Share News

అమరావతికి రాజమార్గం!

ABN , Publish Date - May 05 , 2026 | 04:20 AM

రాష్ట్ర రాజధాని అమరావతితో దేశంలోని ప్రధాన నగరాల అనుసంధానానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దక్షిణాదిలో ముఖ్య నగరాలైన చెన్నై, బెంగళూరుల నుంచి వేగంగా చేరుకునేందుకు...

అమరావతికి రాజమార్గం!

  • అద్దంకి నుంచి 92 కి.మీ. మేర హైస్పీడ్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ రోడ్డు

  • బెంగళూరు, చెన్నైలకు వేగంగా చేరుకునేలా ఎన్‌హెచ్‌ 16 విస్తరణ

  • 6 నుంచి 12 లేన్లకు విస్తరించే చాన్స్‌

  • నాలుగైదు చోట్లే ఎంట్రీ, ఎగ్జిట్లు

  • టూ వీలర్లు, ఆటోలకు నో ఎంట్రీ

  • రెండేళ్లలో పూర్తే లక్ష్యం

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర రాజధాని అమరావతితో దేశంలోని ప్రధాన నగరాల అనుసంధానానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. దక్షిణాదిలో ముఖ్య నగరాలైన చెన్నై, బెంగళూరుల నుంచి వేగంగా చేరుకునేందుకు హైస్పీడ్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ హైవే నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆ రెండు ప్రధాన నగరాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రకాశంజిల్లా అద్దంకి నుంచి అమరావతి వరకూ 92 కి.మీ. మేర హైస్పీడ్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ హైవేగా మారుస్తున్నారు. ఈ హైవేను రెండేళ్లలో పూర్తిచేసే లక్ష్యంతో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అడుగులు వేస్తున్నారు. అవసరమైన భూమి అందుబాటు, సేకరణ తదితర అంశాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. అమరావతికి ఇప్పటికే చెన్నై-కోల్‌కతా హైవే (ఎన్‌హెచ్‌-16)లో నిర్మించిన విజయవాడ వెస్ట్‌బైపా్‌సతో నేరుగా చెన్నైకి కనెక్టివిటీ ఏర్పడింది. ఎన్‌హెచ్‌ 65 ద్వారా హైదరాబాద్‌తోనూ కనెక్టివిటీ ఉంది. బెంగళూరుతో అమరావతిని కూడా నేరుగా కలిపేందుకు వీలుగా ఈ కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా బెంగళూరు-కడప-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ హైవేలో అద్దంకి నుంచి అమరావతి వరకు హైస్పీడ్‌ యాక్సిస్‌ కంట్రోల్‌ రోడ్డు నిర్మిస్తారు. బెంగళూరు-విజయవాడ హైవే ప్రకాశం జిల్లా అద్దంకి దగ్గర ఉన్న ముప్పవరం వద్ద ఎన్‌హెచ్‌-16లో కలుస్తుంది. ఎన్‌హెచ్‌-16నే కొత్త ప్రాజెక్టులో భాగంగా హైస్పీడ్‌ యాక్సెస్‌ కంట్రోల్‌ హైవేగా మార్చనున్నారు. ప్రస్తుత హైవేలో అద్దంకి నుంచి అమరావతి మధ్య 36చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఉన్నాయి. వీటిద్వారా ఆటోలు, ద్విచక్ర వాహనాలు హైవేలోకి వచ్చి ట్రాఫిక్‌ రద్దీ పెరిగి రాకపోకల వేగం తగ్గుతోంది.


అందువల్ల ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలను నియంత్రించేలా ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లను కుదిస్తారు. ముప్పవరంలో ఒకచోట, ఓఆర్‌ఆర్‌తో అనుసంధానమయ్యే నారా కోడూరు, గుంటూరు నగరం, చిన్నకాకాని జంక్షన్‌ వద్ద.. ఇలా నాలుగైదు చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు ఇస్తారు. తద్వారా ఎక్స్‌ప్రెస్‌ వాహనాల రాకపోకలను సరళతరం చేస్తారు.

వచ్చే ఏడాది పనులు ప్రారంభం..

యాక్సిస్‌ కంట్రోల్‌ రోడ్డు నిర్మాణంలో ఇప్పటికే ఎన్‌హెచ్‌- 16 కింద అందుబాటులో ఉన్న భూముల రికార్డులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. అయితే రెండు ప్రధాన నగరాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని యాక్సెస్‌ కంట్రోల్‌ రోడ్డును 12 లేన్ల వరకూ విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. అందుకు తగినంత భూమి అందుబాటులో ఉందా.. లేదా? అన్న అంశాన్ని రెవెన్యూ శాఖ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఉన్నట్లు ఆరు లేన్లు అలాగే ఉంచి యాక్సెస్‌ కంట్రోల్‌ చేస్తే కొత్తగా భూమి సేకరించాల్సిన అవసరం లేదు. అయితే రోడ్డును 12 లేన్లుగా విస్తరిస్తే మాత్రం భూమి అవసరం అవుతుంది. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకుని 2027 నాటికి పనులు ప్రారంభించాలని, రెండేళ్లలో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పని చేస్తున్నారు.

Updated Date - May 05 , 2026 | 04:20 AM