ఫోరెన్సిక్‌తో నేరాలకు బ్రేక్!
ABN , Publish Date - May 04 , 2026 | 04:11 AM
నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్ఎల్)లు కీలక పాత్ర పోషిస్తాయి. నేరం జరిగిన ప్రదేశం నుంచి చిన్న ఆధారాలను సైతం శాస్త్రీయంగా విశ్లేషించి నిందితులను త్వరగా గుర్తించేందుకు..
అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రెడీ
ఐదెకరాల్లో 5 భవనాల నిర్మాణం పూర్తి
రూ.252 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ప్రాజెక్టు
2017లో చంద్రబాబు చేతుల మీదుగా పనులు ప్రారంభం
అధికారంలోకి రాగానే నిర్మాణం ఆపేసిన వైసీపీ ప్రభుత్వం
2024లో కూటమి రాకతో పనులు వేగం.. నిర్మాణాలు పూర్తి
త్వరలోనే అత్యాధునిక పరికరాలూ అందుబాటులోకి
ఈ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
నేరస్థుల గుర్తింపులో కీలకం..
నేరం జరిగిన స్థలంలో లభించే రక్తం, లాలాజలం, వెంట్రుకలు, చర్మ కణాల వంటి చిన్నచిన్న ఆధారాలతో డీఎన్‌ఏ ప్రొఫైలింగ్ పరీక్ష ద్వారా నేరస్థుడి డీఎన్‌ఏను గుర్తించి, నేరాన్ని నిరూపించవచ్చు.
సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల కేసుల్లో డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా మొబైల్స్, కంప్యూటర్ల నుంచి తొలగించిన డేటాను తిరిగి పొందవచ్చు.
ఆటోమేటెడ్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఎఫ్ఐఎస్) ద్వారా వేలిముద్రలను విశ్లేషించి, డేటాబేస్‌లో ఉన్న వేలిముద్రలతో వాటిని సరిపోల్చి నేరస్థులను గుర్తించవచ్చు.
కాల్పుల సంఘటనల్లో తుపాకీలు, తూటాలను విశ్లేషించవచ్చు. విషప్రయోగం, లేదా మత్తు పదార్థాల వల్ల జరిగిన మరణాల కేసుల్లో శవపరీక్షల ఆధారంగా మరణానికి కారణాలను గుర్తించవచ్చు.
పాత పద్ధతులతో పోలిస్తే అధునాతన ల్యాబ్‌ల్లో డీఎన్‌ఏ విశ్లేషణ, డిజిటల్ ఫోరెన్సిక్ వంటివి కొన్ని గంటలు లేదా రోజుల్లోనే నివేదికలు అందిస్తాయి.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
నేర పరిశోధనలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్ఎల్)లు కీలక పాత్ర పోషిస్తాయి. నేరం జరిగిన ప్రదేశం నుంచి చిన్న ఆధారాలను సైతం శాస్త్రీయంగా విశ్లేషించి నిందితులను త్వరగా గుర్తించేందుకు, కోర్టుల్లో నేరం నిరూపించేందుకు సహాయపడతాయి. ప్రత్యక్ష సాక్షులు లేని కేసుల్లో.. ఈ ఫోరెన్సిక్ నివేదికలే నిజమైన నేరస్థుడిని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి.
ఇంతటి ప్రాధాన్యం కలిగిన అధునాతన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్.. రాష్ట్ర రాజధాని అమరావతిలో సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో తుళ్లూరులోని ఎన్-14, ఈ-5 జంక్షన్‌లో ఐదెకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఐదు భవనాల సముదాయం పూర్తయింది. ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. ఎఫ్‌ఎస్ఎల్ ఇచ్చే కచ్చితమైన నివేదికలు నేరస్తులకు శిక్ష పడేలా చేస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సీఆర్‌డీఏ భవనం తర్వాత రాజధానిలో ప్రారంభంకానున్న భవన సముదాయం ఇదేనని తెలిపారు. దేశంలోని ఎనిమిది అత్యాధునిక ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ల్లో ఇదొకటని పేర్కొన్నారు.
త్వరితగతిన విచారణ...: ఒకప్పుడు నేరాలు జరిగితే.. ఘటనా స్థలంలో నిపుణులు సేకరించే వేలి ముద్రలు, తల వెంట్రుకలు, రక్తం.. వంటివి కేసు పరిష్కారంలో కీలక పాత్ర పోషించేవి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి తే ఆరు నెలలకో, ఏడాదికో నివేదిక వచ్చేది. ఈ ప్రక్రియలో జాప్యం వల్ల కేసులు ఎక్కువగా నిలబడేవి కావు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా నేరస్థులు కూడా పాత పద్ధతులు, దర్యాప్తు విధానాలను పసిగట్టి జాగ్రత్త పడుతున్నారు. ఆనవాళ్లు దొరక్కుండా నేరాలు చేసి తప్పించుకొంటున్నారు. అటువంటి వారి ఆట కట్టించేందుకు దర్యా ప్తు సంస్థలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను పాటిస్తున్నాయి. దీనికోసం కోట్లాది రూపాయల విలువైన సైబర్ ఫోరెన్సిక్, డిజిటల్ ఫోరెన్సిక్, కెమి స్ట్రీ, బయాలజీ వంటి ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకుని నేరగాళ్లను కచ్చితంగా గుర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేస్తున్న పోలీసుశాఖ అమరావతిలో అంతర్జాతీయ స్థాయి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ ల్యాబ్‌లు నెలకొకటి చొప్పున ప్రారంభిస్తూ దర్యాప్తు వ్యస్థను బలోపేతం చేసుకుంటోంది.
2017లోనే నిర్మాణాలు ప్రారంభం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ నేరం జరిగినా ఘటనా స్థలంలో సేకరించే ఆధారాలను భద్రపరిచి హైదరాబాద్ ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లేకుండా పోయింది. దీంతో 2017లో కేంద్రంతో మాట్లాడిన సీఎం చంద్రబాబు రాష్ట్రానికి అధునాతన ఎఫ్‌ఎస్ఎల్ నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చారు. రూ.253 కోట్ల అంచనాతో రాజధానిలోని తుళ్లూరు ప్రాంతంలో దీని నిర్మాణానికి 2017 డిసెంబరు 28న భూమిపూజ చేశారు. మొదటి శ్లాబు వేసేలోపు ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. అంతే.. మొత్తం నిర్మాణం ఆగిపోయింది. 2024లో మళ్లీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రావడంతో ఐదెకరాల విస్తీర్ణంలో 5 బ్లాకులుగా చేపట్టిన నిర్మాణం పూర్తయింది. ఈ ల్యాబ్‌లో ఏర్పాటు చేసే అధునాతన పరికరాలు ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల షిప్పులో ఆగిపోయాయని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే వాటిని భవనాల్లో ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రారంభం చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఐదెకరాల్లో.. ఐదు భవనాలు...
ఐదెకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధాన భవనంలో పరిపాలన మొత్తం ఏర్పాటు చేసి.. మిగతా నాలుగింటిలో ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, బాలిస్టిక్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. భవన సముదాయం దాదాపు పూర్తికాగా ప్రస్తుతం ప్రహరీ నిర్మాణం జరుగుతోంది. మరోవైపు వీటిలో అవసరమైన పరికరాలను రూ.41 కోట్ల ఖర్చుతో పోలీసు శాఖ తెప్పిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా నిమిషాల్లోనే క్రైమ్ స్పాట్‌కు వెళ్లేలా పోలీసు సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన మొబైల్ ఎఫ్‌ఎస్ఎల్ వాహనాలు సేకరించే ఆధారాలను 48 గంటల్లోనే నిర్దారించి దర్యాప్తు అధికారికి తెలియజేస్తామని ఎఫ్‌ఎస్ఎల్ డైరెక్టర్ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. డీఎన్‌ఏ, నార్కోటిక్స్, సైబర్, బయోమెట్రిక్, బాలిస్టిక్ లాంటి పరీక్షలతో పాటు ఫోరెన్సిక్ అకౌంటింగ్‌కు సంబంధించిన ఎక్సలెన్స్, గత నేరాల నమూనాలతో సరిపోల్చగల డేటాబేస్ యాక్సిక్ కూడా ఉంటుందన్నారు.
నేరస్తులు తప్పించుకోలేరు: డీజీపీ
రాష్ట్రంలో నేరం చేసిన వ్యక్తి తప్పించుకోలేడని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా అన్నారు. ‘రాష్ట్రంలో నేరం చేసిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదని సీఎం చంద్రబాబు పదే పదే మాకు చెబుతున్నారు. అందుకే ఏపీలో ఎఫ్‌ఎస్ఎల్‌ను బలోపేతం చేస్తున్నాం. కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంలోని ప్రాంతీయ ఎఫ్‌ఎస్ఎల్‌లకు తోడు అనంతపురం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంలోనూ ఏర్పాటు చేశాం. గత నెలలో తిరుపతిలో ప్రారంభించాం.. ఈ నెలలో రాజమహేంద్రవరంలో ప్రారంభం కాబోతోంది.. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను కూడా సీఎం చంద్రబాబుతో ప్రారంభం చేయిస్తాం’ అని చెప్పారు. ఫోరెన్సిక్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు పూర్తి సహకారం అందించిన సీఎం చబ్రాబాబుకు పోలీసుశాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. సిబ్బంది కొరత గురించి చెప్పగానే ఎనిమిది మంది ఏడీలు, 45 మంది సైంటిఫిక్ ఆఫీసర్లు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న మరో 156 మంది హోంగార్డుల నియామకానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని డీజీపీ వివరించారు.