చకచకా ఐకానిక్ సెక్రటేరియట్!
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:18 AM
రాజధాని అమరావతికి తలమానికమైన ఐకానిక్ నిర్మాణాల్లో త్వరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది..! ప్రధాన పరిపాలనా భవనాలైన జనరల్ అడ్మినిస్ట్రేషన్ బ్లాకు..
ఆగస్టు 15 నాటికి తొలి అంకం పూర్తి.. నెలలో తొలి డైమండ్ సిద్ధం
తర్వాత నిర్మాణం నల్లేరుపై నడకే.. ప్రతి 2 నెలలకు ఒక డైమండ్ పూర్తి
జంపింగ్ టెక్నాలజీతో పది రోజులకో అంతస్తు.. ఏడాది చివరినాటికి
18 అంతస్తులు సిద్ధం.. వచ్చే ఏడాది ఇదే టైంకి సివిల్ పనులు పూర్తి!
గుంటూరు (రాజధాని), జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి తలమానికమైన ఐకానిక్ నిర్మాణాల్లో త్వరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది..! ప్రధాన పరిపాలనా భవనాలైన జనరల్ అడ్మినిస్ట్రేషన్ బ్లాకు, టవర్ 1, 2, టవర్ 3, 4ల నిర్మాణంలో తొలి అంకం పూర్తి కాబోతోంది. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఐకానిక్ టవర్ల డయాగ్రిడ్ నిర్మాణంలో తొలి డైమండ్ పూర్తవుతుందని నిర్మాణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ నిర్మాణంలో అత్యంత సంక్లిష్టమైన ఫౌండేషన్, పైలింగ్ పనులు పూర్తి కావడంతో భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.
బాలారిష్టాలను దాటి..
భవన నిర్మాణంలో అత్యంత కీలకమైనది పునాదుల దశ. అందునా అమరావతిలో నిర్మించే ఈ పరిపాలనా భవనాలు ఒక్కొకటీ 40 అంతస్తులు ఉంటాయి. జీఏడీ భవనమైతే ఏకంగా 50 అంతస్తుల వరకూ ఉంటుంది. అలాంటి భవనాలకు పునాదులు అత్యంత పటిష్ఠంగా వేయాలి. దీనికోసం భారీగా గుంతలు తవ్వి రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దాదాపు 30 అడుగుల లోతులో గుంతలు తవ్వి వేస్తున్న ఫౌండేషన్, పైలింగ్ పనులకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. నేలమట్టం కంటే 30 అడుగుల లోతులో పనులు జరగడంతో చిన్న చినుకు పడితేనే పనులన్నీ ఆగిపోయేవి. దీంతో పునాదుల పనులకే రెండేళ్లకుపైగా సమయం పట్టింది. పునాదుల్లోకి చేరిన నీటిని తోడుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. అయితే ఇప్పుడు ఇలాంటి బాలారిష్టాలను దాటి ఐకానిక్ భవనాల నిర్మాణం వేగంగా సాగుతోంది. నిర్మాణాలన్నీ ఇప్పుడు నేలను విడిచి ఆకాశం దిశగా దూసుకుపోతున్నాయి.
జంపింగ్ టెక్నాలజీ అంటే..
జంపింగ్ టెక్నాలజీ అనేది షీర్‌వాల్ టెక్నాలజీని పోలి ఉంటుంది కానీ.. అంతకంటే ఎన్నో రెట్లు మెరుగైనది. షీర్ వాల్ టెక్నాలజీలో ప్రతి అంతస్తుకు షట్టరింగ్ చేసుకుని వాటి మధ్య స్టీలు, కాంక్రీట్‌తో గోడలు నిర్మించుకోవాలి. దానిపై స్లాబు వేసి, స్లాబు మీద షట్టర్లు నిలబెట్టి పై అంతస్తుకు గోడలు కట్టుకోవాలి. కానీ జంపింగ్ టెక్నాలజీలో స్లాబుతో సంబంధం లేకుండా గోడలు నిర్మించుకుంటూ పైకి వెళ్లిపోతారు. మెరైన్ ప్లైవుడ్ షట్టరింగ్, రైలుపట్టాల మాదిరిగా చెక్క బీముల సహాయంతో ముందుగా గోడల కోసం షట్టర్లను నిర్మించి, మధ్యలో స్టీల్, కాంక్రీట్‌తో కలిపి కాంపోజిట్ మిక్స్ నింపి గోడలు పూర్తి చేస్తారు. గోడలు పూర్తయిన తర్వాత మరో అంతస్తుకోసం షట్టర్లను పిస్టన్లు, రైలింగుల సహాయంతో అక్కడి నుంచి సులువుగా పైకి జరుపుతారు. షీర్‌వాల్ టెక్నాలజీలో స్లాబు అడ్డంగా ఉండడంతో ప్లేట్లన్నీ ఊడదీసి పైకి తీసుకెళ్లి మళ్లీ బిగించుకోవాలి. కానీ జంపింగ్ టెక్నాలజీలో ఒకసారి బిగిస్తే వాటినే పై వరకూ జరుపుకుంటూ వెళ్లిపోవచ్చు. జంపింగ్ టెక్నాలజీ పద్ధతిలో 3 గంటల్లోనే పై అంతస్తుకు షట్టరింగ్‌ను జరుపుకుని స్టీల్, కాంక్రీట్ మిక్స్‌తో గోడలు కట్టేసుకోవచ్చు. ఇలా 40 అంతస్తుల వరకూ షట్టర్లను జరుపుకుంటూ గోడలు నిర్మిస్తూ పోతారు. షట్టర్‌ను పైకి జరిపేందుకు 150 పిస్టన్లు అవసరం అవుతాయి. పిస్టన్లను ఆన్- ఆఫ్ చేస్తూ మెల్లగా రైలింగ్‌లను పైకి జరుపుతుంటారు. ఇలా ఒక్కసారి పిస్టన్ లివర్ ఆన్ చేసి 4 అంగుళాలు పైకి జరుపుతారు. అలా ప్రతి 2 నిమిషాలకు ఒక 4 అంగుళాల చొప్పున రైలింగ్‌ను పైకి జరుపుతారు. ఇలా 50 సార్లు లివర్లు ఆన్, ఆఫ్ చేస్తూ 100 నిమిషాల్లో మరో ఫ్లోరుకు షట్టరింగ్ రెడీ చేస్తారు. అందుకుగానూ రెండున్నర నుంచి 3 గంటలు సరిపోతుంది. గోడలను ఆధారం చేసుకుని ఒక్కో అంతస్తుకు పాతకాలం మిద్దెలకు మాదిరిగా భారీ ఉడెన్ బీములు వేసి వాటిపై డెక్ ఎంబడ్ ప్లేట్లు అమర్చి స్లాబ్ వేస్తారు.
మరో నెల రోజుల్లో తొలి డైమండ్ పూర్తి..
ఐకానిక్ అసెంబ్లీ టవర్లను డయాగ్రిడ్ నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఈ డయాగ్రిడ్ పిల్లర్ల మీద ఆధారపడి 40 నుంచి 50 అంతస్తుల భవనాలు నిలబడతాయి. ఈ డయాగ్రిడ్ నిర్మాణంలో కింద నుంచి పై వరకూ 7 నుంచి 9 వరకూ డైమండ్లు వస్తాయి. ఏటవాలుగా త్రిభుజాకారంలో నిర్మించే పిల్లర్లు రెండు ఒక చోట కలిసి మళ్లీ, విడిపోయి పక్కనే ఉన్న ఇంకో పిల్లర్‌తో కలుస్తాయి. మళ్లీ పైకి వెళ్లి రెండూ కలుస్తాయి. అలా డైమండ్ ఆకారంలో డయాగ్రిడ్ పిల్లర్లు పైకి లేస్తాయి. ఈ డయాగ్రిడ్‌లో నిర్మించే ఒక డైమండ్‌ను ఆధారం చేసుకుని 6 అంతస్తులు వేస్తారు. ప్రస్తుతం పునాదుల దశను దాటి మూడంతస్తుల వరకూ నిర్మాణం జరిగింది. జీఏడీ టవర్ సహా అన్ని పనులూ వేగంగా జరుగుతున్నప్పటికీ టవర్ 3, 4ల పనుల్లో కొంచెం అదనపు పురోగతి కనిపిస్తోంది. ఈ అన్ని టవర్ల పనులు నేలమట్టాన్ని దాటి దాదపు 3 అంతస్తుల వరకూ వెళ్లాయి. ఇక వర్షాలు వచ్చినా పనులకు ఎలాంటి ఆటంకం ఉండబోదు. దీంతో నిర్మాణం నల్లేరు మీద నడకేనని నిపుణులు చెబుతున్నారు.
10 రోజులకు ఒక అంతస్తు..
సెక్రటేరియట్ భవనాల నిర్మాణంలో ప్లైవుడ్, ఉడెన్ బీమ్ జంపింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మెరైన్ ప్లైవుడ్, ఉడెన్ బీములను ఉపయోగించి నిర్మించే ఈ టెక్నాలజీకి మన సంప్రదాయ విధానం జోడించి భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకూ విదేశాలకే పరిమితమైన ఆధునిక విధానంలో ఒక్కో అంతస్తు నిర్మాణానికి సగటున 10 రోజుల కంటే తక్కువ సమయమే పడుతుంది. నిర్మాణ సమయం మూడు వంతులు తగ్గడంతో వేగం మూడు రెట్లు పెరుగుతుంది. ఈ కారణంగా ప్రతి రెండు నెలలకు 6 అంతస్తులు నిర్మించవచ్చు. ఈ లెక్కన ఈ ఏడాది డిసెంబరు నాటికి 3 డయాగ్రిడ్ డైమండ్లు, 18 అంతస్తులు పూర్తవుతాయిని నిర్మాణ సంస్థల ఇంజనీర్లు చెబుతున్నారు. అదే వేగంతో పనులు జరిగితే వచ్చే ఏడాది ఇదే సమయానికి భవనాల నిర్మాణానికి సంబంధించి సివిల్ వర్క్ దాదాపుగా పూర్తవుతుందని చెబుతున్నారు.