అమరావతి గెజిట్‌పై హర్షాతిరేకాలు
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:18 AM
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ జారీ చేయడంపై హైకోర్టు సమీపంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మంగళవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు...
హైకోర్టు వద్ద న్యాయవాదులు,రైతులు, మహిళల సంబరాలు
తుళ్లూరు/మడకశిర, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ జారీ చేయడంపై హైకోర్టు సమీపంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మంగళవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, రేరా చైర్మన్ శివారెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, హైకోర్టు న్యాయవాదులు, ఇంకా పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు హర్షాతిరేకాలు ప్రకటించారు. హైకోర్టు సమీపంలో కేక్ కత్తిరించి సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చారు. కిలోమీటరు నడిచి హైకోర్టు సమీపంలోని జాతీయ పతాకం వద్ద కర్పూర హారతి పట్టారు. న్యాయం గెలిచిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. విందు భోజనం ఏర్పాటు చేశారు. నాటి వైసీపీ సర్కారు తెచ్చిన మూడు రాజధానుల బిల్లును సెలక్ట్ కమిటీకి పంపిన శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్‌కు ఈ సందర్భంగా రాజధాని మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కాళ్లకు మొక్కారు. అమరావతికి చట్టబద్ధత లభించటం చరిత్రాత్మక ఘట్టమని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు. దీర్ఘకాలంగా సాగిన ఉద్యమానికి ఇది ఫలితమన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు లక్ష్మీనారాయణ, ఉన్నవ మురళీ, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో మడకశిర నుంచి రొళ్ల వరకూ 25 కి.మీ. బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలను పట్టుకుని 1500 బైకులతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జయహో అమరావతి అంటూ నినాదాలు మార్మోగించారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏకైక రాజధానిగా అమరావతి చరిత్రలో నిలవబోతోందని ఎమ్మెల్యే రాజు అన్నారు.