అమరావతిలో పలు సంస్థలకు అదనపు భూమి
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:34 AM
రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన ఐకానిక్ (శాశ్వత) హైకోర్టు భవన అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది...
హైకోర్టు అభివృద్ధికి రూ.547 కోట్లు మంజూరు
ప్రిన్సిపల్ కార్యదర్శుల నివాసాలకు అదనపు వసతులు
అమరావతి ఐ నిర్మాణానికి ప్రభుత్వం ఓకే
మంత్రి మండలి సిఫారసులకు ఆమోదం.. జీవోలు జారీ!
గుంటూరు(రాజధాని), జూన్ 5(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకమైన ఐకానిక్ (శాశ్వత) హైకోర్టు భవన అభివృద్ధి పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హైకోర్టు భవనం వెలుపలి అభివృద్ధి, ఇతర పనుల కోసం రూ.547 కోట్లు మంజూరు చేసింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా సూపర్ బ్లాక్ ‘ఎఫ్’లో ఈ నిధులతో మౌలిక వసతులు కల్పిస్తారు. హైకోర్టు రూఫ్ టాప్ ఎలివేషన్లలో ప్రీకాస్ట్ ఫిన్స్ డిజైన్, నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. భవనం పరిధిలో పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్స్, జలవనరులు (వాటర్‌బాడీస్) ఏర్పాటుకు ఈ నిధులు వినియోగిస్తారు. అంతర్గత రహదారులు, సబ్ స్టేషన్, జడ్జీల డ్రాప్- ఆఫ్ పాయింట్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి తెలిపింది. డిజైన్- బిల్డ్ లంప్‌సమ్ కాంట్రాక్ట్ (పర్సంటేజ్ టెండర్) విధానంలో టెండర్ల ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది. టెండర్ల ప్రక్రియ, పనుల అమలు బాధ్యతలను ఏజీఐసీఎల్ ఎండీకి ప్రభుత్వం అప్పగించింది. పనుల పర్యవేక్షణ, తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులను మంత్రి మండలి సిఫార్సుల మేరుకు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 118ని జారీ చేసింది. అలాగే, రాయపూడి గ్రామంలోని ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారుల బంగ్లాల్లో అదనపు వసతుల కల్పనకు సంబంధించి హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్, అదనపు వార్డ్‌రోబ్‌లు, జ్యూస్ కౌంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. బంగ్లాల్లో స్పైరల్ స్టెయిర్‌కేస్, కార్ పార్కింగ్ షెడ్, హీట్ పంప్స్, టెన్సైల్ రూఫింగ్ పనులకు ఆమోదం తెలిపింది. రూ.94 కోట్ల 90 లక్షలు వ్యయంతో అదనపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా నది తీరంలో భారీ ఫెర్రిస్ వీల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డీబీఎఫ్ఓటీ విధానంలో అమరావతి ఐ ప్రాజెక్టును అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అమరావతి ఐ కోసం పోటీ టెండర్లు, ఆర్‌ఎ్‌ఫపీకి అనుమతిచ్చింది. 30 ఏళ్ల లీజ్‌పై 6 ఎకరాల భూమి కేటాయించింది.