Share News

అమరావతికి మరో వరం!

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:56 AM

రాజధాని అమరావతిలో మరో కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇక్కడ కూడా కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది.

అమరావతికి మరో వరం!

  • కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణానికి పచ్చజెండా

  • 2,534 కోట్లతో కార్యాలయాలు, గృహసముదాయ నిర్మాణం

  • 5.53 ఎకరాల్లో రూ.1,299 కోట్లతో కార్యాలయ భవనం

  • 17 ఎకరాల్లో కేంద్ర ఉద్యోగుల కోసం గృహ సముదాయం

  • సీపీడబ్ల్యూడీ ప్రతిపాదనలకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం

  • పాత అంచనాలను పునఃసమీక్షించి కొత్త డీపీఆర్‌లు సిద్ధం

  • అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం: సీఎం

  • కేంద్ర నిర్ణయం చరిత్రాత్మకం: పెమ్మసాని

గుంటూరు(రాజధాని)/న్యూఢిల్లీ, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో మరో కీలక ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దేశ రాజధాని ఢిల్లీ తరహాలో ఇక్కడ కూడా కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. మొత్తం రూ.2,534 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ బృహత్‌ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర పబ్లిక్‌ వర్క్స్‌ విభాగం (సీపీడబ్ల్యూడీ) ఇటీవల ప్రతిపాదనలు పంపగా ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న ఈ గ్రీన్‌ఫీల్డ్‌ నగరంలో కేంద్రానికి సంబంధించిన అన్ని కార్యాలయాలను ఒకేచోటకు చేర్చేలా ఈ నిర్మాణం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర కార్యాలయాల సముదాయం, గృహ నిర్మాణ సముదాయం రెండింటినీ కలిపి కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మిస్తోంది. కేంద్ర ప్రభుత్వ జనరల్‌ పూల్‌ కార్యాలయా న్ని 5.53 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నా రు. ఈ కార్యాలయంలో 2 బ్లాక్‌లు ఉన్నాయి. మొదటిది ప్లాట్‌ సీ-9లో జీ+13 అంతస్తులతో (గ్రౌండ్‌ ఫ్లోర్‌ సేవల కోసం, 3 అంతస్తులు పోడియం పార్కింగ్‌, 10 అంతస్తులు కార్యాలయాల కోసం) కూడిన బ్లాక్‌ కాగా... మరొకటి ప్లాట్‌ సీ-8లో జీ+10 అంతస్తులతో(గ్రౌండ్‌ ఫ్లోర్‌ సేవల కోసం, 3అంతస్తులు పోడియం పార్కింగ్‌, 7 అంతస్తులు కార్యాలయాల కో సం) కూడిన బ్లాక్‌ను నిర్మిస్తారు.


ఈ కార్యాలయాల్లో సుమారు 8 వేల మంది పనిచేసేందుకు వీలుంది. దాదాపు 1,800 ఈక్వివలెంట్‌ కార్‌ స్పేస్‌(ఈసీఎస్‌) సామర్థ్యంతో పార్కింగ్‌ సదుపాయం కల్పిస్తారు. మొత్తం 23,25,000 చదరపు అడుగుల బిల్ట్‌-అప్‌ ఏరియాతో నిర్మించే ఈ కార్యాలయం కోసం కేంద్రం రూ. 1,299.08 కోట్లు కేటాయించింది. అందులో ఉద్యోగులు, సందర్శకుల అవసరాలను తీర్చడానికి తగిన సౌకర్యాలు కల్పించనున్నారు. ఏటీఎంతో కూడిన బ్యాంకు, పోస్టాఫీస్‌, క్రెచ్‌, రిక్రియేషన్‌ రూమ్‌, మహిళలకు ప్రత్యేక గది, 100 మంది కూర్చునే సామర్థ్యంతో కాన్ఫరెన్స్‌ హాల్‌, 500 మంది కూర్చునే సామర్థ్యం గల మల్టీపర్పస్‌ హాల్‌, 4 క్యాంటీన్లు నిర్మిస్తారు.


సకల సదుపాయాలతో నివాస సముదాయం

ఈ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం జనరల్‌ పూల్‌ రెసిడెన్షియల్‌ అకామడేషన్‌(జీపీఆర్‌ఏ)ను 17 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న మొట్టమొదటి జీపీఆర్‌ఏ ప్రాజెక్ట్‌ ఇదే కావ డం విశేషం. ఇందులో టైప్‌-2 నుంచి టైప్‌-6 విభాగాల వరకు కలిపి మొత్తం 1,504 నివా స గృహాలతో కూడిన 11 రెసిడెన్షియల్‌ టవ ర్లు నిర్మిస్తారు. ఇందులో 1,972 ఈక్వివలెంట్‌ కార్‌ స్పేస్‌(ఈసీఎస్‌) సామర్థ్యంతో బేస్‌మెం ట్‌ పార్కింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం బిల్ట్‌-అప్‌ ఏరియా 31.30 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. ఇందు లో 9.10 లక్షల చదరపు అడుగుల బేస్‌మెంట్‌ ఏరియా కూడా ఉంటుంది. నివాస సముదాయం నిర్మాణం కోసం రూ.1,234.91 కోట్లను కేంద్రం కేటాయించింది. కాగా, ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలో 7 లక్షల పనిదినా లు, తర్వాత నిర్వహణ దశలో 50 వేల పనిదినాలు కల్పించవచ్చని అంచనా. దివ్యాంగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే లా ‘బ్యారియర్‌-ఫ్రీ’ క్యాంప్‌సలుగా తీర్చిదిద్దనున్నట్లు కేంద్రం వెల్లడించింది.

2018లోనే కేంద్రానికి ప్రతిపాదనలు

కామన్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌, ఉద్యోగు ల నివాస సముదాయాల నిర్మాణానికి సం బంధించి 2018లోనే నాటి టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. 2019లో ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు మూలనపడ్డాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పాత అంచనాలను పునఃసమీక్షించి డీపీఆర్‌లు రూపొందించారు.


చరిత్రాత్మకం: పెమ్మసాని

అమరావతిలో రూ.2,534 కోట్ల వ్యయంతో 2 భారీ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలపడం చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం ఏపీభవన్‌లో ఎంపీ సానా సతీశ్‌తో కలిసి మా ట్లాడారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఈ నిర్ణయం ఒక కీలక ఘట్టంగా మారబోతోందని తెలిపా రు. ఈ నిర్మాణాలను కేంద్ర ప్రజా నిర్మాణ శాఖ చేపట్టనుందని తెలిపారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌లో ఈ ప్రాజెక్టు భాగమని తెలిపారు. వీబీజీరాంజీ నిధుల్లో అత్యధిక భాగం ఏపీకి దక్కాయని పేర్కొన్నారు.

అమరావతి అభివృద్ధిలో మరో కీలక ఘట్టం: సీఎం

అమరావతి, జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): అమరావతిలో సెంట్రల్‌ గవర్నమెంట్‌ జనరల్‌ పూల్‌ ఆఫీస్‌ అకామిడేషన్‌ (సీజీజీపీవోఏ) నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలపడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం ఏపీలో కేంద్ర సంస్థల ప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఆధునిక, పర్యావరణ అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆమోదం తెలపడం అమరావతి అభివృద్ధిలో మరో కీలకమైన ఘట్టంగా సీఎం అభివర్ణించారు. రాజధానిగా అమరావతి అభివృద్ధికి, భవిష్యత్తు వృద్ధికి అవసరమైన పరిపాలనా మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రాజెక్టు ఊతమిస్తుందన్నారు. ఏపీలో కేంద్ర కార్యాలయాలను ఒకేచోటకు తీసుకురావడం ద్వారా పాలన సులభతరం అవుతుందని అన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 03:58 AM