోట్ల ఆగిపోయింది. లేఔట్ల పనులు నిలిచిపోయాయి. రాజధాని రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సిస్ రోడ్డు ముక్కలు ముక్కలుగా, అష్టవంకరలతో వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ మిగిలిన కొద్దిమంది రైతులను భూసమీకరణకు ఒప్పించడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించింది. కొందరు సానుకూలంగా స్పందించి ముందుకు రాగా, మరికొందరు మాత్రం రాజకీయ కారణాలతో వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 10, 11, 12, 13, 18, 24 తేదీల్లో రోడ్ల అవసరాల కోసం భూసేకరణకు సంబంధించి 6 ప్రాథమిక నోటిఫికేషను (పీఎన్) జారీ చేసింది. ఇవన్నీ ఇప్పుడు గడువు పూర్తి చేసుకుని అవార్డు జారీ అయ్యే దశకు చేరుకున్నాయి.
పూర్తయిన 90 రోజుల గడువు
భూసమీకరణ ఇష్టం లేని కొందరు చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఫలితంగా పనులు జాప్యం అవుతూవస్తున్నాయి. భూసేకరణ నోటిఫికేషన్ విడుదలయ్యాక యజమానులు తమ అభ్యంతరాలు తెలిపేందుకు భూసేకరణ చట్టం- 2013 ప్రకారం 60 రోజులు గడువు ఉంటుంది. అనంతరం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్(ఎ్‌సఐఏ)కు మరో 30 రోజుల గడువు ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక తుది డిక్లరేషన్ జారీ చేస్తారు. కాగా ఆ గడువు కూడా 2 రోజుల్లో ముగుస్తోంది. ఆ మరుసటిరోజే జిల్లా కలెక్టర్ భూసేకరణను ఖరారు చేసి, పరిహారం, పునరావాస అవార్డు జారీ చేస్తారు. తొలి విడతగా సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించి రెండున్నర ఎకరాల భూమి ఈనెల 6న అవార్డు కానుంది. అదే రోడ్డుకు సంబంధించి మరో ఆరున్నర ఎకరాలు రావాల్సి ఉండగా, అందులో ఎకరం భూమి మాత్రం భూసమీకరణ ద్వారా వచ్చింది. మిగిలిన ఐదున్నర ఎకరాలు కూడా ఆ మరుసటి రోజు నుంచే అవార్డు అవుతాయని తెలుస్తోంది. ఈ నెల 15వ తేదీ లోపు అన్ని నోటిఫికేషన్లకు అవార్డు జారీ అవుతుందని అధికారులు చెబుతున్నారు.
మొత్తం 720.29 ఎకరాలు సేకరణ
అమరావతిలో ట్రంకు రోడ్ల నిర్మాణం, వరద నీటి పారుదల వ్యవస్థ, ఎల్‌పీఎస్ లేఔట్ల అభివృద్ధి, ఉండవల్లి పంపింగ్ స్టేషన్ నిర్మాణం కోసం మొత్తం 720.29 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ట్రంకురోడ్ల నిర్మాణం కోసం 216.33 ఎకరాలు, ఎల్‌పీఎస్ లేఔట్ల అభివృద్ధి కోసం 419.7 ఎకరాలు, వరదనీటి నెట్‌వర్క్‌కు 77.38 ఎకరాలు, ఉండవల్లి పంపింగ్ హౌస్ కోసం 6.87 ఎకరాల కోసం భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటిలో ప్రధానంగా నవులూరు, కురగల్లు, నిడమర్రు, మందడం, వెలగపూడి, పెనుమాక, ఉండవల్లి గ్రామాల భూములు ఉన్నాయి.
చివరి నిమిషం వరకు చర్చలు
భూసేకరణను అడ్డుకోవడానికి ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు చెందిన కొందరు విశ్వప్రయత్నం చేశారు. మాజీ సీఎంను కలవడం, న్యాయస్థానాల్లో కేసులు వేయడం వంటి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన సేకరణ కావడంతో వారికి న్యాయస్థానాల్లో చుక్కెదురైంది. అయినప్పటికీ ప్రభుత్వం, మంత్రి నారాయణ, సీఆర్డీఏ అఽధికారులు సంప్రదింపుల పద్ధతులనే అవలంభిస్తున్నారు. అవి కొంతమేరకు ఫలించి ఇటీవల కొందరు భూసమీకరణకు ముందుకు వచ్చారు. మరి కొందరు పట్టుదలకు పోతున్నారు. ఇక భూసేకరణ అవార్డు జారీ కానున్న నేపథ్యంలో వారి భూములు సేకరణ పరిధిలోకి వెళ్లిపోనున్నాయి.