Share News

దేశానికి ఫ్యూచర్‌ సిటీ అమరావతి

ABN , Publish Date - Apr 04 , 2026 | 03:07 AM

‘విద్య, విజ్ఞానం, ఉద్యోగం లాంటి అంశాలకు అమరావతి నెర్వ్‌ సెంటర్‌గా మారుతుంది. దేశానికి ఒక ఫ్యూచర్‌ సిటీ అవసరం. అది అమరావతే. దేశానికి అమరావతి గర్వకారణంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

దేశానికి ఫ్యూచర్‌ సిటీ అమరావతి

  • వైసీపీ నాశనం చేస్తే.. మేం శాసనం చేశాం

  • భవిష్యత్తులోనూ ఎవరూ ఏమీ చేయలేరు

  • విమర్శలకు వెరసి వెనకడుగు వేయం

  • అత్యద్భుత, అత్యాధునిక నగరంగా నిర్మిస్తాం

  • వైసీపీ ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసింది

  • ఏపీకి ఉనికి లేకుండా చేయాలన్నదే లక్ష్యం

  • అమరావతిని నాశనం చేయాలన్న కలలు పగటి కలలుగానే మిగిలిపోతాయి

  • 2028 నాటికి ప్రధాన పనులన్నీ పూర్తి

  • 2029లో మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు చేయిస్తాం: చంద్రబాబు

ప్లాన్‌ ఏ అంటే మూడు ముక్కలాట.. ప్లాన్‌ బీ అంటే మావిగన్‌.. ఇలాంటి విపరీత మనస్తత్వం ఉన్న వారు రాజకీయాలకు అనర్హులు. తుగ్లక్‌లు పాలనలోకి వచ్చి రాజధానిని ప్రతిసారీ మారుస్తామంటే ఎలా? పార్లమెంటు చట్టం చేస్తే దానిని కూడా మార్చేస్తామని మాట్లాడతారా? ఇలాంటి నాయకులు ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యం. ప్రజలకు జగన్‌ విపరీత మనస్తత్వం అంతుబట్టిందో లేదో కానీ.. కొందరు అతన్ని సైకో అని ఎందుకంటారో నాకు అర్థమైంది.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘విద్య, విజ్ఞానం, ఉద్యోగం లాంటి అంశాలకు అమరావతి నెర్వ్‌ సెంటర్‌గా మారుతుంది. దేశానికి ఒక ఫ్యూచర్‌ సిటీ అవసరం. అది అమరావతే. దేశానికి అమరావతి గర్వకారణంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శుక్రవారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సైబరాబాద్‌ ఈ రోజు గొప్ప స్థాయిలో ఉందంటే నాడు విమర్శలకు వెరవకుండా ముందుకు వెళ్లడమే కారణమని, ఇప్పుడు అమరావతి అభివృద్ధి విషయంలోనూ విమర్శలకు భయపడి ఆగిపోయే ప్రసక్తే లేదని అన్నారు. అత్యద్భుత, అత్యాధునిక అమరావతిని నిర్మించి తీరుతామన్నారు. ‘సైబరాబాద్‌ సహా అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌ ఉన్నా మంచి రాజధాని నిర్మించాలనే ఆలోచనతో ముందుకెళ్లాను. అమరావతిని 9 నగరాలుగా నిర్మించాలని ప్రణాళికలు రూపొందించాం.


భవిష్యత్తు తరాలు శాశ్వతంగా రాజధాని ప్రాంతాన్ని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ శ్రేణి ఆర్కిటెక్ట్‌లతో డిజైన్లు రూపొందించాం. 5, 10, 15 నిమిషాల కాన్సెప్ట్ అత్యాధునిక రాజధాని నిర్మించాలనేది నా ఆలోచన. ఎమర్జెన్సీ సర్వీసులు 5 నిమిషాల్లో చేరుకునేలా.. ప్రజలకు రోజువారీ అవసరాలకు ఉపయోపడే సేవలను 10 నిమిషాల్లో అందించేలా.. కార్యాలయాలు, ఇతర పని ప్రాంతాలకు 15 నిమిషాల్లో చేరుకునేలా అమరావతి రూపకల్పన చేశాం. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు సింగపూర్‌ వాళ్లతో ఒప్పందం చేసుకుంటే వారిపై వైసీపీ పాలకులు అభాండాలు వేసి వెళ్లగొట్టారు. అమరావతి బ్రాండ్‌ను దెబ్బతీశారు. నాపై నమ్మకంతో అమరావతి బాండ్లు విడుదల చేస్తే గంటలో రూ.2వేల కోట్లు వచ్చాయి. రాజధాని ప్రాంతానికి ప్రతిష్ఠాత్మక సంస్థలు విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అమృత వంటివి వచ్చాయి. ఆ సంస్థలు విట్‌ అమరావతి, ఎస్‌ఆర్‌ఎం అమరావతి అని పెట్టుకుంటే.. ఆ పేరు తీసేయమని వారిపై ఒత్తిడి చేశారు. అమరావతిపై ఎందుకంత ద్వేషం? 2014-19 మధ్య 113 సంస్థలకు 1307 ఎకరాలు కేటాయించాం. ముమ్మరంగా పనులు జరుగుతున్న సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చి వాటిని ఆపేసింది. మూడు రాజధానుల ప్రకటన చేసి వివాదాలు సృష్టించే ప్రయత్నం చేశారు. అమరావతి రైతుల ఉద్యమానికి కౌంటర్‌గా పెయిడ్‌ ఆర్టిస్టులతో క్యాంపులు పెట్టించారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. నాపై రాళ్లు వేయించారు. అదేమని ప్రశ్నిస్తే.. అప్పటి డీజీపీతో భావప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడించారు. 3రాజధానులు చట్టవిరుద్ధమని హైకోర్టు న్యాయమూర్తి తీర్పు ఇస్తే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆయన బదిలీపై వెళుతుంటే మోకాళ్లపై కూర్చుని దారంతా పూలు చల్లి వీడ్కోలు పలికారు. రాజధానిపై కుట్రలు చేసిన వ్యక్తిని, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తిని నియంత అనాలా లేక ఏమనాలో తెలియడం లేదు. కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తిప్పికొట్టారు. మళ్లీ మాకు పట్టం కట్టారు’ అని అన్నారు.


ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

‘భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన తొలి రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. అందుకే అమరావతికి పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించి విజయం సాధించాం. రాష్ట్రపతి ఆమోదం తర్వాత బిల్లుకు పూర్తిస్థాయి చట్టబద్ధత వస్తుంది. అమరావతి బిల్లుకు అన్ని విధాలా సహకరించిన ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు 5 కోట్ల ఆంధ్రుల తరఫున ధన్యవాదాలు. లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ చైర్మన్‌కు కృతజ్ఞతలు. అమరావతిని భవిష్యత్తులోనూ ఎవరూ ఏమీ చేయలేరు’ అని పేర్కొన్నారు.


విభజన తర్వాత అన్నీ ఇబ్బందులే

‘విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ భావోద్వేగాలు ఉన్నాయి. చాలా అంశాలు పరిష్కారం కాకున్నా విభజన జరిగింది. మన రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలు వెంటాడాయి. రాజధాని లేదు, వనరులు లేవు. అన్నీ ఇబ్బందులే. తెలంగాణకు నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు. టీడీపీ పుట్టిందే హైదరాబాద్‌లో. ఈరోజు హైదరాబాద్‌లో ఇంతటి సంపద వస్తుందంటే సైబరాబాద్‌ వంటి నగర నిర్మాణం వల్లే. విభజన తర్వాత విజయవాడకు వస్తే ఎక్కడి నుంచి పాలన చేయాలో తెలియని పరిస్థితి. బస్సులో బస చేసి, నీటిపారుదల ఎస్‌ఈ కార్యాలయాన్ని సీఎం కార్యాలయంగా చేసుకుని పాలన మొదలుపెట్టాం. రాజధానిని ఎంపిక చేసేందుకు శివరామకృష్ణన్‌ కమిటీని కేంద్రం ఏర్పాటు చేస్తే 46 శాతం మంది ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటుకు అనుకూలమని పేర్కొన్నారు. అప్పుడు కూడా వైసీపీ చాలా డ్రామాలు ఆడింది. ప్రజలను రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టించాలని చూసింది. మూడు ప్రాంతాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా ఎంపిక చేశాం. ఒక్క పిలుపు ఇవ్వగానే 29 వేలమంది రైతులు 34 వేల ఎకరాలను ఇచ్చారు. ప్రభుత్వ భూమి కూడా కలిపితే 54 వేల ఎకరాలు అందుబాటులోకి వచ్చింది. అభివృద్ధిలో రైతులనూ భాగస్వాములను చేసేలా ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంను తీసుకువచ్చాం. ఇది ప్రపంచం మొత్తానికి ఓ రోల్‌ మోడల్‌గా నిలిచింది. రాజధానితో తమ జీవితాలు బాగుపడుతాయని రైతులు భూములిచ్చారు. భూములు తీసుకున్న తర్వాత 11నెలల్లో సచివాల యం, అసెంబ్లీ భవనాలు నిర్మించాం. వీటిని వైసీపీ వారు వక్రీకరించి దుష్ప్రచారం చేశారు. ట్రాన్సిట్‌ క్యాపిటల్‌గా మేము చెబితే టెంపరరీ క్యాపిటల్‌గా ప్రచారం చేశారు. 2016 జూన్‌ నుంచే ప్రభుత్వ కార్యకలాపాలన్నీ అమరావతి నుంచే నిర్వహించాం. అమరావతిని వ్యతిరేకించిన గత పాలకులూ గతి లేని పరిస్థితిలో ఇక్కడి నుంచే పాలన సాగించారు’ అని విభజన అనంతర పరిస్థితిని వివరించారు.


విపరీత మనస్తత్వంతో తడవకో మాట

‘స్వతంత్ర భారతదేశంలో 3 రాజధానుల డ్రామా ఆడిన వ్యక్తులు ఎవరూ లేరు. ఇంత జరిగినా వైసీపీ విషం చిమ్ముతూనే ఉంది. వైసీపీ నేతలు అహంకారం ప్రదర్శిస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడాన్ని ఓర్వలేకపోతున్నారు. ఈ తిక్కకు పరిష్కారం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. తాను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని ఓసారి.. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లేదని మరోసారి మాట్లాడుతున్నారు. తాను అధికారంలోకి వస్తే ప్లాన్‌ ఏ, ప్లాన్‌ బీ అమలు చేస్తామని చెబుతున్నారు. అమరావతికి దేశమంతా మద్దతు ఇచ్చింది. వారిని తప్పుపట్టేలా వైసీపీ వింత ప్రవర్తన ఉంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళనచేసి మాట్లాడుతారా? అమరావతి అని పలకడం కూడా ఇష్టం లేని వ్యక్తుల గురించి మాట్లాడుకోవాల్సి రావడం దౌర్భాగ్యం. వెంకటేశ్వరస్వామికి ఘోర అపచారం చేసి సమర్థించుకున్న వాళ్ల ప్రవర్తనను ఇంతకన్నా ఇంకేం ఊహిస్తాం. బెదిరింపులతో పెట్టుబడిదారులను తరిమేయాలని చూస్తున్నారు. అప్రజాస్వామికంగా వ్యవహరించే వారిపై చట్టపరంగా కఠినంగా ముందుకెళ్తాం. వైసీపీ వారి విధానాల వల్ల ఏపీ అప్పుల్లో కూరుకుపోయింది. దక్షిణ భారత రాష్ట్రాల్లో అతి తక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా నిలబడింది. విభజన కంటే ఏపీకి వైసీపీ హయాంలోనే ఎక్కువ నష్టం జరిగింది. 30ఏళ్లు వెనక్కి వెళ్లాం. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అప్పులు తేవడం ఏమిటి? మేం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుని పాలన సాగిస్తున్నాం. ఎక్కువ వడ్డీలకు తెచ్చిన అప్పులను రీషెడ్యూల్‌ చేసుకుని భారం తగ్గించుకుంటున్నాం. ఒక వ్యక్తి తన పిచ్చి చేష్టలతో రాష్ట్రాన్ని నాశనం చేశారు’ అని అన్నారు.


అమరావతి సంకల్పం ఆగదు

‘ఎవరు ఏం చేసినా అమరావతి సంకల్పం ఆగదు. ప్రస్తుతం రూ.56 వేల కోట్ల విలువైన పనులు రాజధానిలో జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణం ఏడాదికో, రెండేళ్లకో పూర్తయ్యేది కాదు. అది నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ప్రధానమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే దానంతట అదే అభివృద్ధి చెందుతూ పోతుంది. 2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. దానికి చోదకశక్తిగా అమరావతి నిలుస్తుంది. అమరావతి సెల్ఫ్‌ సస్టెయినబుల్‌, మోనిటైజేషన్‌ ప్రాజెక్టు. ప్రజారాజధాని. ప్రజలు నిరంతరం ఆనందంగా ఉండేలా చూడాలని నేను నిత్యం భగవంతుడిని వేడుకుంటూ ఉంటాను’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


అడుగడుగునా అడ్డు

‘హైదరాబాద్‌ను నాలెడ్జ్‌ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వేసిన పునాదుల వల్ల అది మోస్ట్‌ లివబుల్‌ సిటీగా మారింది. అమరావతిని కూడా అంతకుమించిన స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించి పనులు ప్రారంభించాం. రాజధాని నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో దేశంలో, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి మట్టిని, పవిత్రమైన జలాలను తెప్పించాం. ప్రధాని కూడా పార్లమెంటు నుంచి మట్టిని, యమున జలాలను తీసుకువచ్చారు. దేశం మొత్తం అమరావతికి అండగా ఉంటుందనే ఆ మట్టిని, నీటిని తెచ్చినట్లు ప్రధాని చెప్పారు. తాజాగా పార్లమెంటులో జరిగిన అమరావతి బిల్లుపై దేశం మొత్తం అమరావతికి అండగా నిలిచింది. వైసీపీ వాళ్లు అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. అమరావతి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అమరావతికి వ్యతిరేకంగా ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేశారు. రైతులకు చెందిన అరటి తోటలు తగులబెట్టారు. పర్యావరణం దెబ్బతింటుందన్నారు. నిర్మాణాలకు అనుకూలం కాదన్నారు. ఎడారి అన్నారు. స్మశానం అన్నారు. భూకంపాలు వస్తాయని ప్రచారం చేశారు. ఎన్ని విధాలుగా రాజధానికి నష్టం కలిగించాలో అన్నీ చేశారు. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు’ అని చంద్రబాబు విమర్శించారు.


  • అమరావతిని వైసీపీ నాశనం చేస్తే.. మేం చట్టబద్ధత కల్పిస్తూ శాసనం చేశాం. రాజధాని అభివృద్ధి విషయంలో విమర్శలకు భయపడి వెనకడుగు వేయబోం. అమరావతి అభివృద్ధితో పాటు విశాఖపట్నం, తిరుపతి లాంటి ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తున్నాం.

  • పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే.. వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై మద్దతు పలికాయి. ఇక్కడి నుంచి ఎంపీలుగా ఎన్నికైన వ్యక్తులు మాత్రం రాష్ట్రానికి ద్రోహం చేసేలా వ్యవహరించారు. పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించారు.

  • ఒంటిమిట్టలో శ్రీరాముని కల్యాణంలో పాల్గొన్న వేళే లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందింది. రాజ్యసభలో ఈ బిల్లు పాస్‌ అయిన రోజే పోలవరం డయాఫ్రం వాల్‌ కూడా పూర్తయింది.

  • 2028 నాటికల్లా రాజధాని నిర్మాణంలో ప్రధానమైన పనులన్నీ పూర్తవుతాయి. 2029లో మళ్లీ ప్రధాని మోదీని పిలిచి ప్రారంభోత్సవాలు చేయిస్తాం. అమరావతిని నాశనం చేయాలని కలలు కన్న వారి కలలన్నీ పగటి కలలుగానే మిగిలిపోతాయి.

- సీఎం చంద్రబాబు

Updated Date - Apr 04 , 2026 | 05:23 AM